Take a fresh look at your lifestyle.

ఆచారాల పేరుతో వితంతువులను .. హింసించడం ఇంకెన్నాళ్లు..?

ఆనాది కాలం నుండే భర్త మరణించిన మహిళల పట్ల స్మృతుల నిబంధనలు, పురాణాల ధర్మ బోధనలు వితంతువులను మానసికంగా హింసించి వారి పట్ల పైశాచిక ఆనందాన్ని పొందినట్లు సాహిత్యపు ఆధారాల ద్వారా ప్రస్ఫుటమౌతుంది. విధి వక్రీకరించి భర్త మరణించిన మహిళలను నేటి అత్యాధునిక కాలంలో కూడా వారిని కారకులను చేస్తూ మానసిక హింసకు గురిచేయడం పరిపాటిగా మారిందంటే పురాణాల బోధనల ప్రభావం నేటికీ కొనసాగుతుందని చెప్పక తప్పదు. సామాజిక పరిణామంలో వితంతువులు ఎన్నో అగచాట్లకు గురవుతున్నారు. సదాచారాల పేరుతో వితంతు, ఒంటరి మహిళలపై విధించిన ఆంక్షలు, మూఢాచారాలు ఎంత హేయకరమైనవో ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. సామాజిక జీవితంలో ఎన్ని మార్పులు జరిగినా, ఎన్ని వ్యవస్థలు మారినా వితంతు మహిళల పట్ల పురుషులు తీసుకుంటున్న వైఖరిలో పెద్దగా మార్పు వచ్చిందని ఇప్పటికీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి.

భర్త మరణించిన తరువాత తెల్ల బట్టలు కట్టి, ఒక పూట భోజనం చేసి, నేల మీద పడుకోవాలని, కళ్ళకు కాటుక పెట్టకుండా, రంగుల దుస్తులు కట్టకుండా, కేశాలంకరణ చేయకుండా, సువాసన తైలాలు, పూలు, నగలు వదిలేసి రాత్రి చాపపై నిద్రించాలనే కట్టుబాట్లు నేటి ఆధునిక వితంతువులకు నైరాశ్యం కలిగించినా సాటి మహిళల వెక్కిరింతలు, ముక్కు మీద వేలు వేసుకోవడాలు లాంటి వాటితో మరింత మానసికంగా కుంగిపోతున్నారు. పై కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఎక్కడ నుంచి వచ్చాయని ఒకసారి గమనిస్తే వివిధ రకాల స్మృతుల వల్లనే అని వెల్లడవుతుంది. ఉదాహరణకు విధవరాలికన్న అశుభమైనది లేదని, ఆమె చూపు పడితే ఏ పని జరగదని స్కాంద పురాణం, విధవరాలి దీవెనలు విషంతో సమానమని, విధవరాలు మంచం మీద శయనిస్తే భర్త నరకంలో కూలుతాడని కాశీఖండం బోధిస్తుంది.

ఇలాంటి అనాచార పద్ధతులను ఆధునిక సమాజం కూడా వంత పాడడం సరైంది కాదు. ప్రాచీన నాగరికతలోనే సాధారణ మహిళలతో పాటు వితంతు, ఒంటరి మహిళల పట్ల ఎందరో సంస్కర్తలు సామాజిక బెదిరింపులకు లొంగకుండా ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. ఇవన్నీ ఆశయాలుగా, ఉద్యమాలు గా పేరుగాంచాయి గానీ నేటి సమాజం ఆచరణలో పెట్టలేకపోతోంది. అత్యాధునిక నాగరిక కాలం అనుకుంటున్న ఈ నాటికి కూడా వితంతు మహిళల పట్ల మూఢత్వాన్ని గమనిస్తే సమాజంలో పేరుకుపోయిన ఆచారాలు, శాస్త్రాల పేరిట సాగిన బూటకాలు, ధర్మ బోధనలు, స్మృతులు అందించిన నియమాల పేరుతో మానసికంగా కుంగదీస్తూ వితంతు, ఒంటరి మహిళల స్వేచ్ఛను హరించడం కరెక్ట్ ‌కాదు. వితంతువుల పట్ల సాంఘీక జాఢ్యాలకు పాల్పడే సమాజపు అనాలోచిత కట్టుబాట్లను తెగ నరకాలి.

అందుకు వితంతు మహిళా లోకం కళ్ళేర్ర చేయాలి. హిందూ మత ధర్మశాస్త్రాలుగా చెప్పే మితాక్షర, దయాభాగ, మనుస్మృతి లాంటివి వితంతు మహిళల పట్ల శాపంగా పరిణమించిన మాట వాస్తవం. అలాంటి దుర్మార్గమైన ఆచారాలను నిషేధించాలనే కనీస దృక్పథం నేటి కాలంలో కరువైంది. వితంతువులను సాంఘీకంగా అన్ని విధాల విముక్తి కలిగించి,వారికి అండగా నిలవాల్సిన అత్యంత ఆధునిక విజ్ఞానాన్ని పొందిన మేథావులు సైతం ఆ దురాచారాలను అనుసరించడం సిగ్గుచేటు. వితంతువులు కూడా సాటి మనిషేనన్న నగ్న సత్యాన్ని మర్చిపోవడం వల్ల వ్యవహారశైలి పేరుతో నేటి కాలపు సమాజంలో వితంతువులు అనేక రకాలైన వివక్షతల్ని ఎదుర్కొంటున్నారు. భర్త చనిపోయిన తరువాత అనాకారి రూపంలో ఉంటూ యావజ్జీవితం కుటుంబ బానిసగా మారి చాకిరి చేపించే వ్యవస్థలోనే మనం ఉన్నాం. భార్య చనిపోయిన వెంటనే భర్త పెళ్లి చేసుకోవచ్చు మరి భర్త చనిపోయిన మహిళకు ఇన్ని సంకెళ్లెందుకు?

ప్రాచీన కాలంలోనే గాక ఆధునిక కాలంలో కూడా ఆ సంకెళ్ళలోనే బంధింపబడి ఉండడానికి కారణాలను వుటంకిస్తే పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు వితంతు మహిళల పట్ల అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల మూలమేనని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఆనాది కాలంగా పట్టిపీడిస్తున్న దురాచారాలను తొలగించడానికి 19వ శతాబ్దంలో ఎంతోమంది సంస్కర్తలు వితంతు, ఒంటరి మహిళలకు బాసటగా ఉద్యమాలు నడిపారు. అయినా ఉద్యమ ఫలితాలు ఎందుకు వీరికి అందడం లేదు. నేడు 21వ శతాబ్ధంలో మనం ఉన్నప్పటికీ వితంతువుల పై సదాచారాల పేరుతో, సామాజిక కట్టుబాట్లు, హింసాత్మక ఘటనలు, సామాజిక అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. సామాజిక అణిచివేతకు గురవుతూనే ఉన్నారు. ఉదాహరణకు వితంతువులకు పునర్వివాహ హక్కు కల్పించడం ఈ చట్టంపై పార్లమెంటులో చర్చించినప్పటికీ హిందూ మనువాద నాయకులు అడ్డుకోవడం మూలాన నేటికి వితంతువులు పూర్వాచార సంప్రదాయాల పేరున వివక్షకు గురికావడమే ఇందుకు నిదర్శనం.

వితంతు, ఒంటరి మహిళలు సంకెళ్లను ఒక్కొక్కటిగా తెంచుకొంటూ ముందుకు సాగడానికి ప్రయత్నించినా కూడా అనేక అమానుషాలు, అవమానాలు ఇంటి నుండే మొదలు కావడం, సమాజం వాటికి వంత పాడటంతో అన్యాయ పర్వంలోనే వితంతు, ఒంటరి మహిళల బతుకులు వేలాడుతున్నాయి. ఏ వయసులో భర్త చనిపోయిన వితంతువుగానే ఉండే ఆచారం హిందు సమాజంలో వుండటం వల్ల ఆమె జీవన విధానంపై అనేక ఆంక్షలు పెరిగి పునర్వివాహం చేసుకోరాదనే ఆచారం మొదలైంది. వితంతు మహిళల బంధువుల్లో మానవతా దృష్టి కొరవడటం, ఆమె కనబడితే అశుభంగా భావించడం, వివాహాది శుభకార్యాలకు హాజరు కావడానికి వీలులేదనే ఆంక్షలు ఏర్పర్చడం ఎందు మూలాన దాపురించాయో…? నవ సమాజం ఎటువైపు పయనిస్తుందో అర్థం కావడం లేదు. వితంతు ఒంటరి మహిళల పట్ల నేటి సమాజం అనుసరిస్తున్న విధానాలను చూస్తే సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుండి ఈ ఆధునిక సమాజం బయటకి రావాలంటే వైవిధ్య భరితమైన జీవనాన్ని సాగిస్తున్న వితంతు మహిళల కుటుంబాలపై వారి మనోభావాలపై పరిశోధన జరిపించి నిర్ణయాత్మక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అట్టి నియమాల అమలులో పాలకులు ముందుండాలి. ప్రాచీన కాలపు కట్టుబాట్లను త్యజించి ఆధునిక కాలంలో సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రేమ, ఆప్యాయత, మానవత్వం వంటి నైతిక విలువలతో కొత్త వితంతు తరం కొత్త పుంతలు తొక్కాలి. నేటి శాస్త్రీయ సాంకేతిక సమాజంలో వితంతు, ఒంటరి మహిళలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత ఆశిస్తున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య, ఉపాధి అవకాశాలు పొంది ఆర్థిక స్వాతంత్య్రం సాధించే క్రమంలో కూడా పూర్వాచార సాంప్రదాయాలు సమాజం నుండి అడ్డుతగలడంతో సతమతమవుతున్నారు. వారిలో ఉన్న నిస్సహాయత, శారీరక దుర్బలత, సమాజం సృష్టించే దుష్పరిణామాలను సైతం ఎదుర్కోక తప్పడం లేదు. వితంతు, ఒంటరి మహిళల స్వేచ్ఛను హరించి సాంప్రదాయాలు, రీతి రివాజులు, ఆచారాల పేరుతో మానసికంగా హింసించడం అత్యంత హేయకరం. ఆయా పరిధిలో నిలిచి అనుభవిస్తే తెలుస్తుంది వితంతువులు ఏవిధంగా భరిస్తున్నారోనని అర్థమవుతుంది. వితంతువుల పట్ల మన చుట్టూ జరుగుతున్న సంగతులను మనం ఎంత వరకు గమనిస్తున్నాం. ఎలా స్పందిస్తున్నాం అన్నది ఒక సారి అవలోకనం చేసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నదన్న సంగతిని మర్చిపోతున్నాం. భర్త మరణిస్తే వీరిపట్ల మూస దృక్పథాలను అమలు పరచడం వల్ల అవమానాలను సహిస్తూ జీవితాంతం వైధవ్యం పేరుతో కట్టుబాట్ల మధ్య కుంగిపోతున్నారు. అలా కాకుండా వితంతు, ఒంటరి మహిళలను సాంఘికంగా అన్ని విధాల విముక్తి కలిగించడానికి సమాజం కంకణం కట్టుకున్నప్పుడే ఆచారాల పేరుతో హింసించే దురాచారం నుండి వితంతువులు విముక్తులు అవుతారు. అప్పుడే సమాజంలో వీరికి సంపూర్ణ గౌరవం దక్కుతుంది. అలా వారు తలెత్తుకున్నప్పుడే వితంతువుల పట్ల సమాజం పూర్తి స్థాయిలో చైతన్యవంతమైనట్లు లెక్క.
– సంద బాబు, వితంతు ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం, డైరెక్టర్‌ ‌ములుగు జిల్లా
సెల్‌ ‌నంబర్‌. 9550066713

Leave a Reply