Take a fresh look at your lifestyle.

ఫార్మాసిటీపై ప్రజల పక్షాన పోరాటం చేస్తాం

ఎట్టిపరిస్థితుల్లోనూ ఫార్మాసిటీ ఏర్పాటు కావొద్దు
ఈ ప్రాంత ఉనికిని కోల్పోయే పరిశ్రమలు మాకొద్దు
సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి
మేడిపల్లిలో కిసాన్‌సెల్‌ ఆధ్వర్యంలో ఫార్మసిటీ నిరసన సభ

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రల పక్షాన పోరాటం చేస్తామని సీఎల్పీ నేత మల్లు బట్టివిక్రమార్క, భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ ‌పార్టీ కిసాన్‌ ‌సెల్‌ ఆధ్వర్యంలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన సీఎల్పీ నేత మల్లు బట్టివిక్రమార్క మాట్లాడుతూ  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు మంచి జరగాల్సింది పోయి బాధలే మిగిలాయని ఆవేధన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములను లాక్కోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో 1, 2 కంపెనీలు ఉంటేనే అక్కడి ప్రాంతంలో ప్రజలు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నారని, అటువంటిది ఫార్మాసిటీ పేరుతో వేలాధి కంపెనీలు వస్తే ఈ ప్రాంతం పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలని అన్నారు. ఉనికిని కోల్పోవడమే కాకుండా ఈ ప్రాంతం కలుషితమయ్యి నివాసయోగ్యం కాకుండా పోతుందని పేర్కొన్నారు. ఫార్మాసిటీ పేరుతో కోట్లాది రూపాయలు దండుకోవడానికే ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు అండగా ఉంటూ వారి పక్షాన ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని అన్నారు. ప్రజా ఆమోదం లేని పరిశ్రమలను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. మూడు వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి దానిని 20 వేలకు ఎలా పెంచుతారని, ఎలా రైతుల నుండి లాక్కుంటారని అన్నారు.
భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ప్రధానమంత్రితో పలుమార్లు ఫార్మాసిటీని రద్దు చేయాలని చర్చించినట్లు తెలిపారు. ఇందుకు ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్ర మంత్రి ప్రకాష్‌జవదేకర్‌కు చెప్పి, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పినట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ అబద్ధమని, టీఆర్‌ఎస్‌ ‌నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజల అంగీకారం ఉందని తప్పుడు నివేధికలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని, పోలీసులు తూటాలు పేల్చినా కోమటిరెడ్డి గుండెను దాటిపోవాలే తప్ప పోరాటాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అడుగులు ముందుకు పడితే పోరాటంలో తాను అడుగులు ముందుకేస్తానని, పోరాటంలో ముందుంటానని అన్నారు. నిజమైన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి అప్పుడు భూసేకరణకు రావాలని హితవుపలికారు. ఈ సభలో మలక్‌పేట మాజీ ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంచార్జీ మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, కిసాన్‌సెల్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు కోదండరెడ్డి, ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న కందుకూరు, ముచ్చర్ల, యాచారం మండలాల్లోని గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply