Take a fresh look at your lifestyle.

ఒక జర్నలిస్టు భార్య

“దుఃఖాన్ని, భయ విహ్వలతను పక్కన పెట్టి ఆమె రంగంలోకి దూకాల్సి వచ్చింది. వైనాడ్‌ ఎం‌పీగా పర్యటన చేయటానికి వచ్చిన రాహుల్‌ ‌గాంధీ దగ్గర నుండి -అందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆమె కలిసింది. సత్యాన్ని బయట పెట్టే ఎవరి మీదనైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి జర్నలిస్టు యూనియన్ల వాళ్లు అతని విడుదల కోసం ఉద్యమించాలని రెహనత్‌ అం‌టోంది.”

రమాసుందరి

‘నా భర్త ఒక జర్నలిస్టు, అందుకు నేను గర్వపడుతున్నాను’ అంటుంది సిద్దిక్‌ ‌కప్పన్‌ ‌భార్య రెహనత్‌. ‘‌నాకూ ఒక కూతురు ఉంది. నా భర్త ఒక ఆడపిల్ల అమానుష హత్య, అత్యాచారం గురించి రిపోర్ట్ ‌చేయటానికి వెళ్లటం నాకు సంతోషం కలిగించే విషయం’ అంటుందామె.

ఉత్తరప్రదేశ్‌ ‌హథ్రాస్‌ ‌లో ఒక బాలిక రేప్‌, ‌మర్డర్‌ ‌ఘటనను రిపోర్ట్ ‌చేయటానికి వెళుతుండగా ఆమె భర్త సిద్దిక్‌ ‌కప్పన్‌ ‌ను హథ్రాస్‌ ‌టోల్‌ ‌ప్లాజా వద్ద అక్టోబర్‌ 5‌న అరెస్టు చేశారు. నెలన్నర కాలం అతన్ని అతని లాయర్‌ ‌కూడా కలవలేకపోయాడు. ఇప్పటికీ ఉత్తర ప్రదేశ్‌ ‌పత్రికల్లో అతను ఒక ‘ఉగ్రవాది’ అనే వార్తలు వస్తున్నాయి.

రెహనత్‌ ఇం‌టర్మీడియట్‌ ‌మాత్రమే చదివింది. 19 ఏళ్లకే పెళ్లి అయి ముగ్గురు పిల్లల తల్లి అయ్యింది. భర్తతో తన జీవితం గురించి చెబుతూ, అతను జర్నలిస్టుగా ఎంత తక్కువ సంపాదన ఉన్నా చాలా సంతోషంగా ఉండేవాళ్లమని చెప్పింది. తన భర్త తనకు స్నేహితుడు, ఆత్మబంధువు కూడా అని చెప్పింది.

గల్ఫ్ ‌దేశాల్లో టీచర్‌ ‌గా పని చేయటానికి వెళ్లిన సిద్దిక్‌ ‌జర్నలిజం మీద పేషన్‌ ‌తో 2011లో కేరళ తిరిగి వచ్చాడు. తేజస్‌ అనే ఢిల్లీ కేంద్రంగా వార్తలనందించే పత్రికలో పని చేసాక అది నిధులు లేక మూతపడింది. తల్‌ ‌సమియమ్‌ ‌లో కూడా అదే పరిస్థితి ఉండటంతో 7 నెలల జీతాన్ని వదులుకొని బయటకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కుటుంబం ఆర్థికంగా నానా పాట్లు పడింది. తరువాత వీక్షణం, మంగళం లాంటి కేరళ కేంద్రంగా ఉన్న పత్రికల్లో పని చేశాడు. అందరిలాగే -కోవిడ్‌ ‌జర్నలిస్టులకు జీవనోపాధి లేకుండా చేసింది. చివరకు ఢిల్లీ కేంద్రంగా వస్తోన్న అళిముగం. కామ్‌ అనే ఒక న్యూస్‌ ‌వెబ్‌ ‌పోర్టల్‌ ‌లో గత సంవత్సరం చివర్లో జర్నలిస్టుగా కుదురుకొన్నాడు. ‘సిద్ధిక్‌ ‌ఢిల్లీ నుండి విస్తృతంగా రిపోర్ట్ ‌చేసేవాడు. జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పుల గురించీ, ఈశాన్య రాష్ట్రాల గురించీ, ప్రాంతీయ ఎన్నికల గురించీ వార్తల నందించేవాడు. సుప్రీం కోర్టు గురించి కూడా రాసేవాడు. అతను చాలా బాలన్సింగ్‌ ‌గా, జాగ్రత్తగా ఉండే జర్నలిస్టు’ అని తేజస్‌ ‌గత సంపాదకుడు ఎన్‌ ‌పీ చక్కుట్టి చెప్పాడు.

ఉత్తర కేరళలోని మలప్పురం జిల్లా వెంగర నియోజక వర్గంలోని పూచోలమడు గ్రామంలో -వాళ్ల ఇంటి గురించి వాకాబు చేస్తూ మేము తిరుగుతున్నపుడు ఏడవ తరగతి చదువుతున్న సిద్దిక్‌ ‌రెండో కొడుకు ముహమ్మద్‌ ‌జిదాన్‌ ‌చిరునవ్వు ముఖంతో మా దగ్గరకు వచ్చాడు. వెంటబెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్లాడు. ఎత్తులూ పల్లాలూ నడిచిన తరువాత మేము చేరుకొన్న ఆ పూర్తి కాని ఇంట్లో, ఆమె తన ముగ్గురు పిల్లలతో జీవిస్తుంది. రెండవ తరగతి చదువుతున్న సిద్దిక్‌ ‌చిన్న కూతురు మెహ్‌ ‌నజ్‌ ‌తన సహజ నవ్వుతో మమ్మల్ని చూసింది. మేము ముద్దు చేస్తూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా -తండ్రి జైల్లో ఉన్నాడనే విషయం చెబుతూ ఆ చందమామ చిన్నబోయింది.

ఆరోగ్యం విషమంగా ఉన్న సిద్దిక్‌ ‌కప్పన్‌ 90 ఏళ్ల తల్లి ఖదీజ కుట్టిని, వెంగర నర్సింగ్‌ ‌హోమ్‌ ‌వాళ్లు పెదవి విరిచి ఇంటికి పంపించేశారు. చిన్న కొడుకు అయిన సిద్దిక్‌ ‌మీద ఆ తల్లికుండే ఇష్టం, మొదట్లో అతని గురించి గురించి పదే పదే అడిగేటట్లు చేసింది. ఇప్పుడిక ఆమె ఏమీ తెలియని అపస్మారక స్థితిలో ఉంది. ముక్కులద్వారా ఆహారం వెళుతున్న అంత్యదశ ఆమెది. ఇక భార్య రెహనత్‌ ‌కు సిద్దిక్‌ అరెస్టు అయినప్పటి నుండి కంటికి కునుకు లేదు. కడుపు నిండా తిన్నదీ లేదు.

రెహనత్‌ ‌కు ఈ కష్టం కొత్తది. అక్టోబర్‌ 4‌న అతని నుండి ఫోన్‌ ‌వచ్చింది. 5న లేదు. 6న అతని అరెస్టు గురించి ఆసియా నెట్‌ ‌ఛానల్‌ ‌లో వస్తుందని బంధువుల వాట్స్ అప్‌ ‌గ్రూప్‌ ‌లో ఎవరో పెడితే తల్లీ పిల్లలు తెలుసుకొన్నారు. తరువాత ఢిల్లీ కేరళ యూనియన్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టస్ ‌నుండి ఇది చాలా చిన్న విషయం అనీ, రెండు రోజుల్లో వదిలేస్తారని అనే కబురు అందింది కానీ, అది చిన్న విషయం కాదని వాళ్లకు అర్థం అయ్యింది. అతని మీద ఉపా పెట్టారని తెలుసుకొన్నారు. కేరళ వర్కింగ్‌ ‌జర్నలిస్టు యూనియన్‌ ‌ఢిల్లీ సెక్రెటరీ అయిన సిద్దిక్‌ ‌కప్పన్‌ ‌కు త్వరిత న్యాయ సహాయం అందే కిటికీ మూసుకొని పోయింది.

