“మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలిప్ కుమార్ రచించిన ‘నేను నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం’ పుస్తకావిష్కరణ చేసిన ముఖ్య అతిథి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.”

ప్రజాతంత్ర,హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అని బాధేస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రామ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ రచించిన ‘‘నేను నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం’’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై దీప ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి గౌరవ అతిధిగా తొలి పుస్తక స్వీకర్త, ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ప్రజాగాయకురాలు విమలక్క, రావుల చంద్రశేఖరరెడ్డి, ప్రొ.గాలి వినోద్‌కుమార్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ప్రొ.కేశవరావుజాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇంత పెద్ద సభను ఇప్పుడే చూస్తున్నానని పేర్కొన్నారు.
తాను గురువుగా భావించే విద్యావేత్త చుక్కా రామయ్యకు తొలి పుస్తకాన్ని అందించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. దిలీప్‌కుమార్ రాసిన పుస్తకంలో వాస్తవాలుచాలా ఆకట్టుకున్నాయన్నారు. ఒక అధికారిగా ఉంటూ ఇలాంటి పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. తనకంటూ ఉద్యమంలో కష్టపడి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దిలీప్‌కుమార్ అని ప్రశంసించారు. అందరం తెలంగాణ అభివృద్ధికి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పుస్తకంలో ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే చాలా బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడైనా ఉద్యమ కారులకు సరైన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా ఈ పుస్తకాన్ని రచయిత దిలీప్‌కుమార్ కోరిక మేరకు తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ.కేశవరావు జాదవ్‌కు అంకితమిచ్చారు.
Tags: Telangana is brought, Dattatreya Governor, Himachal Pradesh,nenu naa telangana udhyama prasthanam book