Take a fresh look at your lifestyle.

‘‌క్వాడ్‌’ ‌కూటమి వ్యూహాలతో చైనా దూకుడు తగ్గుతుందా..!

12 మార్చి 2021న జరిగిన క్వాడ్‌ (‌క్యాడ్రిలేటరల్‌ ‌సెక్యూరిటీ డైలాగ్‌, ‌చతుర్భుజ భద్రతా సంభాషణలు)’ కూటమి దేశాధినేతల తొలి చారిత్రక వర్చువల్‌ ‌శిఖరాగ్ర సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ చతుర్భుజ భద్రతా కూటమి భేటీలో ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షులు జోసెఫ్‌ ఆర్‌ ‌బైడెన్‌, ఆ‌స్ట్రేలియా ప్రధాని స్కాట్‌ ‌మారిసన్‌ ‌మరియు జపాన్‌ ‌ప్రధాని యోశిహిదే సుగా పాల్గొని కరోనా టీకాల తయారీ, ఇండో-పసిపిక్‌ ‌ప్రాంతీయ సమస్యలు, వాతావరణ మార్పులపై పోరు, కీలక ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞాన వినియోగాలు లాంటి ఎజెండా అంశాలపై సవివరంగా రెండు గంటల పాటు చర్చించారు.

చైనా ఒంటెద్దు పోకడలకు ముకుతాడు వేసే క్రమంలో భాగంగా ఇండో-పసిపిక్‌ ‌ప్రాంతంలోని దేశాలన్నింటికీ వందల కోట్ల టీకా డోసులను అందించేందుకు క్వాడ్‌ ‌దేశాలు నిర్ణయించడం జరిగింది. చైనా రూపొందించిన కరోనా టీకా 46.3 కోట్ల డోసులను ఇతర దేశాలకు అందుబాటులోకి తేవాలనే చైనా ధోరణులకు గండికొట్టి ఏకాకిని చేయటానికి క్వాడ్‌ ‌చేసిన ప్రయత్నంగా దీనిని అభివర్ణిస్తున్నారు. క్వాడ్‌ ‌దేశాల్లో అమెరికా సాంకేతిక పరిజ్ఞాన సహకారం, యూయస్‌-‌జపాన్‌ల ఆర్థిక సహాయం, ఆస్ట్రేలియా ఉపరితల రవాణా సహకారం మరియు ఇండియాలో నోవావాక్స్, ‌జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌ ‌కంపెనీల సహకారంతో చవకైన, సురక్షిత వందల కోట్ల టీకాల ఉత్పత్తి లాంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం ముదావహం. జర్మనీ, ఫ్రాన్స్ ‌లాంటి దేశాలున్న యూరోపియన్‌ ‌యూనియన్‌తో గతంలో చెడిన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలను కూడా క్వాడ్‌ ‌కూటమి సహాయంతో అమెరికన్‌ ‌బైడెన్‌ ‌చేస్తున్నారని అర్థం అవుతోంది. చైనాతో మంచి సంబంధాలు కలిగి ఉన్న దేశాలను తమ వైపుకు ఆకర్శించి చైనాను ఏకాకిగా కట్టడి చేయాలనే క్వాడ్‌ ‌కూటమి దేశాల పథకాలు ఫలించి, ప్రపంచ శాంతికి ఊతం ఇవ్వనున్నాయి.

2004లో సంభవించిన మానవ విలయ పెను సునామీ విరుచుకుపడి అపార ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చిన వేళ దేశాల మధ్య పరస్పర సహాయ సహకారంతో మానవీయ సేవలు అందించే సదుద్ధేశంతో ఏర్పడిన ‘చతుర్భుజ భద్రతా సంభాషణలు, క్వాడ్‌(‌క్యాడ్రిలేటరల్‌ ‌సెక్యూరిటీ డైలాగ్‌)’‌ల కూటమి వేదికలో ఇండియా, అమెరికా, జపాన్‌ ‌మరియు ఆస్ట్రేలియా చతురస్రంగా ఏకతాటిపైకి వచ్చాయి. 2007లో మరోసారి ప్రారంభమైన క్వాడ్‌ ‌కూటమి దేశాల సమావేశాల్లో సముద్ర జలాలతోనే స్వేచ్ఛ మరియు సుసంపన్నతలు ఫలించడానికి కృషి చేయడం జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌, ‌జపాన్‌ ‌ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని జాన్‌ ‌హోవర్డ్ ‌మరియు అమెరికా ఉపాధ్యక్షులు డిక్‌ ‌హోవర్డ్‌లు పాల్గొని ‘ఎక్సర్‌సైజ్‌ ‌మలబార్‌’ ‌పేరుతో సంయుక్త మిలిటరీ విన్యాసాలు మరియు విస్తృత సంప్రదింపులు జరిగాయి.

2008లో చైనా ప్రమేయంతో ఆస్ట్రేలియా క్వాడ్‌ ‌కూటమికి దూరం జరిగినా మళ్ళీ చేరింది. కొరకరాని కొయ్యగా మారుతున్న చైనా మిలటరీ ఆధిపత్యంతో ప్రతి సరిహద్దు దేశంతో ఏదో ఒక జగడానికి కాలు దువ్వుతున్నది. పొలిమేర దేశాలైన మయన్మార్‌, ‌బంగ్లాదేశ్‌, ‌శ్రీలంక, మాల్దీవ్స్, ‌పాకిస్థాన్‌ ‌లాంటి దేశాలలో నౌకా స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారత్‌ను లొంగదీసుకునే కుయుక్తులు పన్నుతున్నది. ఇలాంటి చైనా దుస్సాహసాలకు చెక్‌ ‌పెట్టే ఆయుధంగా ‘క్వాడ్‌’ ‌కూటమి నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. 2017లో మరోసారి ఇండియా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ‌ట్రంఫ్‌, ఆ‌స్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ ‌టర్న్‌బుల్‌ ‌మరియు జపాన్‌ ‌ప్రధాని షింజో ఆబేలు పాల్గొని ‘మనీలా’ భద్రతా ఒప్పందం చేసుకోవడం జరిగింది. 2019లో క్వాడ్‌ ‌కూటమి దేశాల మంత్రుల స్థాయి సమావేశం సెప్టెంబర్‌లో జరిగింది.

కోవిడ్‌-19 ‌నేపథ్యంలో 2020 నుండి క్వాడ్‌ ‌కూటమి దేశాలు ‘ఎక్సర్‌సైజ్‌ ‌మలబార్‌’ ‌నావికా విన్యాసాలు చేశారు. 2021 ఫిబ్రవరిలో క్వాడ్‌ ‌కూటమి దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో ఇండో-పసిపిక్‌ ‌ప్రాంత భద్రత మరియు మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు లాంటి అంశాలు చర్చించారు. క్వాడ్‌ ‌కూటమిని ‘ఏసియన్‌ ‌నాటో’గా కూడా అభివర్ణించడం జరుగుతోంది. ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదుగుతున్న చైనా అధిపత్యాన్ని అడ్డుకునే వేదికగా క్వాడ్‌ ‌కూటమి ఏర్పండిందనే అనుకుంటున్నారు. ఆసియా నాటే కూటమిగా క్వాడ్‌ ఇం‌డో-పసిపిక్‌ ‌సముద్ర జలాలపై చైనా పట్టుకు గండికొట్టి శాంతి మరియు సౌభ్రాతృత్వాల స్థాపనకు బాటలు వేయాలని కోరుకుందాం.

burra madhusudhan
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply