“ఈ బీజేపీ యేతర పార్టీలకు పూర్వపు సోషలిస్టు ఉద్యమంలో భాగస్వామ్యం ఉంది. ఈ పార్టీలన్నీ కలిసి మరో మండల్ ఉద్యమాన్ని ప్రారంభించవచ్చు. అందుకే లాలూ ఈ మధ్య కులగణన గురించి ప్రస్తావిస్తూ మరో మండల్ ఉద్యమం గురించి ప్రస్తావించారు. ఒబీసీలు 52 నుంచి 55 శాతం వరకూ ఉన్నారు. హిందీ రాష్ట్రాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ నాయకులు తమ డిమాండ్లను అంగీకరించకపోతే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమై ఉద్యమించే అవకాశం ఉంది.”
ఉత్తరప్రదేశ్, బీహార్లలో బీజేపీ యేతర పార్టీలు కులగణన అంశాన్ని తేలిగ్గా విడిచిపెట్టే అవకాశం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 23వ తేదీన కులగణన అంశంపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన తర్వాత బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్(యు) నాయకుడు నితీశ్ కుమార్ ఈ అంశంపై మేం చెప్పాల్సింది చెప్పాం. ప్రధాని శ్రద్ధగా విన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు..ఇక నిర్ణయం తీసుకోవల్సింది ఆయనే. అని అన్నారు. నితీశ్ కుమార్ తమ రాష్ట్రం నుంచి 11 మంది ప్రతినిధులతో ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరిలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. ఆయన కూడా అదే మాట అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలని కోరాం. ఇది దేశ చరిత్రలో సువర్ణాధ్యాయానికి నాంది అవుతుంది. పేద ప్రజలకు మేలు జరుగుతుంది అని తేజస్వి అన్నారు. ఈ అంశంపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధానమంత్రి ఈ విషయమై నిర్ణయం తీసుకోవడం అంత తేలికైన విషయమా, దీని వల్ల బీజేపీ ఎదుర్కొనే రాజకీయ పరమైన చిక్కులేమిటి, ఉత్తరప్రదేశ్, బీహార్లలో ప్రాంతీయ పార్టీల వైఖరి ఎలా ఉంటుంది. వాటికి ఎలాంటి అవకాశాలు వొస్తాయి. ఈ అంశంపై ఈ పార్టీలన్నీ ఎందుకు ఏకమయ్యాయి.
ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఇతర వెనకబడిన తరగతుల(ఒబీసీ)ల జనాభా ఎక్కువ. రాజకీయాల్లో కూడా ఆ కులాల ప్రాబల్యం ఉంది. 1991లో మండల్ కమిషన్ నివేదిక వెల్లడైన తర్వాత ఒబీసీలు మరింత బలపడ్డాయి. కేంద్రంలో బీజేపీ అగ్రనాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత కూడా బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్ రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రులుగా కొనసాగగలిగారు. 1990లోనూ, ఆ తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకున్నప్పటికీ, కాంగ్రెస్‌ని మూలకు నెట్టేసినప్పటికీ, కమలనాథులు ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ ఆధిపత్యాన్ని బీహార్‌లో లాలూ కుటుంబం ఆధిపత్యాన్ని తగ్గించలేకపోయారు. బీజేపీ కాంగ్రెస్ నుంచి అగ్రవర్ణాలను వోట్లను కైవసం చేసుకోగలిగినప్పటికీ ఒబీసీల ధాటిని తట్టుకోలేకపోతుంది. అయితే, ములాయం పార్టీలోని అంతః కలహాలను అసమ్మతిని బీజేపీ వినియోగించుకోగలుగుతుంది. మండల్ కమిషన్ సిఫార్సుల వల్ల లాలూ, ములాయంలు ఎక్కువ ప్రయోజనం పొందారు. అయినప్పటికీ వారిలో అసంతృప్తి ఇంకా చల్లారలేదు. అలాగే, బీజేపీ మిత్రుడైన నితీశ్ కుమార్ కూర్మీ సామాజిక వర్గానికి చెందిన వారు.
