బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కథానాయక పాత్రలో కనిపించిన తాండవ్ అనే వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా అసహనానికి, అలజడికి కారణమైంది. హిందూ దేవుళ్ళను కించపరుస్తూ ఇందులో సంభాషణలు ఉన్నాయని,దేశ ప్రధానిని అవహేళన చేసే విధంగా కథానాయకుడిగా ఉన్న వ్యక్తి హావభావాలు,సంభాషణలు ఉన్నాయని మహిళల్ని కించపరిచే విధంగా సంభాషణలు ఉన్నాయని ఆరోపణలు వస్తుండగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ఇప్పటికే చిత్ర బృందానికి ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.అయితే హిందూ దేవుళ్లను అవమాన పరిచారా లేక వర్తమాన రాజకీయాల మీద వ్యంగ్యంగా చిత్ర దర్శకుడు చురకలు అంటించాడా అనేది ట్రైలర్ చూస్తే స్పష్టంగా అవగతమవుతుంది.ఏది ఏమైనా నటులు సైఫ్ అలీఖాన్,మహమ్మద్ జీషన్ ఆయుబ్ ముస్లింలు కావడం మూలాన్నే వారిని టార్గెట్ చేశారనే ఆరోపణలు మరోవైపు ఊపందుకున్నాయి.ఏది ఎలా ఉన్నప్పటికీ మనోభావాల గురించి చర్చ వచ్చింది కాబట్టి మరోసారి మాట్లాడుకుంటే మంచిదేమో.
దివాళీ టపాసులపై వచ్చే హిందూ దేవుళ్ళ చిత్రాలు,వివాహ పత్రికలపై వచ్చే దేవుళ్ళ చిత్రాలు,రకరకాల అలంకార వస్తువుల మీద వచ్చే దేవుళ్ళ చిత్రాలు ఆయా వస్తువులు వినియోగం అనంతరం ఎక్కడో ఓ పక్కన పడేస్తే అది దేవుళ్లను కించపరించినట్టు కాబోదని గతంలో ముంబయి హైకోర్టు ఓ అర్ధవంతమైన తీర్పు వెల్లడించింది. మనోభావాల పేరుతో చేసే వాదనలో నిజానిజాలు ఎంతున్నా ప్రతీ చిన్న విషయాన్ని ఇలా పెద్దది చేసి చూడడం దేశానికి ఈ వ్యవస్థలకు మంచిదేనా అనే ప్రశ్న మళ్లీ మళ్లీ ఉత్పన్నమవుతూనే ఉంది.అసలు సినిమాల్లో కంటెంట్ ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు రాజకీయ నాయకులకు ఎక్కడిది అని మరోవర్గం ప్రశ్నిస్తోంది.
అసహనం గురించి మాట్లాడాలంటే ప్రస్తుత ప్రభుత్వమూ నాయకత్వమే న్యాయస్థానాల్లో ముద్దాయిగా నిలబడాల్సి ఉంటుంది.ప్రజాస్వాన్య వ్యవస్థలను చక్కబెట్టి సవ్యమైన పాలన అందించాల్సిన ప్రభుత్వమే సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా గోళీమారో అనే సంచలన వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్ వంటి మంత్రి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి.కేందప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు.సాక్షాత్తూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మేఘాలయ మాజీ గవర్నర్ తదగత్ రాయ్ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు పాకిస్తాన్ వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం వెళ్లి గొడవలో గాయపడిన విద్యార్థులను పరామర్శించగా ఆమెపై మాటల దాడికి దిగి చపాక్ సినిమా విడుదలకు అడ్డు పడతామని దుర్మార్గపు చర్యకు కొందరు దిగడం ఈ దేశంలో పేరుకుపోయిన అసహనానికి నిదర్శనం. ప్రశ్నించే స్వేచ్చాయుత గొంతుల్ని నొక్కేస్తూ దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తూ వాట్సాప్ సందేశాల్ని లీక్ చేసిన నిజమైన దేశాద్రోహి ఎవరు.?జాతిపితను చంపిన వాణ్ణి దేశ భక్తుణ్ణి చేసి పాలి గించల కోసం కొట్లాడుతున్న రైతన్న మీద దేశ ద్రోహం కేసులా.?ఇదేనా మనం కోరుకున్న ప్రజాస్వామ్యం.? ‘‘తుపాకులు సమస్యలకు ఎప్పటికీ పరిష్కారం చూపలేవు,సోదర భావమే సమస్యలకు పరిష్కారం చూపగలదు’’ అనే మహనీయ నేత వాజీపేయి మాటలు నేటి పాలకులకు చెంపదెబ్బ కావాలి.

,జర్నలిజం కాకతీయ విశ్వవిద్యాలయం.807402284