Take a fresh look at your lifestyle.

రైతు ఉద్యమంపై దేశం మౌనమెందుకు?

“దేశంలో ఆర్థిక సంస్కరణల పేరుతో విద్యా, వైద్యం, పరిశ్రమలు, రైల్వే, టెలికాం, రోడ్డు, రవాణా, బీమా, విద్యుత్‌,‌గ్యాస్‌, ‌నీటి పారుదల వంటి అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రజలపై ప్రత్యక్ష తక్షణ ప్రభావం లేకపోవడం, పరోక్ష ప్రభావాలను గుర్తించకపోవడం చేత సకాలంలో రావాల్సినంతగా ప్రజా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వాటి పరిణామాలపై విప్లవ సంస్థలు, కమ్యూనిస్టు పార్టీలు చేసిన అంచనాలను ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడానికి ఇది ఒక కారణం. కానీ,గతంలో ప్రైవేటీకరణ కు గురైన రంగాలకు, వ్యవసాయానికి తేడా ఉంది. వ్యవసాయ రంగం ప్రైవేటీకరణ వల్ల రైతులపై, ప్రజలపై ఏక కాలంలో చూపే ప్రత్యక్ష తక్షణ ప్రభావమే ఆ తేడా.”

రైతు రెక్కలిరిచి రాబంధుల్లాంటి కార్పొరేట్లకు అప్పగిస్తున్న కేంద్ర వ్యవసాయ చట్టాలను(3) సహించేది లేదని రైతాంగం తెగేసి చెప్తుంది. ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులను దిగ్బంధనం చేసి అర్థ పక్షం దాటుతుంది. గడ్డగట్టే చలిలో రోజుల తరబడి నడి రోడ్డు మీద కొనసాగుతున్న వారి పోరాటం దేశ చరిత్రలో నూతన శకాన్ని మొదలుపెట్టినట్లు కనబడుతోంది . అసంఘటితంగా ఉన్న రైతులు సంఘటిత కార్మికోద్యమానికి కూడా సాధ్యం కాని తెగింపును ప్రదర్శిస్తూ కొత్త ఆశలను రేకెత్తిస్తున్నారు. అంత మాత్రమే కాదు, సిద్ధాంత సవరణ చర్చలకు సైతం తెరదీశారు. రైతు వెన్నుముక లేకుండా చేసే చట్టాలను రద్దు చేసే వరకు విరమించేదే లేదని దేశ నడిబొడ్డు నుంచి కదిలేదే లేదని ప్రభుత్వానికి తేల్చిచెప్తున్నారు. మార్కెట్‌ ‌దళారులు, స్థానిక వ్యాపారుల మోసాల నుంచి కాపాడమంటే, దోపిడీదారుల కబంధ హస్తాలకు అప్పగించడమేమిటని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

 

పక్షుల బారినుంచి పంటను కాపాడమని మొరపెడితే అడవి పందులను ఎగదోసినట్లున్న పాలకుల విధానాన్ని నిలదీస్తున్నారు. ఎన్నో నిర్బందాలను ఎదిరించి, జాతీయ రహదారులకు అడ్డంగా తవ్విన నిలువెత్తు కందకాలను సైతం దాటుకుని రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. ఒకవైపు వణికించే చలిని, ఇంకోవైపు లాఠీ దెబ్బలు, బాష్పవాయు గోళాలు, వాటర్‌ ‌క్యానన్‌ ‌లను ఎదుర్కొంటున్నారు. మరోవైపు చర్చల పేరిట రోజులు సాగదీస్తూ రాజ్యం చేస్తున్న కుటిల యత్నాలను తిప్పికొట్టడం, ఐక్యతను కాపాడుకోవడమే అతిపెద్ద కర్తవ్యంగా ఉంది. పలు దఫాలుగా చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రైతులలో వేర్పాటువాద, సంఘవిద్రోహ శక్తులు చేరారని, ఉద్యమం పక్కదారి పట్టిందని తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. ఒక్క రాష్ట్రానికి చెందిన వారే తప్ప మిగతా రాష్ట్రాల్లో రైతులు కేంద్ర చట్టాలకు మద్దతిస్తున్నారని ఉద్యమకారుల మనోస్తైర్యం దెబ్బదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత ఆందోళన అని, ఇందులో రైతులెవ్వరూ లేరని, మండీ (మార్కెట్‌) ‌దళారులు, ప్రతిపక్ష పార్టీల వ్యాపారులు మాత్రమే ఉన్నారని రైతుల పోరాటాన్ని కించపరుస్తూ, ఉద్యమాన్ని నీరుగార్చడానికి చేయకూడని అన్నీ కుట్రలను చేస్తూనే ఉన్నారు. అమిత్‌ ‌మాలవీయ వంటి కాషాయ దళం అబద్ధపు వార్తలు, మార్ఫింగ్‌ ‌ఫొటోలతో దేశ ప్రజల్లో మతం, దేశభక్తిల పేరిట విషం నింపే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పత్రికా సమావేశాలు, సోషల్‌ ‌మీడియా వేదికగా రైతులపై వారి ఉద్యమంపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దశాబ్దాల కాలం నుంచి బందీగా ఉన్న రైతులకు ఈ చట్టాల ద్వారా విముక్తి ప్రసాదించామన్నట్లుగా ప్రచారం చేస్తూ రైతు ఉద్యమ మద్దతు దారులపై మానసిక ఎదురుదాడి చేయమని అధికార పార్టీ తమ శ్రేణులకు సూచిస్తుంది. ఇన్ని విద్రోహాలు,లెక్కకు మించిన ఉద్యమ చీలిక కుట్రలను, అబద్ధాలను తిప్పికొడుతూనే తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతు ఉద్యమానికి మద్ధతుగా జరగవలసిన కార్యక్రమాలు జరపకపోవడం, ఇవ్వవలసిన నైతిక మద్ధతును కూడగట్టుకోలేక పోవడం పట్ల దేశం మౌనంగా, ప్రతిపక్షాల నిర్లిప్తతగానే భావించాల్సి ఉంటుంది.

అసలు రైతులు తీవ్ర పోరాటాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇంతటి తెగువకు కారణమేంటి? ఇన్ని కుట్రలను తిప్పికొట్టే స్థైర్యం ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే రైతు ఉద్యమాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఆర్థిక సంస్కరణల పేరుతో విద్యా, వైద్యం, పరిశ్రమలు, రైల్వే, టెలికాం, రోడ్డు, రవాణా, బీమా, విద్యుత్‌,‌గ్యాస్‌, ‌నీటి పారుదల వంటి అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రజలపై ప్రత్యక్ష తక్షణ ప్రభావం లేకపోవడం, పరోక్ష ప్రభావాలను గుర్తించకపోవడం చేత సకాలంలో రావాల్సినంతగా ప్రజా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వాటి పరిణామాలపై విప్లవ సంస్థలు, కమ్యూనిస్టు పార్టీలు చేసిన అంచనాలను ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడానికి ఇది ఒక కారణం. కానీ,గతంలో ప్రైవేటీకరణ కు గురైన రంగాలకు, వ్యవసాయానికి తేడా ఉంది. వ్యవసాయ రంగం ప్రైవేటీకరణ వల్ల రైతులపై, ప్రజలపై ఏక కాలంలో చూపే ప్రత్యక్ష తక్షణ ప్రభావమే ఆ తేడా. ఈ తేడాను అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకున్నది కార్పొరేట్‌ ‌మేధావులే కనుక వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కార్పొరేట్‌ ‌వ్యాపారానికి తెరలేపడానికి కొద్దిగా సమయం తీసుకున్నారు. ప్రత్యక్ష తక్షణ ప్రభావం వల్ల ఎదురయ్యే ప్రజల ప్రతిఘటనను అంచనా వేశారు. దేశంలో అత్యధిక శాతం (60%) మంది ప్రజలు వ్యవసాయ రంగం పై ఆధారపడి ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు . ఈ కారణాల వల్ల ఒక్కొక్కటిగా అన్ని రంగాలను కార్పొరేట్‌ ‌పడగ నీడలోకి చేర్చిన పాలకులు ( కార్పొరేట్‌ ‌ప్రతినిధులు) వ్యవసాయాన్ని, రైతులను ఆ నీడలోకి చేర్చే ప్రయత్నాలను చివరగా ప్రారంభించారు.

