Take a fresh look at your lifestyle.

విషచక్రంలో శ్రీలంక….

“పర్యాటక రంగ ఆదాయం పై ఎక్కువగా ఆధారపడే ఈ దేశానికి ఉగ్రదాడి ఆర్ధికంగా దెబ్బతీసింది. ఏడాది తిరక్కుండానే కోవిడ్‌ ‌దాడి మొదలయ్యింది. కోవిడ్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌తో శ్రీలంక ప్రధాన పరిశ్రమలైన టీ, టెక్స్‌టైల్‌, ‌టూరిజం తీవ్రంగా ప్రభావం అయ్యాయి. అప్పటికే ఆర్ధికంగా శ్రీలంక కాళ్లు నిలదొక్కుకోకపోవటంతో ఈ ద్వీపం దేశం వేగంగా ఆర్థిక సంక్షోభ వలయంలో చిక్కుకుపోయింది.”

rehana pendriveహిందూ మహా సముద్రంలో చిరు ద్వీపం శ్రీలంక. అందుకే ఆణిముత్యంగానూ పరిగణిస్తారు. కాని ఇవాళ ఈ ద్వీపం ఆర్ధిక విష వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. తినటానికి తిండి లేక, బతుకటం ఎలాగో అర్ధం కాక ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. నిస్సాహాయత ఆందోళన రూపం దాల్చుతోంది. దేశ నాయకత్వం మీద పోతున్న నమ్మకం ఆగ్రహంగా మారుతోంది. ఫలితంగానే శ్రీలంకవాసులు రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు గొటబయ రాజపక్సా భవనాన్ని చుట్టుముట్టారు. కొన్ని చోట్ల నిరసనకారులు వాహనాలను దగ్దం చేశారు. కొంత మంది దేశం వదిలి కొత్త జీవితం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

శ్రీలంకలో ఏం జరుగుతోంది?
ప్రస్తుతం ఈ చిరు ద్వీపంలో బతుకు ఛిన్నాభిన్నమైపోయింది. నిత్యవసర ధరలు గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే రెండింతలు, మూడింతలు అయ్యాయి. రాత్రి అయితే శ్రీలంక చిమ్మ చీకట్లో కూరుకుపోతోంది. వీధి దీపాలూ కూడా వేయలేని దయనీయ స్థితికి అక్కడి ప్రభుత్వం వచ్చింది. విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటంతో రోజుకు 13 గంటలు అధికారికంగా విద్యుత్‌ ‌కోతలు కొనసాగుతున్నాయి. కొన్ని రిమోట్‌ ‌గ్రామాల్లో రోజుకు 18 గంటల వరకు విద్యుత్‌ ‌కోతలు ఉన్నాయని స్థానిక మీడియా రిపోర్ట్ ‌చేస్తోంది. డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరలు ఆకాశాన్ని అంటడమే కాదు అసలు చాలినంత సప్లయ్‌ ‌లేకపోవటంతో వాహనాలను రోడ్ల మీదకు తీసుకుని రాలేని పరిస్థితి. అలా అని పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ఉం‌దా అంటే అదీ లేదు. చాలా వరకు బస్సు సర్వీసులు కూడా ఆగిపోయాయి. దీనితో ప్రజలు రవాణా సదుపాయం లేక అల్లాడిపోతున్నారు. లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 283 రూపాయలకు చేరింది. కేజీ బియ్యం 150 దాటింది. గ్యాస్‌ ‌ధర తాళలేక హోటళ్లే మూతపడ్డాయి. ప్రభుత్వ ఖాజానా ఖాళీ అయ్యింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎప్పుడో అడుగంటాయి. నిత్యవసరాలు తగినంత ఉత్పత్తి కాకపోవటంతో దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దిగుమతి చేసుకోవటానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేని దుస్థితి.