రెహనత్‌ ‌కష్టాలు మొదలైయ్యాయి. భర్త ఆచూకీ గురించి ఎలాంటి వార్త తెలియదు. అతను అరెస్టు అయ్యాడని చెప్పటానికి ఎలాంటి ఆధారం లేదు. ఠాకూర్లకు శిక్ష పడకుండా చేసిన వ్యవస్థను ప్రశ్నించిన నిరసనకారుల మీద యూపీ ప్రభుత్వం19 ఎఫ్ఫైయ్యార్లను నమోదు చేసిన తరువాత ఈ అరెస్టు జరిగింది, ఎవరినైనా అరెస్టు చేస్తే అతని కుటుంబానికి తెలపాలన్న కనీస బాధ్యతను కూడా సెంట్రల్‌ ‌పోలీస్‌ ఏజెన్సీస్‌ ‌తీసుకోలేదు. ఆ అరెస్టు తీవ్రత రెహనత్‌ ‌కు అర్థం అవటానికి ఎక్కువ కాలం పట్టలేదు.

హథ్రాస్‌ ‌లో తాత్కాలికంగా ఒక బడిలో ఏర్పాటు చేసిన జైల్లో అతన్ని కలవటానికి వెళ్లిన లాయర్‌ ‌విల్స్ ‌మాథ్యూకు లోపల నుండి బిగ్గరగా ఏడుస్తున్న గొంతులు వినబడ్డాయి. తాము అక్కడ ఉన్నామని చెప్పటానికే వాళ్లు ఏడుస్తున్నారని విల్స్ ‌మాథ్యూకు అర్థం అవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలాంటి హర్రర్‌ ‌కథనాలను వింటూ రెహనత్‌ ‌గుండె చిక్కబట్టుకొంది.

అతని కంప్యూటర్‌ ‌లో జస్టిస్‌ ‌ఫర్‌ ‌హథ్రాస్‌ ‌విక్టిమ్‌ అనే సైటు ద్వారా అతనికి వందకోట్లు అందాయనీబీ అతను కాంపస్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా అనే సంస్థకు చెందిన వారితో కలిసి హథ్రాస్‌ ‌కు కారులో ప్రయాణం చేశాడనీ, అతని మీద దేశ ద్రోహి, ఉగ్రవాది అనే కేసులు పెడతారనీ -రోజుకో వార్త ఆమెకు వస్తోంది. కాంపస్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా వ్యక్తులతో ఆయన ప్రయాణం యాదృచ్ఛికంగా జరిగింది అనీ, భారతదేశంలో ఆ సంస్థ నిషిద్ధ సంస్థ కాదనీ ఆమెకు తెలుసు. అయినా తన భర్త మీద ఎందుకు ఉపా కేసు పెట్టారో ఆమెకు అర్థం కాలేదు.

దుఃఖాన్ని, భయ విహ్వలతను పక్కన పెట్టి ఆమె రంగంలోకి దూకాల్సి వచ్చింది. వైనాడ్‌ ఎం‌పీగా పర్యటన చేయటానికి వచ్చిన రాహుల్‌ ‌గాంధీ దగ్గర నుండి -అందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆమె కలిసింది. సత్యాన్ని బయట పెట్టే ఎవరి మీదనైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి జర్నలిస్టు యూనియన్ల వాళ్లు అతని విడుదల కోసం ఉద్యమించాలని రెహనత్‌ అం‌టోంది.

కాంగ్రెస్స్ ‌నాయకుడు ఎంఎం హుస్సైన్‌ ఆ ‌కుటుంబాన్ని కలవటానికి వచ్చినపుడు, అతని వెంట వచ్చిన జర్నలిస్టులను ఉద్దేశించి ‘మమ్మల్ని కలవటానికి వచ్చిన రాజకీయ నాయకుల వెంట తిరగటం కంటే, వాళ్లు సిద్దిక్‌ అరెస్టుకు నిరసన తెలియచేయటం మంచిదని’ చెప్పింది. కేరళ ముఖ్యమంత్రికి ఇచ్చిన మెమోరాండంకు సెంట్రల్‌ ఏజెన్సీ చేసిన అరెస్టు కాబట్టి తాము ఏమీ చేయలేమని సమాధానం వచ్చింది. అయినా రెహనత్‌ ‌స్థైర్యం కోల్పోలేదు. సిద్దిక్‌ ‌కప్పన్‌ ‌కోసం కేరళలో జరిగిన అన్ని సభల్లో రెహనత్‌, ‌పిల్లలూ వచ్చి పాల్గొన్నారు. ఆ పసిముఖాల్లో తండ్రి విడుదల కోసం, రేపు తాము నివసించబోతున్న దేశంలో తమ భవిష్యత్‌ ‌కోసం ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.

 

Leave a Reply