- ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న
- కోవిడ్ బులెటిన్ మాదిరిగా వివరాలు ఇస్తామన్న ప్రభుత్వం
- నేడు తుది తీర్పు ఇవ్వనున్న హైకోర్టు
సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించిన కవరేజికి మీడియాకు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోవిడ్ బులెటిన్ మాదిరిగా కూల్చివేతల వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. సచివాలయ భవనాల కూల్చివేతలకు మీడియాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. తమకు ప్రత్యక్ష ప్రసారాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 90 ప్రకారం మీడియా స్వేచ్ఛకు ప్రభుత్వం ఆటంకం కలిగిస్తున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, పరిస్థితుల ప్రభావంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణకు అర్హమైనది కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించగా ఎందుకు లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సచివాలయ పరిసర ప్రాంతాలలోకి వెళ్లి కూల్చివేతలను కవర్ చేస్తున్న మీడియాను అడ్డుకున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది సచివాలయం ఉన్న ప్రాంతంలో నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయనీ, ఇది నిజమో కాదో తేలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం కూల్చివేత పనులను ఎందుకు ఇంత రహాస్యంగా చేపడుతున్నదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అనంత పద్మనాభస్వామి దేవాలయం కోట్ల రూపాయల సంపదను లైవ్లో చూపించిన మీడియాను ఇప్పుడు ఎందుకు కట్టడి చేస్తున్నారని ప్రశ్నింంచింది. ప్రభుత్వం మీడియాకు సచివాలయ కూల్చివేతలను అనుమతించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నదనీ కోర్టు పేర్కొంది. కూల్చివేత వద్దకు ఎవరినీ అనుమతించవద్దని నిబంధనలు చెబుతున్నాయనీ, కోవిడ్ మాదిరిగా మీడియాకు బులెటిన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏజీ తెలుపగా, ఆ బులెటిన్లో కోవిడ్ మాదిరిగానే వివరాలు సరిగా ఉండవని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం టూర్ ఏర్పాటు చేసి మీడియాను తీసుకువెళ్లగలరా ? అని ప్రశ్నించగా, జర్నలిస్టులను ఒకేసారి కూల్చివేతల ప్రాంతాలకు అనుమతిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనీ, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరగవచ్చని పేర్కొన్నారు. యుద్ధాలు, ఇతర ప్రమాదకరమైన సంఘటనలను చిత్రీకరించడం జర్నలిస్టులకు అలవాటే కదా అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. చుట్టు పక్కల ప్రైవేటు భవనాల పైనుంచి కూడా చిత్రీకరణను అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకు రాగా, ప్రైవేటు భవనాల నుంచి చిత్రీకరిస్తే అడ్డుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తుది తీర్పు ఇస్తామని పేర్కొంటూ హైకోర్టు తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది.