Take a fresh look at your lifestyle.

ఎవరిని నిందించాలి..?

ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ప్రైవేటు(కార్పొరేట్‌) ‌హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరోసారి హెచ్చరించాల్సిన అవసరం వచ్చిందంటేనే, ఈ హాస్పిటళ్ల పట్ల ప్రభుత్వం ఎలాంటి ఉదాసీన వైఖరిని చూపిస్తున్నదన్నది స్పష్టమవుతున్నది. ప్రైవేటు హాస్పిటళ్ల తీరుపై ఇప్పటికే చాలామంది న్యాయస్థానం తలుపులు తట్టారు. ఇంచుమించి అన్ని కేసుల్లో కూడా న్యాయస్థానం ప్రభుత్వాన్ని శాసిస్తూనే ఉంది. అయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడలా ప్రభుత్వం వ్వవహరించడంతో సామాన్య ప్రజలు ప్రాణాంతక వ్యాధితో అటు ప్రాణాలు, ఇటు ఇల్లుగుల్ల అవుతున్న సంఘటనలనేకం నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి హాస్పిటళ్లకు రాయితీలను అందించిన ప్రభుత్వం వాటిని ఎందుకు రద్దుచేయడం లేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించిన విషయం తెలిసిందే. నిరుపేదలకు వైద్యసేవలు అందిస్తామన్న హామీమేరకే ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటళ్లకు అనేక రాయితీలను అందిస్తూ వస్తున్నది. అయితే పేరొందిన హాస్పిటళ్లలేవీ ఆ విషయాన్ని ఏనాడూ పెద్దగా పట్టిచ్చుకున్న దాఖలాలు లేవు. పైగా చిన్న జబ్బులకే లక్షలాది రూపాయలను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న ఉదంతాలు అనేకం. ఇదంతా బహిరంగ రహస్యమైనా ప్రభుత్వం మాత్రం ఏనాడు వాటిని కట్టడిచేయలేదు. అంతకు ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే కొరోనా కాలంలో ఈ హాస్పిటళ్లకు ఏమాత్రం అదుపులేకుండా పోయిందనడానికి నిత్యం వార్తా పత్రికల్లో, సోషల్‌మీడియాల్లో వస్తున్న కథనాలే ప్రత్యక్ష్య సాక్షాలుగా నిలుస్తాయి. కొరోనా సోకిన వారికి వైద్యం చేస్తూ తాను ఆ మహమ్మారి బారినపడిన ఓ డాక్టరమ్మ తాను చికిత్స చేయించుకున్న ప్రైవేటు హాస్పిటల్‌ ఇచ్చిన బిల్లు చూసి బోరున ఏడ్చిన ఘటన ఎలా వైరలైందో తెలియంది కాదు.  మరో డాక్టర్‌ ‌పరిస్థితి కూడా అదే. మూడురోజుల చికిత్సకు లక్షా ఎనభైవేల బిల్లు రావడంతో ఆ డాక్టర్‌ అవాక్కయిన విషయం జగత్‌ ‌విధితమే.
మామూలు జ్వరంలో హాస్పిటల్‌కి వెళ్ళితే కొరోనా భూతం పేరు చెప్పి అడ్డగోలు పరీక్షల పేర వేలాది రూపాయలను ఖర్చుచేయిస్తున్నారంటూ  ప్రజలు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. నెగెటివ్‌ ‌వచ్చినా అనేక పరీక్షల పేర భారీగానే ఖర్చు చేయిస్తున్నారు. తనకు కొరోనా లేకున్నా చికిత్స వార్డులో నాలుగు రోజులుంచి, మూడు లక్షల రూపాయల బిల్లు చేతికివ్వడంతో ఓ న్యాయవాది తెల్లబోయాడు. మరో విషయమేమంటే పేషంట్‌ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత అతను ప్రాణాలతో వస్తాడోలేదో తెలియదు. అతనికి ఎలాంటి చికిత్స అందుతుందన్నతో బయ• ఉన్న బంధువులకు ఏమాత్రం సమాచారముండదు. ఇలా చెబుతూపోతే అనేకానేక కేసులు వెలుగుచూస్తున్నాయి. విచిత్రమేమంటే కనీసం డెడ్‌బాడీ ఇవ్వాలన్నా లక్షలు