Take a fresh look at your lifestyle.

ఈటలతో ఢీ కొనేదెవరు ?

భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా హుజురాబాద్‌ ఎన్నికలబరిలో నిలిచిన ఈటల రాజేందర్‌ను ఢీ కొనేవారెవరెవరన్నది ఇంకా తేలక పోయినా ఆ నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వేడిరాచుకున్నది. ఇక్కడ జరగాల్సిన ఉప ఎన్నిక కు ఇంకా నోటిఫికేషన్‌ ‌విడుదల కాకపోవడంతో ఇప్పుడప్పుడే రాజకీయ పక్షాలు తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పటికీ అన్ని పార్టీలు ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నాయి. శాసన సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండే ఈటల రాజేందర్‌ అం‌దరికన్నా ప్రచారంలో ముందు వరుసలో నిలిచారు. కాషాయ కండువా కప్పుకున్న వెంటనే ఆయన తన నియోజకవర్గాన్ని చుట్టబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. తాజాగా సోమవారం నుంచి పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలను ఏర్పాటుచేసి, అధికార పార్టీలో జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. నిమ్న వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా మభ్యపెడుతున్నదీ, వివిధ ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకిచ్చిన హామీలు, పథకాల ప్రకటనల అమలులో ఎలా విఫలమైన విషయాలను ఆయన సోదాహరణంగా వివరిస్తూ వొస్తున్నారు.

అన్నిటికీ మించి ఆయన పర్యటనలో ప్రధానంగా తనపై దాడికి కుట్ర జరుగుతున్న విషయాన్ని ఆయన ఎత్తి చూపుతున్నారు. అయితే ఆయన ప్రచారంలో ముందు వరుసలో నిలబడినా ఆ స్థానంలో తన భార్యను నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇటీవల ఆయన భార్య మీడియా ముందు మాట్లాడిన తీరు ఆ అనుమానాలకు తావిస్తున్నది.ఈటల రాజేందర్‌ ‌పోటీ చేస్తే ఏర్పడే పరిణామాలకు, ఆయన భార్య పోటీ చేస్తే ఉండే పరిస్థితుల పైనే ఇప్పుడు ఇతర పక్షాలు అంచనా వేసు కుంటున్నాయి. దాన్నిబట్టే తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఆ పక్షాలున్నాయి. ఏది ఏమైనా ఇక్కడ పోటీ మాత్రం మూడు ప్రధాన పక్షాల మధ్యనే ఉంటుందన్నది స్పష్టం. అధికార తెరాస ఈసారి ఎవరిని బరిలోకి దించబోతున్నదన్న విషయంలో అనేక ఊహాగానాలు బయలుదేరాయి. అసలు ఈటల ను బర్తరఫ్‌ ‌చేసేవరకే ఆ పార్టీ అధినేతకు దీనిపై ఒక అవగాహన ఉండే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సర్వేలు, పార్టీ క్యాడర్‌తో అభిప్రాయ సేకరణ అన్నది పైపైన కనిపించే అంశాలు మాత్రమేనన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు.

ఇదిలా ఉంటే తెరాస నుండి కౌశిక్‌రెడ్డి పోటీ చేస్తారన్నది మాత్రం విస్తృత ప్రచారంలో ఉంది. ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీలో కొనసాగుతున్నప్పుడే ఇలాంటి ప్రచారం జరుగడం పలువురిని ఆశ్చర్యపర్చింది. తనకు టిఆర్‌ఎస్‌ ‌టికట్‌ ‌ఖాయమన్న వీడియో రికార్డులు బయట పడడం పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో ఇంకా కొనసాగే అవకాశాలులేకుండా పోయాయి. తప్పనిసరిగా ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి వొచ్చింది. అయితే నిజంగానే ఆయన గులాబీ కండువ కప్పుకుంటారా, వీడియోల్లో బయటపడినట్లు ఆయనకే టిఆర్‌ఎస్‌ ‌టికట్‌ ఇస్తుందా అన్నది మాత్రం ఇంకా ప్రశ్నగానే ఉంది.ఈటల బిసి సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఇక్కడ మరో బిసి నేతనే టిఆర్‌ఎస్‌ ఎం‌చుకుంటుందన్న అభిప్రాయంకూడా లేకపోలేదు. అలా అయితే ఈటల ను తట్టుకుని నిలబడగల టిఆర్‌ఎస్‌ ‌నాయకులెవరన్న చర్చజరుగుతోంది.

