Take a fresh look at your lifestyle.

అడవి బిడ్డలపై కర్కశత్వం ఎందుకు?

అభం శుభం తెలియని అడవిలో మనుషులు, కల్లా కపటం ఎరుగని అమాయకులు, మోసం వేషం, ద్వేషం, సంపద, సంపాదన తెలియని వారు, అడవిని, ప్రకృతి ఒడిని నమ్ముకొని నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ఆదివాసీలు. సాంప్రదాయం ప్రకారం విప్ప పూల సేకరణకు అడవికి వెళ్లి పొద్దంతా తిరిగి తిరిగి అలసి పోయి రాత్రి అడవిలోనే నిద్రిస్తున్న వారిపై అర్ధరాత్రి విచక్షణారహితంగా ఆడ,మగ అనే తేడా లేకుండా పశువులను బాదినట్లు ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం వారిని విచక్షణా రహితంగా కొట్టింది? ఆ అధికారం ఎవరిచ్చారు. మహిళలు, వయసుడిగిన పెద్దలపై అటవీ అధికారులు దాడి చేయడం అమానుషం కాదా. ..

వృద్ధులను, స్త్రీలను బూటు కాళ్లతో తన్ని తీవ్రంగా మర్మాంగాలను కూడా గాయపరచి రాక్షసత్వాన్ని ప్రదర్శించడమేమిటి. నాగర్‌ ‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చెంచపలుగు తండ, గుంపాంవలి గ్రామాల పాతికమంది గిరిజనులు బల్మూరు మండల బాణాలఅటవీ ప్రాంతం బండ చెలిమి సమీపంలో విప్ప పూల సేకరణ కు వెళితే వీరిపై దాడి జరిపి మన్ననూరు బేస్‌ ‌క్యాంపులో బంధించారు… అదేవిధంగా సూర్యాపేట జిల్లా గుర్రంపొడులో గిరిజన భూములను ఆక్రమించుకుని అధికార పార్టీ నేతకు సంబంధించిన కాంట్రాక్టర్‌ ‌సంస్థ ఏకంగా నిర్మాణపు పనులు చేపట్టడంతో గిరిజనులు తమ భూములను లాక్కో వద్దని ఎదురు తిరగడంతో వారిపై అధికారులు విరుచుకుపడ్డారు.

2017 సెప్టెంబర్‌ ‌లో జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం గుత్తికోయల గూడెం పై దాడిచేసి గుడిసెలుతగలబెట్టారు. నిర్మల్‌, ‌కొమురం భీం, ఆదిలాబాద్‌ ‌జిల్లాలో పలుచోట్ల అధికారులు దాడులు జరిపారు. ఆదివాసుల పై పాలకులకు ఉన్న శ్రద్ధ ఏమిటో ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రకృతి ఒడిలో తమ సంస్కృతీ సాంప్రదాయాలతో జీవిస్తున్న వారి అభివృద్ధికి అనేక చట్టాలున్నాయి. రాజ్యాంగం 5 ,6 షెడ్యూల్‌ ‌ను గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించడానికి పొందుపరచారు.

15వ, 16 వ అధికరణ ప్రకారం విద్యాపరంగా , ఆర్థికంగా ప్రభుత్వ సర్వీసులలో వెనుకబడిన వారికి తగినంతగా ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రత్యేక నిబంధనలు చేయడానికి ఆటంకం లేదని చెబుతున్నాయి. 275 వ అధికరణం ప్రకారం ఇతర ప్రాంతాలతో సమానంగా షెడ్యూల్డ్ ‌ప్రాంతంలో కూడా రాష్ట్ర నికర ఆదాయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్రం వివిధ పథకాలను భారత సంచిత నిధి నుండి ఖర్చు చేయవచ్చు. 322,330, 334 అధికరణల ప్రకారం శాసనసభ, పార్లమెంట్‌ ‌నియోజక వర్గాలను షెడ్యూల్డ్ ‌తెగల వారికి కేటాయించాలి. అటవీ భూముల మీద ఆధారపడ్డ గిరిజనులకు, గిరిజనేతరులకు వేటాడటం తప్ప అన్నిరకాల హక్కులు కల్పించారు.

ఈ విధంగా ఆదివాసీలకు హక్కులు, చట్టాలు కల్పించినా వాటి అమలులో తీవ్ర అలసత్వం నెలకొంది. ఈ చట్టాల ప్రకారం అడవి బిడ్డలకు హక్కులు రాయితీలు కల్పించి అభివృద్ధి చేయ వలసిన పాలకులు, అటవీ సంపదను కాజేసి కార్పొరేటు పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడానికి ఉపక్రమించడం విచారం. . వాటికి అడ్డుగా ఉన్నారనే సాకుతో అవకాశం దొరికిన ప్పుడల్లా ఆదివాసీలపై దాడులు చేసితున్నారు ప్రభుత్వాధికారులు. . వారిని అడవి నుండి తరిమి 42 రకాల ఖనిజ వనరులను వెలికితీసేందుకు బడా పారిశ్రామిక కార్పొరేట్‌ ‌పెద్దలు కృషి చేస్తున్నారు..

ఆ ప్రయత్నాల్లో భాగంగానే భయానక వాతావరణం సృష్టించి, శాంతి భద్రతల సమస్య పేరుతో అడవి బిడ్డల మీద కేసులు నమోదు చేసి జైలుపాలు చేయడం జరుగుతోంది. ఇకనైనా ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టం ప్రకారం అన్ని రకాల హక్కులు గుర్తించి , హక్కు పత్రాలను అందజేసి, రైతులుగా గుర్తించి సాధారణ రైతులకు లభించే అన్ని రకాల రాయితీలు పథకాలు ఆదివాసీలకు వర్తింప చేయాలి. సహజ న్యాయ సూత్రాల ప్రకారం వారి సంక్షేమం ,అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది……

tanda sadhananda
తండా సదానందం, మహబూబాబాద్‌ ‌జిల్లా.

Leave a Reply