Take a fresh look at your lifestyle.

దేశ తొలి స్వాతంత్య్ర వేడుకల్లో మహాత్ముడు ఎందుకు పాల్గొనలేదు?

రెండు శతాబ్దాల ఆంగ్లేయుల పాలన నుంచి, శతాబ్దపు స్వాతంత్య్ర పోరాటాల ద్వారా  భారతావని స్వేచ్ఛావాయువులు పొందిన సందర్భం భారతీయులంతా అవధులు దాటిన ఆనందం అనుభవించిన సమయం.  దేశాన్నంతటినీ ఏకదాటిపైకి తెచ్చి స్వాతంత్య్రం సంపాదించి పెట్టడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించిన విషయం అందరూ అంగీకరించే సత్యం. స్వాతంత్య్రం సాధించి, జరుపుకున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఘట్టం భరత జాతికి అపూర్వ, అనిర్వచనీయ జ్ఞాపకం. 1947 ఆగస్టు 15 నాటి అలాంటి ముఖ్యాతి ముఖ్య మహోత్సవ వేడుకల సందర్భానికి జాతిపిత ఎందుకు దూరంగా ఉన్నారు.

ముస్లిం నాయకుడైన మహమ్మద్‌ ఆలీ జిన్నాను ప్రధాని మంత్రిగా చేసైనా దేశ విభజనను ఆపాలని గాంధీ భావించారు. ఇది హిందూ- ముస్లింల మధ్య మరింత చిచ్చు రాజేసింది. నెహ్రు, సర్దార్‌ ‌వల్లబాయ్‌ ‌పటేల్‌ ‌లు గాంధీ విధానాన్ని వ్యతిరేకించారు. విభజన జరిగితేనే అల్లర్లు సమసి పోతాయని వారు భావించారు. దేశ విభజనో..అంతర్గత యుద్ధమో తేల్చుకోండని జిన్నా పిలుపు నివ్వడం గాంధీని ఇరకాటంలో పడేసింది. 1947 ఆగస్టు 15న దేశ మంతా సంబరాలు జరుపు కుంటుంటే..గాంధీ మాత్రం సంబరాలకు బహు దూరంగా, ఢిల్లీకి దూరంగా ఉండడం విశేషం.

1946లో మతోన్మాదం ప్రారంభం కాగానే గాంధీ బెంగాల్‌, ‌బీహార్‌ ‌తదితర ప్రభావిత ప్రాంతాలు పర్యటించారు. డెభై ఐదు పైబడి వయసు ఉన్న గాంధీ కాలి నడకన, తిరుగుతూ హిందువులను, ముస్లింలను కలిసి, సమావేశాలలో ప్రసంగించి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేశారు. మరోసారి ఆగస్ట్ 1947 ‌మొదట్లో ఢిల్లీ వదిలి, కలకత్తాలోని ముస్లింల ఆధిక్యత గల బెలియఘాట్‌ ‌చేరుకొని, ప్రహరీలు లేని పాడుబడిన భవనంలో అక్కడే నివసించారు. దేశ విభజన ప్రతిపాదన, దానికి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లు, అవి దారితీసిన ఉద్రిక్తతలు, మత ఘర్షణల ఫలితంగా అనూహ్యమైన రీతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలు దేశ పశ్చిమ ప్రాంతానికి పంప బడ్డాయి. తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీ పై పడింది. దేశ విభజనతో ముఖ్యంగా పంజాబు, బెంగాలు లలో పెద్దఎత్తున సంభవించిన వలసలవల్ల మత కలహాలు, మారణ కాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాశ్మీరు విషయమై భారత్‌ – ‌పాకిస్తాన్‌ ‌యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిము లందరినీ పాకిస్తాను పంపాలనీ, కలసి బ్రతకడం అసాధ్యమనీ వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించ సాగాయి. ఈ పరిస్థితి గాంధీకి మింగుడు పడని అంశంగా మారింది. ఏ హింసనైతే నివారించటానికి అంత సహనంతో అహింస, సత్యాగ్రహం ఆయుధాలతో పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్లారో, అదే జరగ గూడని హింస పేట్రేగడంతో గాంధీజీ దిగులు చెందారు.పలు పత్రికలు ఆయన సందేశం కోసం అడిగినప్పటికీ తిరస్కరించారు. అయితే 15 ఆగస్ట్ 1947‌న గాంధీ ఉపవాసం ఉంటూ, ప్రార్ధన చేసుకొనుటకు నిర్ణయించు కున్నారు.

ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ, సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయి పటేల్‌ ‌మహాత్మా గాంధీకి లేఖ రాశారు. అందులో ‘‘ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది. మీరు జాతిపిత. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి’’ అని కోరారు. గాంధీ ఆ లేఖకు సమాధానం ఇచ్చారు. అందులో ‘‘కలకత్తాలోని హిందూ – ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను. ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తా’’ అన్నారు. జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ ‌విత్‌ ‌డెస్టినీ’ని ఆగస్టు 14న అర్థరాత్రి వైస్రాయ్‌ ‌లాంజ్‌ (‌ప్రస్తుత రాష్ట్రపతి భవన్‌) ‌నుంచి ఇచ్చారు. నెహ్రూ అప్పటికి ఇంకా ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ, గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు.
మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌ ‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తూ ఉన్నారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply