Take a fresh look at your lifestyle.

సహకార సంఘాల్లో పైచెయ్యి ఎవరిది ?

Parties' strategies for Co-operative Societies Elections In telangana

వరుస ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్న అధికార పార్టీ సహకార ఎన్నికల్లోనూ తన మెజార్టీనీ నిరూపించుకోబోతున్నది. నామినేషన్‌ల గడువు శనివారంతో ముగియగా, వాటి పరిశీలన అనంతరం సోమవారం నామినేషన్‌ల ఉపసంహరణ కార్యక్రమం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇవి చివరి ఎన్నికలు కావడంతో గత వివిధ ఎన్నికల్లో తమ అర్హత, అవకాశాలను దక్కించుకో)••క పోయిన వారు ఈ ఎన్నికల ద్వారానైనా ప్రజాప్రతినిధులుగా పిలుపించుకోవాలని తెగ ఉత్సాహపడ్డారు. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడుతున్నప్పటికీ అధికార పార్టీ తప్ప మిగతా పార్టీలేవీ గ్రామస్థాయిలో చొచ్చుకుపోలేక పోయాయి. అధికార పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజల అనుభవంలో ఉండడంతో ఆ పార్టీవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తున్నది. ఇతర రాజకీయ పార్టీలు అధికార పార్టీపై ఎంత దుమ్మెత్తి పోసినా తమకు లభ్యమవుతున్న పెన్షన్‌లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలే ఎక్కువగా పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. వాస్తవంగా పార్టీల అభ్యర్థులు నేరుగా పోటీలో లేకున్నా, ఆయా పార్టీల మద్దతుతోనే రైతులు పోటీలో నిలిచారు.

రాష్ట్రంలోని 906 ప్రాథ•మిక వ్యవసాయ, సహకార(పిఏసిఎస్‌) ‌సంఘాలకు ఈ నెల పదిహేనవ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. వరంగల్‌, ‌నల్లగొండ, జిల్లాల్లోని సంఘాలకు ఇంకా కాలపరిమితి ఉండడం, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి సంఘాన్ని రద్దు చేయడంతో అవి మినహా పైన చెప్పిన సంఘాలన్నిటిలోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు కూడా ప్రకటించే ఏర్పాట్లు కూడా చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రంతో పూర్తికానుండగా బరిలో ఉన్నవారికి వెంటనే గుర్తులను కూడా కేటాయించే ఏర్పాటు చేశారు. అయితే వీటిల్లో చాలావరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా సంఘాల ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు తాము బలపరుస్తున్న అభ్యర్థులే గెలుస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందని, ఎన్నికల అధికారులకు పలుసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, ఈ ఎన్నికల్లో కూడా తిరిగి అలాంటి నిర్లక్ష్యం కూడదని కాంగ్రెస్‌ ‌పార్టీ హెచ్చరిస్తోంది. అధికారం ఉందికదా అని అధికార పార్టీ వోటర్లపై బెదిరింపులకు పాల్పడుతోందని, వారి బెదిరింపులకు వోటర్లు ఏమాత్రం భయపడకుండా స్వచ్ఛందంగా తమ వోటు హక్కును వినియోగించుకోవాలని ఆ పార్టీ పేర్కొంటోంది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. అప్పుడు పూర్వపు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తొమ్మిది మంది జిల్లాల డిసిసిబి బ్యాంకులను ఆనాడు కాంగ్రెసే దక్కించుకుంది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క వరంగల్‌ ‌డిసిసిబి తప్ప మిగతా డిసిసిబి చైర్మన్‌లంతా అధికార పార్టీలో చేరడం గమనార్హం. దాన్ని దృష్టిలో పెట్టుకుని సహకార ఎన్నికల్లో తమ విజయం ఖాయమని అధికార పార్టీ ధీమాను వ్యక్తం చేస్తోంది. అంత మాత్రాన నిర్లక్ష్యం కూడదని, గ్రూపులు మాని, పార్టీ కార్యకర్తలు సమష్టిగా కృషిచేస్తేనే అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేతలు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పిఏసిఎస్‌ల్లోని అభ్యర్థులంతా రైతులే కాబట్టి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నిరంతర విద్యుత్‌, ‌విత్తనాలు, పురుగుమందులు అందుబాటులో ఉంచడంతో పాటు పంట పొలాలకు గతంలోకన్నా ఈ ప్రభుత్వంలో నీళ్ళు అందే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన, వివిధ రకాల ఫించన్లను అందుకుంటున్న దరిమిలా అధికార పార్టీ బలపర్చే అభ్యర్థుల గెలుపు ఖాయమన్న నమ్మకం ఆ పార్టీలో ఉంది. దానికి తగినట్లుగా ప్రతిపక్షంలో మరేపార్టీ కూడా గ్రామీణ ప్రాంతంలో అంతగా దూసుకుపోతున్నట్లు కనిపించడంలేదు. ఇదిలా ఉంటే జిల్లా కేంద్ర సహకార(డిసిసిబి) బ్యాంకు పాలక మండలి ఎన్నికలు పూర్వపు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో డిసిసిబి చైర్మన్‌ ‌పదవులను దక్కించుకునేందుకు పలువురు అధికార పార్టీ నేతలు తెగ ఉత్సాహపడుతున్నారు. అందుకే వారంతా ఇప్పుడు ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలపై దృష్టి సారించారు. చాలా వరకు ఏకగ్రీవం అయ్యేవిధంగా తంటాలు పడుతున్నారు. సోమవారం నామినేషన్‌ల ఉపసంహరణ రోజు కావడంతో పోటీలో ఉన్నవారితో పలువురు ఉత్సాహవంతులైన నాయకులు మంతనాలు చేసి, సాధ్యమైనంతవరకు పోటీ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతలో కొంత అందులో విజయవంతమైనారనే చెప్పవచ్చు. పిఏసిఎస్‌ ‌డైరెక్టర్లుగా, అ తర్వాత సిఏసిఎస్‌ ‌చైర్మన్‌లుగా ఎన్నికై డిసిసిబి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలన్నదే వీరి అభిలాష.

Leave a Reply