Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌లో కొరోనా కేసులెందుకు పెరుగుతున్నాయ్‌…?

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో రోజు రోజుకు కొరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ ‌విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ స్పందించారు. గత రెండు నెలలుగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వాసులు ఎంతో నిజాయితీగా లాక్‌డౌన్‌ ‌పాటిస్తున్నారనీ, అయినా కేసులు పెరగడం ఏంటని రాములమ్మ ప్రశ్నించారు. ఈ మేరకు విజయశాంతి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ…టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన సూచనల మేరకు దాదాపు రెండు నెలల నుంచి ఇండ్లకే పరిమితమవుతున్నప్పటికీ గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వాసులకు కొరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో అంతుబట్టడం లేదన్నారు. మే నెల 8 తర్వాత తెలంగాణలో కొరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతాయని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన ప్రకటనలు చూసి హైదరాబాద్‌ ‌వాసులు చాలా ఆశలు పెంచుకున్నారనీ, కానీ ప్రభుత్వం ప్రకటించిన తేదీ దాటి వారం రోజులు గడిచాక కూడా కొరోనా కేసులు తగ్గకపోగా… మళ్లీ ఈ మహామ్మారి విజృంభిస్తోందన్నారు. కొరోనా వైరస్‌ ‌హైదరాబాద్‌ ‌వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోందనీ, కరోనా వైరస్‌ ‌సోకకుండా నియంత్రించేందుకు హైదరాబాద్‌ను టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రెడ్‌ ‌జోన్‌గా కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ మహానగరంలో ఆంక్షలను చూస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లే వెసులుబాటు కూడా లేదనీ, మరి అలాంటప్పుడు మళ్లీ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్‌ ‌సమయం పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించిందనీ, మరి తబ్లిక్‌ ‌జమాత్‌కు వెళ్లిన వారందరినీ ప్రభుత్వం గుర్తించిందా? వారందరికీ క్వారంటైన్‌ ‌పూర్తయిందని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం స్పష్టత ఇవ్వగలదా?అని ప్రశ్నించారు. ప్రస్తుతం వలస కూలీల వల్ల కొరోనా వ్యాపిస్తోంది అని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కొత్త వాదనను తెరమీదకు తీసుకు వచ్చిందన్నారు. అదే నిజమైతే హైదరాబాద్‌ను రెడ్‌ ‌జోన్‌ ‌ప్రకటించడంలో అర్థమేముంది?అని నిలదీశారు. అంటే, వలస కూలీలు హైదరాబాదులో విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందా? ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ వలస కూలీల వల్ల హైదరాబాద్‌లో కొరోనా వ్యాప్తి చెందకపోతే.. ఎవరి కారణంగా గత నాలుగు రోజుల పాటు కొరోనా కేసులు పెరుగుతున్నాయో స్పష్టత ఇవ్వాలనీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మొదటినుంచి అయోమయ ప్రకటనలతో, అస్పష్ట నిర్ణయాలతో… కొరోనా కట్టడి విషయంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వివాదాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికైనా ఈ వైఖరిలో మార్పు రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందనీ ఆ ప్రకటనలో విజయశాంతి పేర్కొన్నారు.

Leave a Reply