Take a fresh look at your lifestyle.

మేయర్‌గా పట్టంగట్టేదెవరికో…?

“ఒక విధంగా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికల తంతు జరిగినప్పటికీ ఏ పార్టీ కూడా తమ మేయర్‌ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని చివరి వరకు ప్రకటించలేదు. నాలుగు జిల్లాల పరిధిలోని ఇరవై ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలను కలుపుకుని, 150 కార్పొరేషన్‌ ‌డివిజన్‌లున్నాయి. కాగా రాష్ట్ర వోటర్లలో దాదాపు ఒకట్లో మూడవ వంతు వోటర్లున్న ఈ మహానగర వాసులు తమ మేయర్‌ అభ్యర్థి ఎవరన్నది తెలియకుండానే ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. తాము మేయర్‌ ‌గద్దెపై ఎవరిని కూర్చోబెట్టాలని కోరుకుంటున్నామన్నది కూడా వారికి తెలియదు.”

గ్రేటర్‌ ‌హైద రాబాద్‌ ‌నగర మేయర్‌గా ప్రజలు ఎవరికి పట్టం కట్ట బోతున్నారన్నది నేడు తేలనుంది. కాగా, నిన్నటి వరకు ప్రచా రంలో తలము నకలైన రాజకీయ పార్టీలన్నీ గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. దుబ్బాక ఎన్నిక ఫలితం వొచ్చిన వెంటనే జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ‌వెలువడడంతో ప్రతిపక్ష పార్టీల ప్రచారానికి చాలా తక్కువ వ్యవధి లభించినప్పటికీ తమ శక్తిమేర వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాయి. పోటీపడి తమ మ్యానిఫెస్టోలతో ప్రజలపై అంతులేనీ హామీలను గుమ్మరించాయి. గతంలో ఎన్నడూలేని విధంగా గల్లీ నుండి ఢిల్లీ స్థాయి నాయకులు ఈ ప్రచారంలో పాల్గొనడం విశేషం. ప్రతీ పార్టీ కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోవడం అంత సులభమేమీ కాదన్న విషయాన్ని అర్థం చేసుకుని, గల్లీగల్లీ తిరిగి, ప్రతీ వోటరును కలుసుకోవడానికి ప్రయత్నించాయి. ఒక విధంగా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికల తంతు జరిగినప్పటికీ ఏ పార్టీ కూడా తమ మేయర్‌ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని చివరి వరకు ప్రకటించలేదు. నాలుగు జిల్లాల పరిధిలోని ఇరవై ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలను కలుపుకుని, 150 కార్పొరేషన్‌ ‌డివిజన్‌లున్నాయి. కాగా రాష్ట్ర వోటర్లలో దాదాపు ఒకట్లో మూడవ వంతు వోటర్లున్న ఈ మహానగర వాసులు తమ మేయర్‌ అభ్యర్థి ఎవరన్నది తెలియకుండానే ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. తాము మేయర్‌ ‌గద్దెపై ఎవరిని కూర్చోబెట్టాలని కోరుకుంటున్నామన్నది కూడా వారికి తెలియదు.

వ్యక్తిని చూసి కాకుండా పార్టీని చూసే వోటేయ్యాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. గత ఎన్నికల్లో 99 డివిజన్‌లను గెలుచుకున్న టిఆర్‌ఎస్‌ ఈసారి కూడా వందకు పైగా స్థానాలను గెలుచుకుంటామని చెబుతోంది. అయితే గత ఎన్నికల నాటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు లేదంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికల నాటికి బిజెపి అనూహ్యంగా అధికార పార్టీకి ఎదురు నిల్చింది. దక్షిణాదిలో తెలంగాణపై కాషాయ జెండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా ఇక్కడ పావులు కదుపుతూ వొచ్చిన బిజెపి గత సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు పార్లమెంటు స్థానాలను సాధించుకుంది. అలాగే సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయంటారు. కాని దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌తన స్థానాన్ని పోగొట్టుకోగా, బిజెపి విజయ ఢంకా మోగించింది. అప్పటికిగాని అధికార పార్టీకి కాక పుట్టలేదు. అందుకే ఆ ఎన్నికల వెంటనే గ్రేటర్‌ ఎన్నికలు జరుపాలనుకుంది. టిఆర్‌ఎస్‌ ఊహించినట్లే ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌బిజెపితో గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వొచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రతీ అంశంలో బిజెపి అధికార పార్టీని డిఫెన్స్‌లో పడేయ గలిగింది.

బిజెపి నిలదీస్తున్న అనేక అంశాలపై ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. అయితే బిజెపిపై ఎదురుదాడి చేస్తూ అధికార పార్టీ ఇచ్చిన స్లోగన్స్ ‌ప్రజల్లోకి అంతగా చొచ్చుకుపోలేక పోయాయన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో బిజెపి చిచ్చుపెడుతోందంటూ ప్రశాంత హైదరాబాద్‌ ‌కావాలా, కల్లోల హైదరాబాద్‌ ‌కావాలా అన్న నినాదం ఎందుకో అంతగా ప్రజలను ఆ••ట్టుకున్నట్లు లేదంటున్నారు. అలాగే అభివృద్ధి కావాలా..విధ్వంసం కావాలా..అన్న నినాదం కూడా పెద్దగా ఫలించలేదన్న అభిప్రాయముంది. ముఖ్యంగా కేంద్రం నిధులు, రెండు గదుల ఇళ్ళ విషయంలో అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్లుగానే టిఆర్‌ఎస్‌ ‌పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ తాము ఈ ఎన్నికల్లో గెలువకపోతే అధికార పార్టీ మేయర్‌ ‌పదవిని ఎంఐఎంకు కట్టబెడుతుందంటూ బిజెపి చేసిన ప్రచారం నగర వోటర్లను అలోచింప జేసేదిగా మారింది. ఎంఐఎం నాయకులు, ఒవైసీ సోదరులు టిఆర్‌ఎస్‌పైన, పివి, ఎన్‌టిఆర్‌ ‌స్మారక చిహ్నాలపై మాట్లాడిన తీరుపై టిఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ ‌కూడా అనుకున్న స్థాయిలో ప్రతిఘటించక పోవడం కూడా ప్రజలను కొంత విస్మయానికి గురిచేస్తోంది.

బిజెపి మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకుని ప్రతిగా రెండు గంటల్లో దారుస్సలేంను కూల్చివేస్తామంటూ తీవ్రంగా ప్రతిఘటించి, తన దూకుడును పెంచింది. గోలకొండపైనే కాషాయ జెండాను ఎగురవేస్తామని చెబుతున్న బిజెపి, ముందుగా కోర్పొరేషన్‌పైన తమ జెండాను ఎగురేస్తామంటోంది. దీనికి తగినట్లు కాబోయే మేయర్‌ ‌తమవాడేనని ఆవేశ పూరిత ప్రసంగాలు చేసిన ఎంఐఎం గతంలోకన్నా మరో పది స్థానాల్లో అంటే యాభై స్థానాల్లో తమ అభ్యర్ధులు నెగ్గుతారని చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయాన్ని ఇప్పటివరకు ఎవరూ పెద్దగా అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఒకటి మినహా మరే సర్వే సంస్థలు తమ సర్వేలను వెల్లడించలేదు. ఆ సంస్థ మాత్రం ఈ ఎన్నికల్లో బిజెపికి పట్టం కట్టింది. టిఆర్‌ఎస్‌ను మూడవ స్థానానికి నెట్టింది. ఎంఐఎంకు రెండవ స్థానాన్ని సూచించింది. చివరగా కాంగ్రెస్‌ను నిలబెట్టింది.

మంగళవారం వోటింగ్‌ ‌ప్రక్రియ పూర్తి అయితేగాని వెల్లడయ్యే ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌ఫలితాలెలా ఉంటాయో చూడాల్సి ఉంది. కాగా ఆదివారం ప్రచార కార్యక్రమాలకు తెరపడినప్పటి నుండి ప్రచారానికి సోషల్‌ ‌మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ మొదలైంది. అభ్యర్థుల అనుమాయులు ఇంటింటికి తిరిగి వీటిని పంచుతున్నారన్న అరోపణలు అనేకం వెలుగు చూస్తున్నాయి. వోటరు ఒక్కంటికి వెయ్యి మొదలు పదివేల వరకు ఇస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. డబ్బులు పంచేందుకు చిన్న పిల్లలను కూడా వాడుకునే ఎత్తుగడలు కూడా వేస్తున్న ఆరోపణలు వొస్తున్నాయి. ఈ విషయంలో రాజకీయ పార్టీల మధ్య గొడవలు బయలుదేరాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై నగర పోలీసు కమిషనర్‌ ‌కార్యాలయం ముందు ధర్నాతోపాటు రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఉన్న ఇంటిని బిజెపి నాయకులు ముట్టడించడంతో నగరంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులేర్పడ్డాయి.

Manduva ravindar rao
మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Leave a Reply