ఉత్తరప్రదేశ్‌లో అప్నా పార్టీకి చెందిన అనుప్రియ పటేల్ కూడా కూర్మీ సామాజిత వర్గానికి చెందిన వారే. ఈ రెండు రాష్ట్రాల్లో వీరద్దరితో బీజేపీ నెట్టుకొస్తుంది. దీనిని బట్టి ఈ ఈ రాష్ట్రాల్లో ఒబీసీ పలుకుబడి, బలం పెరిగినట్టేకదా. బీజేపీ లాలూ ప్రసాద్ రాజకీయ ప్రాబల్యాన్ని పెద్దగా దెబ్బతీయలేకపోయింది. ఆయనకు ములాయం మద్దతు ఉంది. ముస్లింల మద్దతు సరేసరి. 2014 ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. 1998 నుంచి 2009 వరకూ ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా లాలూ, ములాయం పార్టీలు ఒబీసీల వోట్లు 35 నుంచి 42 శాతం పొందగలిగాయి. 2004, 2009లలో కేంద్రంలో యూపీఏ అధికారంలోకొనసాగింది. ఈ కూటమిలో లాలూ పార్టీ ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉంది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలెపింగ్ సొసైటీస్ డైరక్టర్ సంజయ్ కుమార్ దైనిక్ భాస్కర్లో ఒక వ్యాసం రాస్తూ ఒబీసీ వోట్లలో బీజేపీ 22 శాతాన్ని పొందగా, ప్రాంతీయ పార్టీలు 42 శాతం దక్కించుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, బీజేపీ 2019లో ఒబీసీల వోట్లను పెంచుకోగలిగి 42 శాతాన్ని సాధించింది. ఒబీసీల మద్దతును పెంచుకోవచ్చనే ఆలోచన కమలనాథుల్లో కలిగింది. 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్షేత్ర స్తాయిలో ఒబీసీలు, దళితుల మద్దతు కోసం బాగా కృషి చేసింది.
నితీశ్ కూర్మీ కులానికి చెందినా ఒబీసీగానే చెప్పుకుంటూ వారి మద్దతును పొందగలుగుతున్నారు. బీహార్‌లో కుష్వా, ఉత్తరప్రదేశ్‌లో అనుప్రియ పాటిల్ వంటి ప్రాంతీయ పార్టీల ద్వారా ఓబీసీ వోట్లను సంపాదించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఇవి నిలకడగా ఉండటం లేదు. పైగా ఒబీసీలు ప్రధాని మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. అదే సందర్భంలో ఒబీసీ వోటు బ్యాంకును దశాబ్దాలుగా కలిగి ఉన్న లాలూ, ములాయం వారసులు తమకు ఒబీసీ వోట్లలో గండిపడుతుందన్న విషయం గ్రహించారు. బీజేపీ కార్పొరేట్ వర్గాలు, అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పని చేస్తుందనే విషయం గ్రహించారు. అలాగే, కోవిడ్ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలన్నీ అగ్రవర్ణాలు, కార్పొరేట్ వర్గాలకే దక్కాయి. పేదలకు కోవిడ్ నిరోధక చికిత్సలు, సదుపాయాలు దక్కలేదు. కోవిడ్ వల్ల ఎక్కువ నష్టపోయింది బీద, అట్టడుగు వర్గాలే. గణాంకాలను సేకరిస్తే ఈ విషయం తెలుస్తుంది. కోవిడ్ వల్ల ఉపాధి కోల్పోయిన వారిలో 90 శాతం పైగా ఈ వర్గాలవారేనని ఆర్జేడి నాయకుడు మనోజ్ ఝా తెలిపారు. ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించేందుకు కులగణన ఎంతో ఉపయోగపడుతుందని వీరి వాదన.
మండల్-2
తాజా సర్వేల ప్రకారం నరేంద్రమోడీ పలుకుబడి, జనాదరణ 66 శాతం నుంచి 24 శాతానికి పడిపోయింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా ఈ విషయంలో దెబ్బతిన్నారు. ఈ సమయంలో మోడీ మీద ఒత్తిడి తెచ్చి కులగణన జరిగేట్టు చూడాలన్నది నితీశ్ వ్యూహం. బీజేపీ నితీశ్ డిమాండ్‌ని విస్మరిస్తే వొచ్చే ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బను తినాల్సి వొస్తుంది. ఈ బీజేపీ యేతర పార్టీలకు పూర్వపు సోషలిస్టు ఉద్యమంలో భాగస్వామ్యం ఉంది. ఈ పార్టీలన్నీ కలిసి మరో మండల్ ఉద్యమాన్ని ప్రారంభించవచ్చు. అందుకే లాలూ ఈ మధ్య కులగణన గురించి ప్రస్తావిస్తూ మరో మండల్ ఉద్యమం గురించి ప్రస్తావించారు. ఒబీసీలు 52 నుంచి 55 శాతం వరకూ ఉన్నారు. హిందీ రాష్ట్రాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ నాయకులు తమ డిమాండ్లను అంగీకరించకపోతే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమై ఉద్యమించే అవకాశం ఉంది.
– నళీన్ వర్మ, సీనియర్ జర్నలిస్టు సౌజన్యంతో..