Take a fresh look at your lifestyle.

సిఎం సభ హుజూరాబాద్‌ ‌రాజకీయాలను మార్చివేస్తుందా?

నిన్నటి వరకు హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో ఉన్న రాజకీయ వాతావరణం సిఎం కెసిఆర్‌ ‌సభతో మారి పోనుందా ? ఇదే ఇప్పుడిక్కడ ప్రధాన చర్చనీయాంశమైంది. ఈటల రాజేందర్‌ ‌రాజీనామా చేసి తిరిగి ఇక్కడి నుండే ఎన్నికల బరిలో నిలబడుతున్నట్లు ప్రకటించినప్పటి నుండి హుజూరాబాద్‌లో రాజకీయ వేడి రాజుకుంది. అప్పటి నుండి ఇక్కడి రాజకీయ వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు ఒక పార్టీకి పెద్ద దిక్కుగాఉన్న నాయకులు మరో పార్టీలో పరకాయ ప్రవేశం చేయడంతో రాజకీయాలు గజిబిజిగా మారాయి. ఈటల రాజీనామా చేసిననాటి నుండి బిజెపి తీర్థం తీసుకోకముందు, తీసుకున్న తర్వాత  నియోజకవర్గంలో కాలుకు బలపం కట్టుకుని  తిరుగుతున్నాడు. బండి సంజయ్‌లాంటి ఫైర్‌ ‌బ్రాండ్‌ అధ్యక్షుడిగా వొచ్చినప్పటి నుండి రాష్ట్ర బిజెపి శాఖ కాస్తా దూకుడుగానే ముందుకుపోతున్నది. హుజూరాబాద్‌లో స్వంతంగా ఈటలకు బలం ఉండటమేకాక, బిజెపి తోడుకావడంతో ఇక ఇక్కడ ఆయన గెలుపు ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ ‌కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నది. ఎట్టి పరిస్థితిలో టిఆర్‌ఎస్‌కు ఈ స్థానం దక్కకుండా చేయాలన్న లక్ష్యంగానే పోరాటం సాగిస్తున్నది ఆ పార్టీ. తాజాగా కొండా సురేఖను ఇక్కడి నుండి పోటీ పెడుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి.

అదే నిజమైతే ఇక్కడ పోటీ చాలా రసవత్తరంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే టిఆర్‌ఎస్‌ ‌కూడా తాజాగా తన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు  గెల్లి శ్రీనివాసయాదవ్‌ను ప్రకటించింది. ఆయన గెలుపుకోసం మంత్రులు, ఎంఎల్‌ఏలు, నాయకులంతా అక్కడే మకాంవేసి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇటీవల కాలంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వము, మంత్రులపై ప్రతిపక్షాలు తీవ్రంగా దాడిచేస్తున్నాయి. వాటన్నిటికీ సోమవారం నాటి సిఎం సభ సమాధానం చెప్పినట్లేనంటున్నాయి టిఆర్‌ఎస్‌ ‌వర్గాలు. ఈ సభలో సరాసరి ప్రతిపక్షాలపై నేరుగా ఎదురు దాడి చేయకపోయినా ఆయన ఉపన్యాసం ఆసాంతం వింటే వాటన్నిటికీ సమాధానం చెప్పినట్లైంది. ముఖ్యంగా హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో దళితుల వోట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నాడని సిఎం కెసిఆర్‌పై విరుచుకుపడుతున్న విపక్షాలకు ఆయన సమాధానం చెప్పారు.

వాస్తవంగా తనకు 25 ఏళ్ళ కిందినుండే దళితుల ఉన్నతికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఉన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆనాడే తన తోటి ఉద్యమకారులతో కలిసి దళిత జ్యోతి పేర కార్యక్రమాలను రూపొందించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇలా అణగారిన వారి జాతులు 125 వరకున్నాయన్న ఆధ్యయనం తామానాడే చేశామని, వాళ్ళ విముక్తికోసం ఏదో చ•యాలన్న తపన అప్పటినుండే ఉందని, ఇవ్వాళ హుజూరాబాద్‌ ఎన్నికలు వొచ్చాయని తాము కొత్తగా చేపడుతున్న కార్యక్రమం కాదని విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రంలో దళితుల జనాభా 75 లక్షలుగా ఉంది. తాము జరిపిన ఒక సర్వే ప్రకారం 17 లక్షల వరకు దళిత కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలు ఇతరులతో సమానంగా జీవనం సాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దాదాపు మూడు సంవత్సరాలుగా అధ్యయనం చేసిన తర్వాతే దళిత బంధుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.

దీంతో కేవలం హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే ఈ పథకాన్ని ముందుకు తెచ్చినట్లుగా ఇంతకాలం ప్రచారం చేస్తున్న విపక్షాలకు ధీటైన సమాధానాన్నిచ్చినట్లు అయింది. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. గొప్ప  గొప్ప నాయకులు వొచ్చారు.. పోయారు. కాని ఎవరికీ దళిత కుటుంబాలను ఉద్దరించే విషయంలో ఇలాంటి ఆలోచనే రాలేదు. దేశంలోనే ఎవరూ ఊహించని రీతిలో తాను ఆలోచించిన తీరు, భవిష్యత్‌లో దళితులకు ఆర్థిక హోదాను పెంచుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలన్ని ఈ పథకాన్ని ఒక రాజకీయ క్రీడగానే చూస్తున్నాయేగాని, ఇదొక పవిత్ర కార్యక్రమం, కర్తవ్యంగా భావించడంలేదని విపక్షాల ఆరోపణలకు ఘాటైన సమాధానమిచ్చారాయన. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ఇంట్లో అన్ని సగబెట్టుకుంటున్నట్లుగా ఒక్కొక్క  పథకాన్ని అమలు చేసుకుంటూ వొస్తున్న విషయన్ని చెబుతూ, దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత వర్గాలమీదనే ఉందని బాధ్యత వారిమీద పెట్టారు. దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, యువత, విద్యార్థులంతా దీన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంటే దీనివల్ల దళిత సమాజం మొత్తాన్ని ఈ ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయించేందుకు కెసిఆర్‌ ‌మంచి ఎత్తుగడే వేశాడనుకుంటున్నారు. ఆయన ఈ పథకంపై వివరించిన తీరు ఎన్నికల సభను మరిపించేదిగా ఉంది.

Leave a Reply