Take a fresh look at your lifestyle.

రుణమాఫీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా?

  • రైతులు ఉరేసుకుంటున్నా కానరావడం లేదా
  • దళితబంధు నాటకంతో మళ్లీ మభ్యపెట్టే ఎత్తుగడ
  • విజయశాంతి ఫైర్‌

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై బిజెపి నేత విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో ఫైర్‌ అయ్యారు. మంగళవారం ఆమె సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేస్తూ…2018 ఎన్నికల నేపథ్యంలో రైతులకు లక్షరూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని సిఎం కేసీఆర్‌ ‌ప్రకటించి…అధికారంలోకి వొచ్చిన తర్వాత, కేవలం కొంతమంది రైతులకు 25 వేలు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు.  దీంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడమే కాకుండా… ఉన్న రుణానికి వడ్డీ కట్టించుకుంటూ రెన్యూవల్‌ ‌చేస్తున్నాయనీ,  పంట రుణమాఫీ కోసం రైతన్నలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారన్నారు.

ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఇదిగో రుణమాఫీ, అదిగో రుణమాఫీ అంటూ వోట్లు దండుకుని గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచి.. ఇప్పుడు మళ్లీ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలోనైనా రుణవిముక్తి కలుగుతుందని సంబరపడ్డ రైతుల కళ్ల వెంబడి కన్నీళ్లు కారేలా చేస్తున్నారన్నారు. సిఎం  కేసీఆర్‌, ‌వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి, ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు ఆగస్టు  1న  జరిగిన కేబినెట్‌ ‌మీటింగ్‌లో రైతు రుణమాఫీకి రూ.2006 కోట్లు అవసరమని ప్రతిపాదన చేసి,  స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా.. 50వేల రూపాయలలోపు ఉన్న రుణాలకు రుణ విముక్తి కల్పిస్తామని ప్రకటన చేశారనీ గుర్తు చేశారు.. ఆగస్టు 16 నుంచి 31లోపున వేస్తామని ఆశ పెట్టి, కేవలం ఆగస్టు 26 వరకు కొంతమంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాలో డబ్బు వేసి, ఆగస్టు 26 తర్వాత  4.97 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.1682 కోట్లకు గానూ.

ఒక్క రూపాయి కూడా వేయకపోవడంతో తెలంగాణ రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మారిందన్నారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి, మినుము, వరి పంటలు దెబ్బతినగా… ఇప్పుడు రుణమాఫీ జరగక, రాయితీ విత్తనాలు ఇవ్వక, రైతులు అప్పుల బాధతో ఉరి తాడుకు బలవుతున్నారనీ, బ్యాంకు నుండి తీసుకున్న పంట రుణాల రుణమాఫీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. కేవలం హుజురాబాద్‌ ఉప ఎన్నిక  కోసం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఆడుతున్న ‘దళిత బందు పథకం’ అనే నాటకం కోసం… రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ నిధులు తరలిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అప్పుల ఊబిలో ఉన్న రైతుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

ఇప్పటికైనా యావత్‌ ‌తెలంగాణ రైతులు ఆలోచించాలి. టిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ఆడుతున్న కపట నాటకాన్ని గమనించి రానున్న రోజుల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి తగిన బుద్ది చెప్పాలని ఆ పోస్టులో విజయశాంతి కోరారు.

Leave a Reply