Take a fresh look at your lifestyle.

రైతులను శాసించడానికి కలెక్టర్‌ ఎవరు?

  • కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి సంగతి తేల్చేస్తాం..
  • రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి
  • చెప్పకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్‌
  • వరి పంట సాగుపై సిద్ధిపేట కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి … మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో వివరణ

సిద్ధిపేట కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి జాగీర్దార్‌ అనుకుంటున్నారా? ఆయన సంగతిని తేల్చేస్తామనీ టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. సిద్ధిపేట జిల్లా అగ్రికల్చర్‌ ‌మీటింగ్‌లో సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి సీరియస్‌ అయ్యాడు. రైతులు వరి పంటలు వేయొద్దనీ, కిలో వరి విత్తనాలు అమ్మినా దుకాణాలను సీజ్‌ ‌చేస్తానంటూ కలెక్టర్‌ ‌వెంకట్రమారెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ‌పార్టీ తప్పుబడుతుందన్నారు. రైతులు ఏ పంట వేసుకోవాలో శాసించే హక్కు కలెక్టర్‌కు ఎవరిచ్చారనీ ప్రశ్నించాడు. కలెక్టర్‌ను అడిగి రైతులు పంటలు వేసుకోవాలా? ఏ పంట వేసుకోవాలనే స్వేచ్చ కూడా రైతులకు లేదా? రైతులను శాసించాలనుకుంటే మాత్రం కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున చూస్తూ ఊరుకోమనీ, కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి సంగతి తేల్చేస్తామన్నారు.

రైతులకు సొంత నిర్ణయంతో పంట వేసుకునే స్వేచ్ఛ లేదా?.. సిద్దిపేట కలెక్టర్‌ను అడిగి పంట వేసుకోవాలా? రైతులు ఏ పంట వేసుకోవాలో చెప్పడానికి కలెక్టర్‌ ఎవరన్నారు. ఆయన రైతులను శాసించేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంకట్రామిరెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పకపోతే.. జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సిద్ధిపేట జిల్లాలో ప్రజలకు, రైతులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఓ వైపు పోలీసు కేసులు, మరోవైపు కలెక్టర్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. సిద్ధిపేట జిల్లాలో పరిస్థితులు ఏమాత్రం బాగు లేవన్నారు. ప్రజల కోసం కాంగ్రెస్‌ ‌పార్టీ  ఏందాకైనా వెళ్తుందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై వొత్తిడి తీసుకువస్తామన్నారు. వెంకట్రామరెడ్డి కలెక్టర్‌ అనుకుంటున్నాడా? జాగీర్దార్‌ అనుకుంటున్నాడా? అని నిలదీశారు. కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి మైండ్‌లో రియల్‌ఎస్టేట్‌ ఉం‌టుందన్నారు. దీంతోనే ఎలాంటి ఆలోచన లేకుండా రైతులు వరి సాగు చేయొద్దనీ మాట్లాడారన్నారు.

రైతులు వరి పంట సాగు చేయొద్దని చెప్పడానికి కలెక్టర్‌కు అధికారం ఎవరిచ్చారన్నారు. తెల్లాపూర్‌, ‌కోకాపేట, కొల్లూరులో భూములు కబ్జా చేసినట్టు అనుకుంటున్నాడా? అని మండిపడ్డారు. రైతులు ఏ పంటైనా వేసుకోవచ్చనీ వెంకట్రామరెడ్డి బహిరంగంగా ప్రకటన చేయడంతో పాటు భేషరతుగా రైతులకు క్షమాపణ కూడా చెప్పాలన్నారు. రైతులకు క్లారిటీ ఇవ్వకుండా, క్షమాపణ చెప్పకుండా మీడియాను బద్నాం చేసే పనిని కలెక్టర్‌ ‌మానుకుంటే మంచిదన్నారు. సిద్ధిపేటలో కాంగ్రెస్‌ ‌పార్టీ గెలవకపోయినా ప్రజలు, రైతుల తరపున ఉంటామనీ, కలెక్టర్‌ ‌సంగతి కూడా తేల్చేస్తామనీ జగ్గారెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ‌నేతలు మహేష్‌కుమార్‌గౌడ్‌, ‌బోరెడ్డి అయోధ్యరెడ్డి పాల్గొన్నారు.అసత్యాలు ప్రచారం చేయొద్దు…రైతుల శ్రేయస్సు కోసమే అలా..: సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి.

వరి పంట సాగుపై సిద్ధిపేట కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి … మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో వివరణ ఇచ్చాడు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై సిద్ధిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశంలో రైతుల శ్రేయస్సు కోసమే యాసంగి సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని కోరడం జరిగిందనీ కలెక్టర్‌ ‌తెలిపారు. రైతులు నష్టపోయే విధంగా నకిలీ విత్తనాలు రైతులకు విక్రయిస్తే నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందనీ, అందుకు డీలర్లు కూడా సహకరిస్తామని చెప్పారన్నారు. వానాకాలంలో వరి పంటను పూర్తి స్థాయిలో సాగు చేసుకున్న, యాసంగిలో అందరూ వరి సాగు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు లాభం జరుగుతుందని చెప్పడం జరిగిందనీ,  పంటల మార్పిడి వల్ల దిగుబడి ఎక్కువగా ఉండడంతో పాటు బహిరంగ మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందన్న ఉద్దేశ్యంతో వ్యవసాయ అధికారులు ప్రతి రైతును కలిసి రైతులను చైతన్యం చేయాలనీ దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు.

దేశంలోనే ఆదర్శంగా నిలిచే అవకాశం రైతులకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందనీ, వ్యవసాయంను పండుగగా మార్చి రైతును రాజుగా చూడాలన్న సదాశయంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా వేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందన్నారు. ఫలితంగా సాగుకు సమృద్దిగా జలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ‌రైతాంగానికి ఇస్తుందన్నారు. వీటితో పాటు రైతు బంధు, బీమా వంటి, నాణ్యమైన విత్తనాలు, అందుబాటులో ఎరువులు, క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం, రైతు వేదికలు వంటి అనేక ప్రగతిశీల రైతు సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ రైతులు యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశంను కల్పించిందన్నారు. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకుని, ప్రగతి శీల మార్గంలో రైతులు పంట మార్పిడులు చేసుకుంటూ అధిక దిగుబడులు, లాభాలు ఆర్జించాలని కోరడం జరిగిందన్నారు.

జిల్లా యంత్రాంగం, డీలర్ల సమిష్టి కృషి, పరస్పర అవగాహన, సహకారంతో సిద్దిపేట జిల్లా రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని సూచించడం జరిగింది. పైన చెప్పిన అంశాలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అసత్యాలను, అర్థ సత్యాలను కొద్ది మంది ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేయడం సరికాదనీ కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి తెలిపారు.

Leave a Reply