ఆ ప్రయత్నానికి రూపమే నూతన వ్యవసాయ చట్టాలు. ఏ కారకాలైతే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ ‌పరం చేయడంలో ఆలస్యం చేశాయో అవే కారకాలు ఇవ్వాళ్టి రైతు ఉద్యమానికి పునాదులుగా నిలుస్తున్నాయి. ప్రస్తుత చట్టాల వల్ల భూమిపై రైతు యాజమాన్య హక్కులు కాగితాలకే పరిమితం కానున్నాయి. దాని ఫలితం మాత్రం కార్పొరేట్లకు దక్కుతుంది. పంట పండించేది రైతు, దాని లాభాలు మాత్రం కార్పొరేట్‌ ‌శక్తులవి.అంటే భూమి, శ్రమ, ఉత్పత్తి, మిగులు వంటి అంశాలపై కార్పొరేట్ల ఆధిపత్యానికి, దోపిడీకి చట్టబద్ధత కల్పించారు. తన భూమిపై తననే కౌలు రైతుగా, జీతగానిగా, బానిసగా మార్చనున్న ఈ విధానాలను రైతులు అర్థం చేసుకున్నారు. ఇదే ఉద్యమానికి మొదటి మెట్టు. భూమి పరాయికరణ ఆత్మాభిమానానికి గొడ్డలిపెట్టు. రైతుకు భూమి ప్రతిష్టాత్మకం. అది తన తరతరాల జీవన విధానం. రైతు భూమితో విడదీయరాని ప్రేమను, అనుబంధాన్ని కలిగి ఉంటాడు. ఈ అనుబంధమే నేటి ఢిల్లీ ముట్టడికి రెండవ ప్రాతిపదిక. చట్టాలు తమపై చూపనున్న తక్షణ ప్రత్యక్ష నష్టాన్ని గ్రహించడం మూడవ ప్రాతిపదిక. ఇవే అంశాలు దక్షిణ భారత రైతుకు ఎందుకు ఉద్యమ ప్రాతిపదికలు కాలేకపోతున్నాయనేది ఆర్థిక రాజకీయ కోణాల్లో విశ్లేషించాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా ఎందుకు మారడం లేదో కూడా అన్వేషించాల్సి ఉంది.

నిరంకుశ పాలనను నియంత్రించే, నియంతలను కూల్చే అవకాశం కాలం చాలా అరుదుగా కల్పిస్తుంది. దానికి ఏ చిన్న సంఘటన అయినా కారణంగా నిలవవచ్చు. ఇది ప్రపంచ చరిత్ర పొడవునా కనపడుతుంది. అలాంటి సంఘటనలు ఈ దేశంలో ఎన్నో చోటు చేసుకున్నా దేశ వ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చ లేదేందుకు? శాశ్వత పరిష్కార అన్వేషణ దిశగా ఎందుకు అడుగులు వేయలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ముందు భారత దేశ ఉద్యమ చరిత్రలో అలాంటి మరొక అవకాశంగా, సంఘటనగా ప్రస్తుతం ముందుకొచ్చిన రైతు ఉద్యమం గురించి చర్చించాలి.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన సంఘటిత ఉద్యమ సంస్థలు, పోరాట శక్తులకు తోడుగా నిలబడడం లేదని, ప్రజానీకాన్ని చైతన్యం చేయడంలో, సమీకరించడంలో చేయవలసిన కృషి చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి గల కారణాలు విశ్లేషిస్తే , ముందరి ప్రశ్నలకు సైతం జవాబు దొరుకుతుంది. బూర్జువా రాజకీయ పార్టీల, వాటి అనుబంధ సంఘాల మౌనమే దేశం యొక్క మౌనానికి కారణంగా తోస్తుంది.

