Take a fresh look at your lifestyle.

బార్లు, పబ్బులు, వైన్సులు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు లేవు ?

  • నిబంధనల ఉల్లంఘనలపై కేసులు సమర్పించండి
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

‌తెలంగాణ రాష్ట్రంలో కొరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న దృష్ట్యా వ్యాధి నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బార్లు, పబ్‌లు, థియేటర్లు, వైన్స్‌లపై ఆంక్షలు ఎందుకు విధించలేదో తెలపాలని ఆదేశించింది. రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కొరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై నివేదిక సమర్పించింది. ఆర్టీపిసిఆర్‌ ‌పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారనీ, పూర్తిగా ర్యాపిడ్‌ ‌టెస్టుల పైనే దృష్టి సారించడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆర్టీపిసిఆర్‌ ‌పరీక్షలు 10 శాతం కూడా లేవడం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్టిపిసిఆర్‌ ‌పరీక్షల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామనీ అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌వివరణ ఇవ్వగా క్రమంగా పెంచడం ఏంటని అసహనం వ్యక్తం చేసింది. ప్రతీ రోజూ విధిగా కొరోనా పాజిటివ్‌ ‌కేసులు, మరణాల రేటు వెల్లడించాలని పేర్కొంది. రాష్ట్రంలో కొరోనా చికిత్సా కేంద్రాల వివరాలపై విస్తృతంగా ప్రచారం చేయాలనీ, అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించింది.

అలాగే, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలలో నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని సూచించింది. కొరోనా నిబంధనల అమలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలనీ, నిబంధనలు పాటించని వారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలను వెల్లడిస్తూ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Leave a Reply