- చర్య తీసుకోవడంలో ఎందుకీ ఉపేక్ష
- ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా సిఎం కెసిఆర్ పట్టించుకోరా
- రాజయ్య, ఈటలకు ఓ న్యాయం..మల్లరెడ్డికి మరోటా?
- కెసిఆర్ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాపై తీవ్ర ఆరోపణలపై ఆధారాలు ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాటికొండ రాజయ్య, ఈటల రాజేందర్‌లపై చర్య తీసుకున్న సిఎం కెసిఆర్ మల్లారెడ్డి విషయంలో ఎందుకు ఉపేక్ష వహిస్తున్నారని ప్రశ్నించారు. మల్లారెడ్డి కబ్జాలపై తాము నిలదీసే ప్రయత్నం చేస్తే.. ఉన్మాదిలా, పిచ్చికుక్కలా మల్లారెడ్డి మాట్లాడిండన్నారు. అవినీతి ఆరోపణలతో మాజీ మంత్రి రాజయ్య పై సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని.. అదే విధంగా దేవర యాంజల్ భూములను కబ్జా చేశారని ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని అన్నారు. అలాంటిది మల్లారెడ్డి.. భూ కబ్జాలపై తాము ఆధారాలు బయట పెడుతున్నా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆధారాలతో మల్లారెడ్డి పై ఆరోపణలు చేస్తున్నానన్న రేవంత్ రెడ్డి.. రాజయ్య, ఈటలకు ఒక న్యాయం..మల్లారెడ్డికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. మల్లారెడ్డి భూ కబ్జాలపై సీఎం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయాన మిడియాతో మాట్లాడుతూ మల్లారెడ్డి భూ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు. ఆయన అవినీతిపై ఆధారాలు కూడా ఇచ్చానని తెలిపారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన వ్యవహారంలో మల్లారెడ్డిని సీఎం కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. 50 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మల్లారెడ్డిపై విచారణకు కేసీఆర్ సాహసించడంలేదని తప్పుబట్టారు. లే అవుట్లలో ప్లాట్లు అమ్ముకునే వారి నుంచి మామూళ్లు వసూలు చేశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ కోసం సేకరించిన భూమి వివరాల ప్రకారం.. సర్వే నెంబర్ 650లో 1965 -66 సంవత్సరం పహానిలో 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. తర్వాత 2000-01 పహానిలో 650 సర్వేలో 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. 2021 సంవత్సరం వచ్చేనాటికి 33 ఎకరాల 26 గుంటలకు ఎలా పెరిగింది. 16 ఎకరాలు మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి మిదకు బదిలీ అయ్యింది.
శ్రీనివాస్‌రెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిప్ట్ డీడ్ చేశారు. అసలు ఆ 16 ఎకరాల భూమికి శ్రీనివాస్‌రెడ్డి ఎలా ఓనర్ అయ్యారో తేల్చాలని అన్నారు. అదే భూమిని 2004లో లే ఔట్ చేసి ప్లాట్స్‌గా అమ్మారు. 2012లో మళ్ళీ హెచ్ఎండీఏ లే ఔట్ చేసి అమ్మేశారు. సర్వే నెంబర్ 650లోని 22 ఎకరాల 8 గుంటల భూమి.. ధరణి పోర్టల్‌లో 33 ఎకరాల 26 గుంటలకు ఎలా పెరిగింది. అందులో 16ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి మిదకు ఎలా మారింది. ఆ 16 ఎకరాల స్థలంలో యూనివర్సిటీకి అనుమతులు ఎలా తెచ్చారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. జవహర్‌నగర్‌లో 488సర్వేలోని 5ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టిందని, ఈ భూమి మల్లారెడ్డి కోడలు షాలినిరెడ్డి పేరు మిద సేల్ డీడ్ ఎలా అయిందని తెలిపారు. అక్కడ సీఎంఆర్ హాస్పిటల్ ఎలా నడుపుతున్నారని నిలదీశారు. ప్రభుత్వ భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇంజినీరింగ్ కాలేజ్‌కు గ్రేడింగ్ కోసం తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని, మల్లారెడ్డి కాలేజ్‌లను న్యాక్ ఐదేళ్లు నిషేధించిందని గుర్తుచేశారు. న్యాక్ నిషేధించిన మల్లారెడ్డి కాలేజ్‌లకు యూనివర్సిటీ అనుమతి ఎలా ఇస్తారని రేవంత్‌రెడ్డి నిలదీశారు. అవినీతిపై అంతెత్తున లేస్తున్న కెసిఆర్ ఇస్తున్న ఆధారాలపై మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు.