Take a fresh look at your lifestyle.

‌పెద్దలసభకెళ్ళే ఆ పెద్దలిద్దరెవరో…?

రాజ్యసభలో తెలంగాణకు చెందిన ఇద్దరి పదవీకాలం ఏప్రిల్‌ ‌తొమ్మిదితో ముగియనుండగా, వారి స్థానంలో రాష్ట్ర పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందన్న విషయంలో గత కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠత నెలకొంది. తెలంగాణలో గత కొన్ని నెలలుగా వరుసగా ఏవో ఎన్నికలు జరుగుతూనేఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఇప్పటికే అనేకమందికి పార్టీ అవకాశాలిచ్చింది. అయినా ఇతరపార్టీల నుండి విపరీతంగా వలసవచ్చినవారు, పార్టీలో ఇంకా తమకు అవకాశం లభించనివారనేకులు పదవులకోసం వెయిటింగ్‌ ‌లిస్టులో ఉన్నారు. అయితే ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగడానికి ఇద్దరికిమాత్రమే అవకాశం ఉండగా అనేకమంది ఆశావహులు తమ అవకాశంకోసం ఎదురుచూస్తున్నారనేకంటే తమ అనుయాయులతో తీవ్రంగా కృషిచేస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. ఇప్పట్లో మరే ఎన్నికలు లేకపోవడం కూడా ఆశావహుల జాబితా పెరిగిపోవడానికి కారణమైంది. వాస్తవం ఆలోచిస్తే ఆశపడుతున్న వారందరికీ ఒకవిధంగా నిరాశనే మిగిలే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది. ఖాళీఅవుతున్న ఈ రెండుస్థానాలు ఒకవిధంగా ఎప్పుడో భర్తీ అయిపోయాయన్న ప్రచారంకూడా జరుగుతున్నది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీనియర్‌ ‌నాయకుడు, మాజీమంత్రి కూడా అయిన కె. కేశవరావుకే మరో అవకాశం లభించనుందనుకుంటున్నారు. బిసి నాయకుడేకాకుండా, కేంద్రస్థాయిలో వివిధ పార్టీల నాయకులతో తత్సంబంధాలున్న వ్యకి కావడం, టిఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పటినుండి పార్టీకి, పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌కు నమ్మకస్తుడిగా గౌరవప్రదంగా మెదులుతున్న వ్యక్తి. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఏపి నుండి ఎన్నికైన వ్యక్తి. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌లో ఉండి పోరాటంచేసి, టిఆర్‌ఎస్‌లో చేరిన వ్యక్తి. టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఆయనకు సెక్రెటరీ జనరల్‌ ‌పదవి తప్ప, మరే పదవి లభించలేదు.

ఇప్పుడు రాజ్యసభకు మరోసారి అవకాశమిస్తే ఆయన పార్టీమారినందుకు ఒకపదవి లభించినట్లు అవుతుంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే పార్టీ అధినేత కెసిఆర్‌ను కలిసి తన విన్నపాన్ని చెప్పినట్లు తెలుస్తున్నది. ఇక మరో ఖాళీ విషయంలో చాలా మంది ఇప్పటికే ఆ స్థానం కల్వకుంట్ల కవితకే లభిస్తుందని ఫిక్స్ అయిపోయారు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌స్థానంనుండి ఓటమి చవిచూసిన తర్వాత కవిత రాష్ట్ర రాజకీయాల్లో ఇన్‌ ‌యాక్టివ్‌గా మారింది. చాలాకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నది. మహిళల విషయంలో గతంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను ఆ తర్వాత కొనసాగించకపోవడం ఆమె నిర్వేదానికి గురైందన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నది. మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడటమేకాకుండా, సబ్జెక్టు నాలెడ్జ్ ఉం‌డి, కేంద్రస్థాయిలో పలువురిని ఒప్పించి, మెప్పించే నేర్పు ఉండటంవల్ల ఆమెను ఈసారైనా రాజ్యసభకు పంపించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు పార్టీకి చెందిన ఎంఎల్‌ఏలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు పలువురు స్వయంగా కెసిఆర్‌ను కలిసి తమ అబిప్రాయాన్ని తెలియజేసినట్లు తెలుస్తున్నది. ఇదిలాఉంటే కవిత మాత్రం రాజ్యసభ సభ్యురాలిగా ఉండేందుకు ఇష్టపడడంలేదని తెలుస్తున్నది. తాను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే పదవిని సాధించుకోవా లనుకుంటున్నట్లుగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తున్నది. ఈ రెండు స్థానాల విషయంలో మొదటి అభ్యర్థులుగా భావిస్తున్న వీరిద్దరికే ముందుగా అవకాశం ఉంటుంది. ఒకవేళ వీరి అభ్యర్థిత్వాల విషయంలో ఏదైనా మార్పు సంభవిస్తే తప్ప ఇతరులకు అవకాశంరాదు.

కవిత ఒకవేళ నిర్ద్వంద్వంగా తిరస్కరించిన పక్షంలో అదేసామాజిక వర్గానికి చెందిన దామోదర్‌రావుకు అవకాశం వస్తుందను కుంటున్నారు. అయితే ఇటీవల ఆయనకు టిటిడి బోర్డు సభ్యుడిగా అవకాశం రావడంతో ఒకరికి రెండు పదవులిచ్చే అవకాశం ఉండకపోవచ్చు. రాష్ట్ర హెంశాఖ మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి తనకీ అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే అధిష్ఠానాన్ని అడుగుతున్న విషయం తెలియందికాదు. ఆయన స్వయంగా కెసిఆర్‌ను కలిసి తన కోరికను వెల్లడించినట్లు తెలిసింది. హోంమంత్రి పదవినుండి దిగిపోయిన తర్వాత ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నవిషయం తెలియందికాదు. అలాగే మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికూడా. ఎన్టీఆర్‌ ‌కాలంనుండి నిన్నమొన్నటివరకు మంత్రిగా కొనసాగుతూవచ్చిన కడియం శ్రీహరి సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేకపోతున్నది. ఈసారైనా ఆయన్ను రాజ్యసభకు పంపిస్తుందాలేదా అన్నది తేలకుండాఉంది. రాజ్యసభ పదవులను ఆశిస్తున్నవారిలో కడియం శ్రీహరిలాగానే టిడిపినుండి టిఆర్‌ఎస్‌లో వచ్చి మంత్రిగా కొనసాగి, గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తుమ్మల నాగేశ్వర్‌రావు, కొద్దికాలం క్రితమే పార్టీ మారిన మండవ వెంకటేశ్వర్‌రావు, మరో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపిలు డాక్టర్‌ ‌మందా జగన్నాథం, సీతారామ్‌నాయక్‌, ‌పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ స్పీకర్‌ ‌సిరికొండ మధు సూదనాచారితోపాటు హెటిరో కంపెనీ అధినేత పార్థసారథిరెడ్డి, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారవేత్త ప్రవీణ్‌రెడ్డి తదితరులనేకులున్నారు. ఈనెల పదమూడున నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండడంతో మరో రెండు రోజుల్లో ఈ ఉత్కంఠతకు తెరపడనుంది.

Tags: Tummala Nageshwar Rao, a few years back, Mandawa Venkateswara Rao, another former minister Baswaraju Saraiya, former MPs Dr Manda Jagannathan, Sitaram Nayak, Ponguleti Srinivasa Reddy, former speaker

Leave a Reply