Take a fresh look at your lifestyle.

పాతబస్తీలో  ఫ్లాగ్‌మార్చ్‌

ఇక్కడే ఎందుకని ప్రశ్నించిన అసదుద్దీన్‌
ప్రజలను  అప్రమత్తం చేసేందుకేనన్న పోలీసు శాఖ

‌దేశ రాజధాని దిల్లీని అట్టుడికించిన సీఏఏ వివాదం  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పాకింది. సీఏఏ, ఎన్‌పిఆర్‌లకు నిరసనగా ఢిల్లీలో నిరసనలు, విధ్వంసాలు, హింసాత్మక ఘటనలతో దేశవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేశంలోని సున్నితమైన ప్రాంతాలలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా ప్రజలు విడిపోతున్నారు.  దీనిలో భాగంగానే ఉత్తర భారతంలోని పలు ముఖ్య పట్టణాలతో పాటు దక్షిణాది సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలను అప్రమత్తం చేసింది. దిల్లీలో జరిగిన హింస, విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని పాతబస్తీలో కేంద్ర బలగాలు ఫ్లాగ్‌ ‌మార్చ్ ‌నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. దేశవ్యాప్తంగా పలు సున్నితమైన ప్రాంతాలలో ఈ తరహా ఫ్లాగ్‌ ‌మార్చ్‌లను కేంద్రం నిర్వహిస్తోంది.దేశ రాజధాని దిల్లీ ఘటనలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా కేంద్రం చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చార్మినార్‌ ‌వద్ద ర్యాపిడ్‌ ‌యాక్షన్‌ ‌ఫోర్స్ ‌ఫ్లాగ్‌ ‌మార్చ్ ‌నిర్వహించింది. పెద్ద ఎత్తున బలగాలను దింపి పాతబస్తీ వీధుల్లో కవాతు నిర్వహించింది. దిల్లీ పోలీసుల వైఖరికి నిరసనగా శుక్రవారం మక్కా మసీదు ముందు నిరసనలు నిర్వహించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం కొంతమంది యువకులు దిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌నగర ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీ అల్లర్లను ఆసరాగా తీసుకుని సంఘ విద్రోహక శక్తులు విజృంభించే అవకాశాలున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేశారు. చార్మినార్‌ ‌సమీపంలోని వీధులలో ఫ్లాగ్‌ ‌మార్చ్ ‌నిర్వహించడం కొత్త కాదని ఆయన స్పష్టం చేశారు. చార్మినార్‌ ‌సమీపంలోని బజార్లలో హిందువులు, ముస్లింలు ఉన్నారనీ, ఆభరణాల తయారీలో వస్త్ర మార్కెట్‌లో, హోటళ్లలో హిందూ, ముస్లింలు కలసి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా చార్మినార్‌ ‌గొప్ప పర్యాటక కేంద్రమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌ ‌పోలీసులు చార్మినార్‌ ‌ప్రాంతంలో ఫ్లాగ్‌ ‌మార్చ్ ‌నిర్వహించారు. 750 మంది ఇందులో పాల్గొన్నారు. పోలీసులు గురాలపై తిరిగారు. భవానీ నగర్‌, ఇక్బాల్‌ ‌చౌక్‌, ‌మీర్‌చౌక్‌, ‌చార్మినార్‌ ‌ప్రాంతాలతో పాటు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో ఫ్లాగ్‌ ‌మార్చ్ ‌నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. అయితే, కేవలం హైదరాబాద్‌లోని చార్మినార్‌ ‌వద్దనే కేంద్ర బలగాలు ఫ్లాగ్‌ ‌మార్చ్ ‌నిర్వహించడంపై హైదరాబాద్‌ ఎం‌పీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చార్మినార్‌ ‌వద్ద మాత్రమే మార్చ్ ‌నిర్వహించారు ? సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ఎదురుగా కానీ, హైటెక్‌ ‌సిటీలో గానీ ఎందుకు చేయట్లేదు అని ట్విటర్‌ ‌వేదికగా ప్రశ్నించారు.
హైదరాబాద్‌ ‌చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాలలో కేంద్ర బలగాలు ఫ్లాగ్‌ ‌మార్చ్ ‌నిర్వహించడంపై నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. ఇక్కడే ఎందుకు చేయాల్సి వచ్చిందని సోషల్‌ ‌మీడియా మాథ్యమంగా విమర్శలు గుప్పించారు.

Leave A Reply

Your email address will not be published.