శ్రీలంకను ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టిందెవరు?
శ్రీలంకతో 1970వ దశకంలో సిరిమావో బండారునాయకే ప్రధానిగా ఉన్నప్పుడు తీవ్ర కరువు ఏర్పడింది. ప్రస్తుతం తలెత్తిన సంక్షోభం గతంలో వచ్చిన కరువు కంటే భయంకరంగా ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణాలు అనేకం. చారిత్రకంగా చూస్తే శ్రీలంక చాలా దశాబ్దాల పాటు అంతర కలహాలతోనే సతమతం అయ్యింది. శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలం కోసం 1976లో ఏర్పడిన ఉగ్రవాద సంస్థ లిబరేషన్‌ ‌టైగర్స్ ఆఫ్‌ ‌తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ) తో ఆ దేశ బలగాలు ఏళ్లపాటు పోరాటం కొనసాగించాయి. ఊచకోతలు, హింసాత్మక ఘటనలు, అశాంతికి అప్పట్లో శ్రీలంక కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌గా ఉండేది. దీంతో ఆ దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు ఉండేవి. మొత్తానికి 2009లో ప్రభాకరన్‌ ‌ను అంతమొందించటంతో ఎల్టీటీఈ శకం ముగిసింది. ఆ తర్వాత దేశంలో శాంతి నెమ్మదిగా ఏర్పడుతూ వచ్చినా ఆర్ధికంగా ఇంకా నిలదొక్కుకోక ముందే 2019లో శ్రీలంక పై ఉగ్రవాదులు పంజా విసిరారు. పర్యాటక రంగ ఆదాయం పై ఎక్కువగా ఆధారపడే ఈ దేశానికి ఉగ్రదాడి ఆర్ధికంగా దెబ్బతీసింది. ఏడాది తిరక్కుండానే కోవిడ్‌ ‌దాడి మొదలయ్యింది. కోవిడ్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌తో శ్రీలంక ప్రధాన పరిశ్రమలైన టీ, టెక్స్‌టైల్‌, ‌టూరిజం తీవ్రంగా ప్రభావం అయ్యాయి.

అప్పటికే ఆర్ధికంగా శ్రీలంక కాళ్లు నిలదొక్కుకోకపోవటంతో ఈ ద్వీపం దేశం వేగంగా ఆర్థిక సంక్షోభ వలయంలో చిక్కుకుపోయింది. ఇది మాత్రమే కాదు ఆ దేశ పాలకుల అనాలోచిత నిర్ణయాలు సంక్షోభం ముంగిట ఉన్న శ్రీలంకను అనివార్యంగా ఆ దిశగా నెట్టేశాయి. ఆర్గానిక్‌ ‌ఫార్మింగ్‌ ‌నిర్ణయం ఎంత అనాలోచిత నిర్ణయమో తెలుసుకునేంతలో బయటకు రాలేనంతటి ఊబిలో ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ కూరుకుపోయింది. శ్రీలకంలో వ్యవసాయానికి ఉపయోగించే రసాయనాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవటంతో రసాయనాల దిగుమతి భారం నుంచి బయటపడేటందుకు ఉన్న పళంగా ఆర్గానిక్‌ ‌ఫార్మింగ్‌ ‌విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చింది.

దీనితో రసాయనాలకు అలవాటు పడిన నేల ఆర్గానికి విధానానికి అలవాటు పడాలంటే కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. ఈ కాలంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. ఈ థియరీ నిరూపణకు శ్రీలంక ఒక కేస్‌ ‌స్టడీ అయ్యింది. ఏతావాతా శ్రీలంకీయులకు తినటానికి తిండి కూడా లేకుండా పోయింది. దాదాపుగా రెండు కోట్లు పైబడి ఉన్న జనాభాకు తిండి పెట్టాలంటే తిండి గింజలు దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి. ఇక మరో కీలకమైన అంశం ఈ ద్వీప దేశం అప్పుల్లో కూరుకుని పోవటం. ఈ ఏడాది శ్రీలంక 4 బిలియన్‌ ‌డాలర్ల అప్పు తీర్చాల్సి ఉంది. మన ఇండియన్‌ ‌కరెన్సీలో చెప్పాలంటే 30వేల 403 కోట్ల రూపాయలు ఐఎమ్‌ఎఫ్‌ ‌చెల్లించాల్సి ఉంది. అప్పులు, వాటి చెల్లింపులు మొత్తంగా శ్రీలంకను ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టేశాయి.

Leave a Reply