“
బీజెపి నేతలు సోషల్ మీడియాలో షేర్ చేసిన డాక్యుమెంట్ ఫోర్జరీ అని ఫేక్ న్యూస్ ను వేటాడే వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ తేల్చి చెప్పింది. ఫోర్జరీ చేసిన దొంగ డాక్యుమెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు బీజెపి ప్రెసిడెంట్ నడ్డా, మంత్రి స్మృతి ఇరానీ, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బిఎల్ సంతోష్,అధికార ప్రతినిధి సంవిత్ పాత్రాపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.”
‘టూల్ కిట్’ గుర్తుందా. రైతుల ఉద్యమం సమయంలో మోదీ ప్రభుత్వం ఈ టూల్ కిట్ అనే దాన్ని పాపులర్ చేసింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఉద్యమాన్ని ఆసరాగా తీసుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో అల్లర్లను రెచ్చగొట్టేందుకు ఒక టూల్ కిట్ ద్వారా కుట్ర చేశారంటూ ఢిల్లీ పోలీసులు గత ఫిబ్రవరిలో కొందరిపై కేసు పెట్టారు. దిశా రవి అనే 20 ఏళ్ల పర్యావరణ కార్యకర్తను బెంగళూరు నుంచి ఎత్తుకొచ్చి ఢిల్లీలో అరెస్టు చూపించారు. ప్రపంచం మొత్తం తెలిసిన స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రేటా ధున్ బెర్గ్ పేరును కూడా ఈ కేసులోకి లాగడంతో దీనికి మరింత ప్రచారం లభించింది. చివరికి ఢిల్లీ హైకోర్టు దిశా రవికి బెయిల్ ఇస్తూ ఢిల్లీ పోలీసులకు చివాట్లు పెట్టిందనుకోండి..! తర్వాత దిశా రవి ఢిల్లీ హైకోర్టులోనే ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ పోలీసులు మీడియాకు డేటా లీక్ చేస్తున్నారనీ, మీడియా తనకు వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తున్నదనీ ఆమె ఆ పిటిషన్ లో ఆరోపించారు. చివరి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా దానికి కౌంటర్ దాఖలు చేయకపోవడంపై మొన్న మంగళవారం ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని మందలించింది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే పరిస్థితులు తమకు అనుకూలంగా లేనపుడు ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక కొత్త వివాదాన్ని సృష్టించడం రాజకీయ నాయకులకు అలవాటే..! బీజెపి అయితే ఇందులో కాకలు తీరి పోయింది. దిశా రవి ఉదంతం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇంతా చేస్తే ఆ టూల్ కిట్ లో చట్ట విరుద్ధమైనదేమీ లేదు. లేని దాన్ని ఉన్నట్లు చూపించేందుకు ప్రయత్నించి మోదీ ప్రభుత్వం అభాసు పాలయింది. కానీ ముందు చర్చ దారి మళ్లింది కదా..! వారికి కావాల్సింది అదే. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే మరోటి జరుగుతోంది.
రెండు రోజులుగా కాంగ్రెస్ టూల్ కిట్ అనే కుట్రపై నేషనల్ మీడియా రచ్చ రచ్చ చేస్తోంది. అదేమిటంటే కొరోనా పేరుతో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ ఒక సోషల్ మీడియా కాంపైన్ కు కుట్ర చేసిందట..! బీజేపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో సహా బీజెపి నాయకులు చాలామంది ఈ ఆరోపణకు సాక్ష్యంగా ఒక డాక్యుమెంట్ ను సోషల్ మీడీయాలో షేర్ చేశారు. కాంగ్రెస్ రీసెర్చ్ విభాగం లో పని చేసే సౌమ్య వర్మ అనే మహిళ ఈ డాక్యుమెంట్ తయారుచేశారని బీజెపి ఆధికార ప్రతినిధి సంవిత్ పాత్రా ట్వీట్ చేశారు. బీజెపి నేతలే కాదు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే బీజెపి శ్రేణులు, సానుభూతిపరులు కాంగ్రెస్ టూల్ కిట్ దుమ్ము దులిపారు. తీరా చూస్తే ఆ డాక్యుమెంట్ ఫోర్జరీ అని బయటపడింది. బీజెపి నేతలు సోషల్ మీడియాలో షేర్ చేసిన డాక్యుమెంట్ ఫోర్జరీ అని ఫేక్ న్యూస్ ను వేటాడే వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ తేల్చి చెప్పింది. ఫోర్జరీ చేసిన దొంగ డాక్యుమెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు బీజెపి ప్రెసిడెంట్ నడ్డా, మంత్రి స్మృతి ఇరానీ, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బిఎల్ సంతోష్,అధికార ప్రతినిధి సంవిత్ పాత్రాపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయం ఏమంటే మహమ్మారి కల్లోలం లో ఎవరెన్ని చెప్పినా వినకుండా మోదీ ప్రభుత్వం ముందుకు నడిపిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ రీసెర్చ్ విభాగం ఒక డాక్యుమెంట్ రూపొందించింది. ఎవరో గానీ దానిని సంపాదించి ఫోర్జరీ చేసి చాలా అభ్యంతరకరమైన విధంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేయాల్సిన ప్రచారానికి బ్లూప్రింట్ గా.. టూల్ కిట్ గా ఒక దొంగ డాక్యుమెంట్ తయారు చేశారు. దానిని పట్టుకుని బీజెపి నేతలు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోశారు. నేషనల్ మీడియా యధాశక్తి బీజెపికి సహకరించింది. ఎవరు ఈ దొంగ డాక్యుమెంట్ తయారు చేసి ఉంటారు. ఢిల్లీ పోలీసులు దీని సంగతి తేల్చాలి. అయితే తేలుస్తారని మనం ఆశించనక్కర లేదు. వారి ట్రాక్ రికార్డు తెలిసిందే కదా..! ఎవరు దొంగలో మనం ఊహించుకోవచ్చు.
కొరోనా సెకండ్ వేవ్ కట్టడిలో ప్రధాని మోదీ వైఫల్యంపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వైఫల్యానికి అంతర్జాతీయ మీడియా నిర్మొహమాటంగా మోదీని నిందిస్తున్నది. మోదీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వస్తున్న జాతీయ మీడియా కూడా ఈ విషయంలో సర్కారుకు అండగా నిలవడం సాధ్యం కావడం లేదు. ఇలాంటప్పుడు అసలు విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ టూల్ కిట్ వివాదం చక్కగా ఉపయోగపడుతుంది.. అవునా..! మీకు ఇంకో విషయం చెప్పాలి… ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్నది. గ్రామసీమల్లో మహమ్మారి రాజ్యమేలుతున్నది. గంగానదిలో శవాలు తేలుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం వైఫల్యంపై ఏకంగా బీజేపి శాసనసభ్యులు, కేంద్ర మంత్రులే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోషం వచ్చి మరింత గట్టిగా వైరస్ కట్టడికి నడుం బిగించాల్సిన యోగీ ప్రభుత్వం నిన్న బారాబంకీలో వందేళ్ల నాటి ఒక మసీదును కూల్చింది. అది కూడా హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి… ఎందుకంటారు. ఊహించండి..?
గెస్ట్ ఎడిట్ ఆలపాటి సురేష్ కుమార్