ఎందుకంటే ఆయా పార్టీల భవిష్యత్‌ ‌కూడా పెట్టుబడి శక్తుల దయాదాక్షిణ్యాల్లో, కార్పొరేట్ల చేతుల్లో ఇమిడి పోయిందన్న విషయం రహస్యం ఏమి కాదు. రేపు తాము అధికారంలోకి వచ్చినా ఇవే విధానాలను కొనసాగించక తప్పదన్న వాస్తవం అందరికంటే ఎక్కువ వారికే తెలుసు. ఇవ్వాళ రైతాంగం ఏ చట్టాలనైతే వ్యతిరేకిస్తున్నారో తాము అధికారంలో ఉన్నా అవే చట్టాలు చేయవలసిన అనివార్యత ఉండేదన్న నిజం ఆయా పార్టీలకు తెలియనిది కాదు. ఇవ్వాళ మేము సైతం ఉద్యమిస్తాం అని ముందుకు వస్తున్న రాజకీయ పార్టీలు తమ పాలనా రాష్ట్రాల్లో ఇదివరకే కాంట్రాక్టు వ్యవసాయానికి ఎప్పుడో దారులు తెరిచిపెట్టిన సంగతి మరవరాదు. దొంగే దొంగా గొంగ అని అరుస్తున్న స్థితిని గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా పార్టీలు ,వాటి అనుబంధ సంఘాలకు నేటి రైతు ఉద్యమం దేశ వ్యాప్త ప్రజా ఉద్యమంగా మారడం ఎంతమాత్రం రుచించదని అర్థమవుతుంది. ఇదే కాకుండా నిర్భయ, ఉన్నావ్‌, ‌కతువా, హత్రాస్‌, ‌దిశ, టేకు లక్ష్మీ, బీమా కోరేగావ్‌ ‌కుట్ర కేసు, షాహీన్‌ ‌బాగ్‌ ‌మహిళల పోరాటం, వంద శాతం అంగ వైకల్యం గల ప్రొ. సాయి బాబాను, అనారోగ్యంతో మృత్యువుకు దగ్గరవుతున్న వరవరరావును విచారణ ఖైదీలుగా ఉంచి, కనీసం బెయిల్‌ ‌హక్కును కూడా తిరస్కరిస్తూ ఏళ్ల తరబడి నిర్బంధం విధిస్తున్న సంఘటనలన్నీ దేశ వ్యాప్త ఉద్యమంగా మారాల్సినవి.. ప్రజా ఉద్యమంగా మార్చాల్సినవే.. కానీ, రాజకీయ పార్టీలన్నీ ఒకే తాను ముక్కలు కనుక, దేశవ్యాప్త ప్రజా ఉద్యమాలు తమ ఉమ్మడి పునాదులను పెకిలించి వేస్తాయని, తాము అధికారంలోకి వచ్చినా ఇదే ప్రజా కంఠక పాలనను కొనసాగిస్తామనీ తెలుసు కనుకనే ఎగిసిపడుతున్న ఉద్యమాలను చప్పున చల్లార్చుతున్నారు.

ఉద్యమ గొంతులు నొక్కడానికి తమ చేతులనూ బదులిస్తున్నారు.
దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న ఢిల్లీ ముట్టడితో పాటే, వారి ఉద్యమం పట్ల దేశ ప్రజల మౌనాన్ని కూడా చరిత్ర ఖచ్చితంగా నమోదు చేస్తుంది. పెట్టుబడి దూకుడును, కార్పొరేట్‌ ‌శక్తుల వేగాన్ని, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించే ఒక మహదావకాశాన్ని ఈ సందర్భంగా కోల్పోయామని కూడా భవిష్యత్‌ ‌విశ్లేషించనుంది. చరిత్ర దోషులుగా నమోదు చేసే లోపే ఈ చారిత్రక పోరాటంలో కలిసి సాగాల్సిన అవసరం ఉంది. నిరసన ప్రదర్శనలు, సంఘీభావ ర్యాలీలు, మీడియా ప్రకటనలతో సరిపెట్టడం కాకుండ అన్ని వర్గాల ప్రజలను చైతన్య పరిచి ప్రజా పోరాటంగా మలచాల్సివుంది. అలా జరిగితే అది కేవలం రైతు రక్షణోద్యమమే కాకుండా, ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం కాగలదు. అది మాత్రమే కార్పొరేట్‌ ‌శక్తులను, కార్పొరేట్‌ ‌పాలకులను నిలువరించగలదు, ఓడించి చరిత్ర సృష్టించనూగలదు.
– స్ఫూర్తి. మానుకోట

Leave a Reply