Take a fresh look at your lifestyle.

ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో ధరలపై జీవోలు ఎందుకు ఇవ్వలేదు ? 23 లోగా ఇవ్వాలి

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • కొరోనా పరిస్థితులపై విచారణ..23కు వాయిదా

ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో ధరలపై జీవో ఇవ్వాలన్నా ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లకు జీవో జారీ చేయాలని, జూన్‌ 23‌లోగా జీవో అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది. కొరోనా పరిస్థితులపై హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగగా ప్రభుత్వం, డీజీపీ, పౌరసరఫరాలశాఖ నివేదికలపై వాదనలు జరగగా.. కోర్టు విచారణకు హెల్త్ ‌సెక్రటరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ ‌సడలింపులను వైద్యరోగ్యశాఖ కోర్టుకు తెలిపింది. థర్డ్‌వేవ్‌ ‌చర్యలపై కేబినెట్‌ ‌చర్చించిందని తెలిపింది. అయితే కొరోనా నిర్దారణ కోసం రాష్ట్రంలో 8 అర్టీపీసీఆర్‌ ‌ల్యాబ్‌లు పని చేస్తున్నాయని హైకోర్టుకు రాష్ట్ర హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు తెలిపారు. మిగతా ల్యాబ్‌లకు ఐసీఎంఅర్‌ ‌నుంచి అనుమతి రాగానే మిగతా అర్టీపీసీఆర్‌ ‌ల్యాబ్‌లు పని చేస్తాయని డీహెచ్‌ ‌పేర్కొన్నారు.

హైకోర్టులో వాక్సినేషన్‌ ‌పక్రియపై జరిగిన విచారణకు డీహెచ్‌ ‌హాజరై వివరణ ఇచ్చారు. డిజాస్టర్‌ ‌మేనేజ్మెంట్‌ ‌కమిటీ ఏర్పాటు చేశారా అని డీహెచ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కమిటీకి సంబంధించి ఫైల్‌ను సీఎస్‌కు పంపించామని, త్వరలో జీఓ విడుదల చేస్తారని హైకోర్టుకు డీహెచ్‌ ‌తెలిపారు. వారం రోజుల్లో కమిటీకి సంబంధించిన జీఓ విడుదలవుతుందన్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 135 హాస్పిటల్స్‌పై 223 ఫిర్యాదులు అందాయని కోర్టుకు డీహెచ్‌ ‌తెలిపారు. వాటిలో 22 హాస్పిటల్స్‌కు తిరిగి అనుమతులు ఇచ్చామని డీహెచ్‌ ‌పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న హాస్పిటల్స్ ఏమైనా స్పందించాయా అని డీహెచ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అధికంగా వసూలు చేసిన హాస్పిటల్స్ ‌తిరిగి పేషెంట్లకు 65 లక్షలు రూపాయలను ఇచ్చాయని డీహెచ్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన 2.73కోట్ల మందికి టీకా ఇవ్వాల్సి ఉందని హైకోర్టుకు డీహెచ్‌ ‌తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 41 లక్షల మందికి ఫస్ట్ ‌డోస్‌ ఇచ్చామన్నారు.

13 లక్షల మందికి సెకండ్‌ ‌డోస్‌ ఇచ్చామని ఆయన వివరించారు. జూలై 2కి 17 లక్షల టీకాలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల సూపర్‌ ‌స్పైడర్స్‌ను గుర్తించామని, వారికి టీకా ఇస్తున్నామని ఆయన తెలిపారు. వారిలో ఏడున్నర లక్షల మందికి టీకా ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్‌ఎం‌సీలో 30 ఫంక్షన్‌ ‌హాల్స్‌ను తీసుకుని వాక్సినేషన్‌ ‌వేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి రోజు 40 నుంచి 50 వేల టీకాలు ఇస్తున్నామని హైకోర్టుకు డీహెచ్‌ ‌వివరించారు.

Leave a Reply