Take a fresh look at your lifestyle.

‌ప్రాంతీయ సదస్సుకు సిఎం ఎందుకు వెళ్ళలేదు ?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో సిఎం కెసిఆర్‌ ‌పాల్గొనక పోవడమేంటన్న విషయంపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన కుమారుడు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావులు కేంద్రంపైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల సవితి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నదని, దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్నది ఒకటి ఉన్నదన్న విషయాన్ని మరిచిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నదంటూ ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రానికి సంక్రమించాల్సిన నిధులు, ప్రాజెక్టులపై తాము అనేక విజ్ఞప్తులు చేసినా కేంద్ర సర్కార్‌ ‌నిమ్మకు నీరెత్తినట్లు ఉంటు న్నదంటూ ఆవేశ ప్రసంగాలు చేస్తున్నారు. ఈ విషయంలో తాము ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళింది లెక్కలు చెబుతున్నారు. అయినా కేంద్రం స్పందించడంలేదని, ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని ఎదగకుండా అడ్డుపడుతున్నదంటూ ప్రసంగాలు చేస్తున్నారు. ఇక తమకు ఓపిక నశించిందని, ఇక అమీ తుమీ తేల్చుకోవాల్సిన సమయం వొచ్చిందని చెబుతుంది.

పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉంటే కేంద్ర ప్రభుత్వమే స్యయంగా ఇంటిముందు సమావేశం ఏర్పాటు చేస్తే, ఆ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు హాజరు కాలేదని ఇప్పుడ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్న విషయాన్ని అటు ఏపి ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఏకరువు పెడుతూనే ఉన్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం గత ఏడేళ్ళుగా కేంద్రాన్ని నిలదీయాల్సిందిపోయి అనేక అంశాల్లో మద్దతు ప్రకటిస్తూ స్నేహంగా వ్యవహరిస్తూ వొచ్చింది. కాని, ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుగా విభజన హామీలపై ఇక పోరాటమేనంటుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ ఇతర ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రంతో అటో ఇటో తేల్చుకుంటామని చెబుతున్న తెలంగాణ సర్కార్‌ ‌కేంద్రం వివిధ సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సును ఎందుకు సద్వినియోగ పర్చుకోలేకపోయిందో ప్రజలకు చెప్పాలంటున్నాయి. స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులను కేంద్రానికి నివేదించడంతోపాటు, చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న వాటి సత్వర పరిష్కారం కోసం ఈ సదస్సు ఉపయోగకారిగా ఉంటుంది. తిరుపతిలో జరిగిన ఈ సదస్సును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌సక్రమంగా వినియోగించుకున్నట్లు అర్థమవుతున్నది.

విభజన హామీల పట్ల ఆయన కేంద్రాన్ని నిలదీయ గలిగారు. అలాగే రాష్ట్రంలోని అన్ని సమస్యలకు ప్రధాన పరిష్కార అంశంగా ఉన్న ప్రత్యేక హోదాను మరోసారి కేంద్రం దృష్టికి ఆయన విజయవంతంగా తీసుకువెళ్ళాడు. నదీ జలాల విషయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఎత్తి చూపించగలిగాడు. కాని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అవకాశాన్ని వదులుకుంది. కేంద్రం అన్యాయం చేస్తున్నదని రోజు ప్రెస్‌ ‌మీట్లలో, ఇతర వేదికలపై చెబుతున్న ముఖ్యమంత్రి ఈ సమావేశానికి హాజరుకాకుండా తమ సమస్యలు సమస్యలుగానే కొనసాగాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా హుజురాబాద్‌ ఎన్నికల సందర్భంగా మొదలైన పెట్రోల్‌, ‌డిజిల్‌ అం‌శం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం లాభాపేక్షకు పోకుండా పెరిగిన పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలను కొంతవరకైనా పన్నులను సడలించి తగ్గించవచ్చని కేంద్రం అంటుంటే, రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి వాటిపై వ్యాట్‌ ఎం‌తుందో అంతే ఉందని, ఒక్క పైసా తగ్గించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇలా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. అలాగే ధరలు పెంచే విషయంలో కేంద్రం మోసకారి తనానికి పాల్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది.

సుంకం పెంచితే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాల్సి వొస్తుందని, సుంకానికి బదులుగా సెస్‌ ‌విధించి, ధరలు పెంచిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. తాజాగా వివాదాస్పదమైన మరో అంశం వరి ధాన్యం కొనుగోలు. ఈ విషయంలో కూడా తప్పు మీదంటే మీదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ విషయంలో ఎవరి బాధ్యత ఎంత అన్నది తేలాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం పిట్ట తగువు పిల్లి తీర్చినట్లు కేంద్రం పరిధిలోకి పోయింది. తెలంగాణ జల కేటాయింపు విషయంలో కేంద్రానికి దమ్యుంటే ట్రిబునల్‌కు రిఫర్‌ ‌చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ ‌విసిరింది. వీటన్నిటితో పాటు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్న గిరిజన యూనివర్శిటీ, కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ, కేంద్రం రద్దు చేసిన ఐటిఐఆర్‌ ‌ప్రాజెక్టు, ఐఐఎం, ఖమ్మంలో ట్రిపుల్‌ ఐటి, మెడికల్‌ ‌కళాశాల అనుమతి లాంటి అనేక అంశాలు కేంద్ర పరిధిలో అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని సమూలంగా చర్చించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వదులుకుందంటే, ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్త శుద్ధి లేదన్నది స్పష్టమవుతున్నదని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి.

Leave a Reply