- ఏదైనా పార్టీ విధానం నచ్చితే ఆలోచిస్తా
- లేదంటే ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతా
- మాజీ జెడి లక్ష్మీనారాయణ వెల్లడి
విశాఖపట్నం, ఫిబ్రవరి 21 : వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ పోటీ చేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. మనదేశంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసే వెసలుబాటు ఉందన్నారు. ఈమేరకు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. మంగళవారం వి•డియాతో మాట్లాడుతూ… తన ఆలోచన విధానాన్ని ఇప్పటికే స్పష్టం చేశానన్నారు. ఏదైనా పార్టీ తన ఆలోచనా విధానం నచ్చి వస్తే వారితో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మన ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. అప్పట్లో జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ పేరు రాష్ట్రమంతా మార్మోగిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి ఎంతో దూకుడుగా ఉంటూ అనేక విషయాలను బయటపెడుతూ నిత్యం వార్తల్లో నిలిచారు.
ఆపై వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన రాజకీయాల వైపు అడుగులేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ విధానాలు నచ్చి జనసేనలో చేరారు. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ…వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ పార్టీకి గుడ్‌బై చెప్పి సామాజిక సేవ చేయడం, రైతులకు అండగా నిలవడమే లక్ష్యంగా ముందుకెళతానని ప్రకటించారు. కానీ మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయంగా అడుగువేయాలని దృష్టిసారించారు. అయితే ఈ సారి లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుంచి బరిలోకి నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది.అయితే ఆయనను బిఆర్‌ఎస్ ఆహ్వానిస్తోందని వార్తలు వచ్చాయి.