కట్టాల్సిందేనని మొండికేస్తే ఇల్లు, జాగా అమ్మి లేదా వడ్డీకి అప్పుతెచ్చి మృత శరీరాలను తీసుకెళ్ళిన ఘటనలూ లేకపోలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లను అదుపుచేయలేకపోతున్నది. ప్రథమంలో సర్కార్‌ ‌పరంగానే వైద్యం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లకు అనుమతినిచ్చింది. ఒక విధంగా ప్రభుత్వం అనుమతివ్వడానికి ముందే గుట్టుచప్పుడు కాకుండా కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లు కొరోనా చికిత్సలను ప్రారంభించాయనడానికి విఐపిలెందరో ఆ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకున్న సమాచారం లీకవడమే. ప్రభుత్వ హాస్పిటళ్ల సంగతి ఎలాగూ తెలుసు కనుక ప్రాణాంతక వ్యాధికి మెరుగైన చికిత్స కోసం ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టి ప్రైవేటు వైద్యం చేయించుకోవడానికే చాలామంది ఇష్టపడడం, ఆ హాస్పిటళ్లకు వ్యాపారంగా మారింది. లక్షలకు లక్షల బిల్లులేస్తున్న ప్రైవేటు హాస్పిటళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతుండడందో ప్రభుత్వం రంగంలోకి దిగి సుతిమెత్తగా వారించినంత మాత్రాన అక్కడ జరుగుతున్నది మాత్రం ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాల ఇష్టారాజ్యమే.
కొరోనా వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా, ఎంతవరకు చెల్లించవచ్చన్న విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌పదేపదే చెబుతూ వస్తున్నాడు కూడా. ప్రభుత్వ హాస్పిటళ్లలోనైనా, ప్రైవేటు హాస్పిటళ్లలోనైనా కొరోనాకు ఇస్తున్న మందుల్లో పదిహేను పైసల ట్యాబ్లెట్లు, పది రూపాయల ఇంజక్షన్‌ ‌మాత్రమేనన్నది వాస్తవం. అంతాకలిపి చికిత్స పూర్తి అయ్యేవరకు కేవలం పదివేలకు మించి వ్యయంకాదని చెబుతున్నా, ప్రైవేటు హాస్పిటళ్లు మాత్రం రోజుకు లక్ష రూపాయలు చెల్లిస్తేనే హాస్పిటళ్లలోకి అడుగుపెట్టండంటున్నారు. అది కూడా రెండు, మూడు లక్షలు అడ్వాన్స్‌గా చెల్లిస్తేనే చేర్చుకుంటున్నారు. ఈ మాట కూడా స్వయంగా ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రెస్‌మీట్‌లోనే చెప్పారు. చనిపోయిన మనిషిని లక్షలు చెల్లిస్తేనే అప్పగిస్తామనడం దుర్మార్గపు చర్య అని, పద్ధతులు మార్చుకోకపోతే హాస్పిటళ్ల అనుమతులను రద్దు చేస్తామని చేస్తున్న హెచ్చరికలు ఎంతవరకు అమలువు కావడం లేదన్నది బహిరంగ రహస్యమే. ప్రభుత్వమైతే ఇప్పటివరకు రెండు పెద్ద హాస్పిటళ్లపై చర్యలు తీసుకోగా, మరో రెండు మూడు హాస్పిటళ్లపై  రాష్ట్ర హైకోర్టులో కేసులు విచారణలో ఉన్నాయి. ఈ సందర్భంగానే హైకోర్టు పైవిధంగా ప్రభుత్వాన్ని మందలించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటళ్ల లైసెన్స్‌లను రద్దు చేయడంతోనే సరిపోదని, వారికి రాయితీతో ఇచ్చిన స్థలాలను కూడా వెంటనే వెనక్కు తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించడంతోనైనా ప్రభుత్వం ఆ దిశగా కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లను కట్టడిచేస్తుందని ఆశిద్దాం.

Leave a Reply