Take a fresh look at your lifestyle.

‘‌పట్టణ’ ప్రగతికి .. పక్కా ప్రణాళిక

kcr

  • దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి
  • అధికారులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు సీఎం  దిశా నిర్దేశం
  • ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి
  • అవినీతి మరక తొలగాలి ప్రతీ వార్డులో అభివృద్ధి కమిటీ
  • డంబాచారాలు, ఫోటోలకు పోజులు వొద్దు ప్రజలతో మమేకమై పని చేయాలి

రాష్ట్రంలోని పట్టణాలను దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. పట్టణాలు అభివృద్ధికి నమూనాలుగా విలసిల్లాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.పట్టుపడితే సాధించి తీరాలన్న సంకల్పంతో కార్యాచరణ ఉండాలని హితవు చెప్పారు.ప్రతీ పట్టణం, ప్రతీ వార్డు అభివృద్ధికోసం ప్రణాళికలను రచించాలని, ఐదేళ్లలో పట్టణాల రూపురేఖలు మారాలని ఆయన స్పష్టం చేశారు. పట్టణాలు మురికికూపాలుగా మారాయని, వాటి స్వరూపస్వభావాలను మార్చడమే మన తక్షణకర్తవ్యవమని ఆయన పేర్కొన్నారు.మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టణప్రణాళిక సదస్సును ప్రారంభించి దిశానిరేద్దశం చేశారు. మునిసిపాలిటీలపైన అవినీతి మచ్చ తొలగిపోవాలని పేర్కొన్నారు.ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పట్టణప్రగతిని గొప్ప స్పూర్తితో నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌ల నుంచి కొత్తగా ఎన్నికైన చైర్మన్‌లకు, మేయర్‌లకు వార్డు సభ్యులకు పట్టణ అభివృద్ధి ప్రణాళిక, ప్రాధాన్యాలపై తెలంగాణ ప్రభత్వ వైఖరిని స్పష్టం చేశారు.ఈ నెల 24 నుంచి పట్టణప్రగతి కార్యక్రమాన్ని ఉద్యమస్పూర్తితో నిర్వహించాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్‌లు,జిల్లా కలెక్ఱర్‌లు, అడిషనల్‌కలెక్టర్‌లు, మునిసిపల్‌ ‌కమిషనర్లు,అడిషనల్‌ ‌కమిషనర్లు, పట్టణాల ప్లానింగ్‌ అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.మూడు గంటలపాటు సాగిన ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టణాల అభివృద్ధి ప్రణాళికల అంశంతోపాటు జాతీయ అంతర్జాతీయ రాజకీయాలను, వివిధ దేశాల్లో జరుగుతున్న అభివృద్ధిని, స్థానిక రాజకీయాలను, విదేశాల్లో పట్టణాల అభివృద్ధి నమూనాలను, తెలంగాణ వచ్చిన నాటినుంచి సాధించిన ప్రగతిని సోదాహరణంగా వివరించారు.

విద్యుత్తురంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని, డిమాండ్‌ 12‌వేల మెగావాట్లకు చేరుకున్నప్పటికీ, ఏ మాత్రం అసౌకర్యం కలుగకుండా విద్యుత్తు సరఫరా చేయగలుతుతున్నాయని, ఇలాంటి విజయాలు అందరి కృషివల్లనే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని, సమిష్టిప్రణాళిక, సమిష్టి శ్రమ అవసరమిన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలలో 68 మునిసిపాలిటీలు, 6 కార్పొరేషన్‌లు మాత్రమే ఉండేవని , తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక మునిసిపాలిటీల సంఖ్యను 128 వరకు పెంచామని, కార్పొరేషన్‌సంఖ్యను 13వరకు పెంచుకున్నామని తెలిపారు. మొత్తం పట్టణాల సంఖ్య 141 వరకు చేరుకున్నదని, అయినప్పటికీ నిధుల కొరత ఉండదని అన్నారు. ప్రతీ నెల పట్టణాలకు నెలకు రూ.70కోట్లు, హైదరాబాద్‌కు రూ.78కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధుల్లో పట్టణాలకు కావాల్సిన నిధులు సమకూరుతాయని చెప్పారు. పట్టణప్రణాళికల్లో పారిశుద్ధానికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.రోడ్లు విస్తరణకు ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలని అన్నారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛభారత్‌ ‌కార్యక్రమం నడుస్తున్నందున మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని, ప్రతీ పట్టణంలో సేదతీరేందుకు, వాకింగ్‌ ‌చేసేందుకు వీలుగా పార్కుల నిర్మాణం జరగాలని, పట్టణాలన్నీ హరితవనాలు కావాలని తెలిపారు. కొత్త ఇంటికి అనుమతులు ఇచ్చే సందర్భంలో పారదర్శకంగా ఉండాలని, ఖాయా పీయా చలేగయా అనే పద్ధతిలో బాధ్యతరహితంగా ఉండదవద్దని హెచ్చరించారు. అవినీతి రహితంగా ఉండాలని ఫిర్యాదులపైన కఠినంగా వ్యవహరిస్తామని, అవినీతిని ఉపేక్షించే ప్రసక్తిలేదని పునరుద్ఘాటించారు.పట్టణాల్లో డిజిటల్‌ ఇం‌టినెంబర్లు ఇచ్చే ఆలోచన ఉన్నదని,ఈ ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించాలని పేర్కొన్నారు.

ప్రతీ రోజూ చెత్త చెదారం ఏరివేయాలని, తడిచెత్త పొడిచెత్త తీసిపెట్టేవిధంగా అవగాహన కల్పించాలని, ప్రతీ ఇంటికి బుట్టలు సమకూర్చాలని చెప్పారు. ప్రతీవార్డులో అధికారులు, ప్రజాప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, కమిటీలు తరచుగా సమావేశమై కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పారు.కూరగాయల మార్కెట్‌లు, మాంసాహార మార్కెట్‌లు, యువతీయువకులకోసం క్రీడాప్రాంగణాలు, జనాభానిష్పత్తికి అనుగుణంగా సాంస్కృతిక వికాసకేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గజ్వెల్‌లో ఈ ఆదర్శాలన్నింటినీ పాటించామని, అద్భుతంగా మహతి ఆడిటోరియంను నిర్మించామని పేర్కొన్నారు.పట్టణాలకు సమీపంలో ఉండే చెరువుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని టాంక్‌బండ్‌ల నిర్మాణాలను శరవేగంగా నిర్మించాలని, ప్రతీ పట్టణంలో ఈ చెరువులు టూరిజం స్పాట్‌లు కావాలని తెలిపారు. 2016లోనే పట్టణాల పరిధిలోని 100 చెరువులకు టాంక్‌బండ్‌లు నిర్మించే పనులను మొదలుపెట్టామని, చాలా చెరువులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌ ‌కేంద్రాలలోని చెరువులు ఆయా పట్టణాల ప్రజలకు విహార కేంద్రాలయ్యాయని పేర్కొన్నారు.సముద్రాల ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరగడానికి అవకావాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే హైదరాబాద్‌లో కాలుష్యం పెరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీనిని నివారించేందుకే హైదరాబాద్‌ ‌మహానగరం చుట్టూ అడవుల విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌ ‌చుట్టూ ఉన్న లక్షా 60 వేల ఎకరాల అటవీభూమిలో దట్టమైన అడువలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సదస్సు తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులు గజ్వేల్‌ ‌పర్యటనలకు వెళ్లారు.

సీఎం గజ్వేల్‌ ‌పర్యటన రద్దు:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌పర్యటన చివరి నిముషంలో రద్దయింది. సీఎం మంగళవారం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పట్టణ ప్రగతిపై దిశానిర్ధేశం చేశారు. అనంతరం ఆయన ప్రజా ప్రతినిధులతో కలిసి గజ్వేల్‌ ‌పర్యటనకు వెళ్తారని సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. అయితే మంగళవారం ఆయన వారితో కలిసి అనివార్య కారణాలవల్ల పర్యటనకు వెళ్లలేక పోయారని సమాచారం.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy