Take a fresh look at your lifestyle.

దలారుల నుండి రైతన్నను కాపాడేదెవరు?

“రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్తిపంట కనీస మద్దతుధర క్వింటాలుకు 5,700 రూపాయలు ప్రకటిస్తే.. దిగుబడిని ట్రాక్టర్‌లో మిల్లుకు తీసుకెళ్లడం, ఆధార్‌ ‌కార్డ్, అకౌంట్‌ ‌నెంబర్‌ అన్నీ సమర్పించి, తీసుకెళ్ళిన వాహనాలకు కిరాయికట్టలేక తల ప్రాణం తోకకొచ్చింది. మధ్యవర్తులకే అమ్మడానికి తప్పలేదు. మొదట్లో 4,400 రూపాయలకే తీసుకుంటే, ప్రస్తుతం క్వింటాల్‌ ‌కు 5,200 రూపాయల ధర పెట్టడంతో చేతికొచ్చిన మొత్తం 36,400 రూపాయలు కాగా అందులో హమాలి, తరుగూ పోగా మిగిలింది 35,000 రూపాయలు. పెట్టుబడి ఖర్చుచూస్తే.. 37,000 రూపాయలకుపైనే.”

2020 సంవత్సరాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. వలస కార్మికులు, రైతులు, ప్రైవేటు కొలువుల్లోవారు, సామాన్యుల బ్రతుకులు కోవిడ్‌-19 ‌వైరస్‌ ‌వలన అస్తవ్యస్తంగా మారాయి. ఇదిలా ఉండగా, ప్రకృతి కన్నెర్రచేసిన అతివృష్టి నట్టేటముంచింది. కరోనా నేపథ్యంలో పల్లెలకు చేరుకున్న ప్రజానీకం తమకున్న అతికొద్ది వ్యవసాయ భూములలో ప్రత్తి సాగు మొదలెట్టి ప్రతిఫలం అందక, అప్పుల వలయంలో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే దలారులకు చిక్కి రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.

స్వానుభవానికి అక్షరరూపం ఇస్తే….. ఉన్నంతలో చదువు పూర్తిచేసి, ప్రభుత్వ కొలువు రాక, ప్రైవేటు కొలువుచేరి కుటుంబం పోషించుకుంటూన్న తరుణంలో కోవిడ్‌-19 ‌కారణంగా కొలువులు పోయి, పల్లెకు చేరాను. ఉన్న రెండు ఎకరాలలో పత్తి సాగు మొదలెట్టాను..రెండెకరాల భూమి చదునుకు ట్రాక్టర్‌ ‌కిరాయి 6,000 రూపాయలు. నాసిరకం పత్తి విత్తనాలకు 6,000 రూపాయలు, ఎరువులు, పురుగు మందులకు 6,000 రూపాయలు, రెండు మార్లు గుంటుకకు 6,000 రూపాయలు, కలుపు తీయడానికి 4,000 రూపాయలు ఖర్చయింది. ఇలాంటి సమయంలో పత్తిపంట చేతికొచ్చాక ఏరడానికి కూలీలకొరత ఏర్పడి, కిలో ప్రత్తిని తీయడానికి 10 నుండి 15 రూపాయల చొప్పున ఖర్చు ఒక ఎత్తైతే, ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్లు రావడం మరో ఎత్తు. మాకున్న పొలంలో రెండు ఎకరాలకు 7 క్వింటాల పత్తితీయడానికి దాదాపు 9,000 రూపాయలు కూలీలకు చెల్లించాను. పెట్టుబడి ఖర్చు 37,000 రూపాయలు దాటిపోయింది. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్తిపంట కనీస మద్దతుధర క్వింటాలుకు 5,700 రూపాయలు ప్రకటిస్తే.. దిగుబడిని ట్రాక్టర్‌లో మిల్లుకు తీసుకెళ్లడం, ఆధార్‌ ‌కార్డ్, అకౌంట్‌ ‌నెంబర్‌ అన్నీ సమర్పించి, తీసుకెళ్ళిన వాహనాలకు కిరాయికట్టలేక తల ప్రాణం తోకకొచ్చింది. మధ్యవర్తులకే అమ్మడానికి తప్పలేదు. మొదట్లో 4,400 రూపాయలకే తీసుకుంటే, ప్రస్తుతం క్వింటాల్‌ ‌కు 5,200 రూపాయల ధర పెట్టడంతో చేతికొచ్చిన మొత్తం 36,400 రూపాయలు కాగా అందులో హమాలి, తరుగూ పోగా మిగిలింది 35,000 రూపాయలు. పెట్టుబడి ఖర్చుచూస్తే..37,000 రూపాయలకుపైనే. నాలుగైదు నెలల కష్టంపోగా, నష్టాలపాలు కావలసి వచ్చింది.

ఎవరు ఆదుకుంటారు?
ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, మధ్యవర్తుల చేతిలో రైతు ఎలా మోసపోతున్నాడనే విషయం. కొన్న పత్తిలో ఒక క్వింటాలుకు తరుగని, రకరకాల కారణాలతో 4 కేజీల ప్రత్తిని గుంజు కోవడంతో పాటు మద్దతు ధరకు చాలా తక్కువగా ఇవ్వడం. పలువురు సన్న, చిన్నకారు రైతుల వద్ద జమ చేసుకొని వివిధ వాహనాలలో తీసుకెళ్లి ప్రభుత్వం ప్రకటించిన ధరకు అమ్ముకొని తక్కువ కాలంలో దలారి లాభాలపంట పండించు కోవడం ఒకెత్తు. ప్రభుత్వం ప్రకటించిన ధర కేవలం 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు మేలుచేస్తుంది తప్ప, రెండెకరాలలోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు.

ఇలాంటి రైతులకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర, కేంద్ర మంత్రులు అండగా నిలుస్తారా.? రైతుల కోసమంటూ ఉపన్యాసాలిచ్చే వారా?. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడేది కేవలం పేదప్రజల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి కోసమే. కానీ వారు చేసే చట్టాలు, చేసే ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఎలా ఉపయోగ పడుతున్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఐదు ఎకరాలలోపు ఉన్న ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, క్రిమిసంహారక మందులను ఉచితంగా ఇచ్చి, మధ్యవర్తిత్వ దలారుల వ్యవస్థ రూపుమాపి, రైతుకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రైతు మేలుకోరే ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలుస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతుల బాగోగుల గురించి ఆలోచించి, రైతుకు లాభాలు చేకూర్చకపోయినా, కనీస అవసరాలు తీరే విధంగా తోడ్పాటు అందిస్తారని ఆశ.

Leave a Reply