కాగా, బీసీ కమిషన్‌ ‌మాజీ సభ్యుడైన వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేరు మొదట ప్రచారంలోకి వొచ్చింది.ఈటల ను బిజెపిలో తీసుకోవడంపట్ల అలకచెందిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి స్థానికుడే కాబట్టి ఆయనకు టికట్‌ ఇస్తే ఈటల కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి సోదరుడు పురుషోత్తమరెడ్డి పేరు కూడా కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఇదిలాఉంటే, సోషల్‌ ‌వెల్‌ఫేర్‌ ‌గురుకులాల కార్యదర్శి, ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ ‌తాజాగా అధికారిక పదవులన్నిటికీ రాజీనామా చేయడం వెనుక ఏదో పెద్ద ఎత్తుగడే ఉందనుకుంటున్నారు. తానిప్పుడప్పుడే రాజకీయాల్లోకి వొచ్చే ఆలోచనలేదని చెబుతున్న ప్రవీణ్‌కుమార్‌ ‌రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రం చెప్పడంలేదంటేనే టిఆర్‌ఎస్‌ ఆయనకు టికట్‌ ఇస్తుందా అన్న అనుమానాలకు తావేర్పడింది. అలాగే బిసి నేతగా ఆ వర్గాల్లో మంచి పట్టున్న ఎల్‌. ‌రమణ టిడిపిని వొదిలి టిఆర్‌ఎస్‌ ‌తీర్థం తీసుకున్న విషయం తెలిసిందే. బీసీల్లో బలమైన నాయకుడు కావడంవల్ల ఈటల కు ధీటుగా రమణను నిలబెడుతారనుకుంటున్నారు. వీరితో పాటుగా మరికొన్ని పేర్లుకూడా ప్రచారంలో ఉన్నాయి.

కౌశిక్‌రెడ్ది దూరమైన్పటినుండీ కాంగ్రెస్‌ ‌పార్టీకూడా బిజెపిని, టిఆర్‌ఎస్‌ను ఢీకొని నిలబడగల అభ్యర్థి అన్వేషణలో ఉంది. తమ పార్టీలో బలమైన నాయకుడిగా భావించిన కౌశిక్‌రెడ్డి పార్టీకి ద్రోహం చేశాడన్న అభిప్రాయం అక్కడి క్యాడర్‌లో ఉంది. అయితే పార్టీ పగ్గాలను రేవంత్‌రెడ్డి లాంటి యువకుడు చేపట్టాడన్న ఉత్సాహం వారిని ఉరకలెత్తిస్తున్నది. అనేక వివాదాల నడుమ ఆ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన రేవంత్‌రెడ్డి తన సత్తా ఏమిటో చూపించుకునే అవకాశం ఈ ఎన్నిక వల్ల ఏర్పడింది. అందుకే ఆయన కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే పీసీసీ ఇన్‌ఛార్జి, మాజీ డిప్యూటీ సిఎంగా ఉన్న దామోదర రాజనర్సింహకు నియోజకవర్గ బాధ్యతను అప్పగించారు. అలాగే జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లను సమన్వయకర్తలుగా ఏర్పాటుచేయడంతోపాటు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించడం ద్వారా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ ‌జండాను ఎగురవేసే సన్నాహాలను ఆ పార్టీ చేస్తోంది.

Leave a Reply