Take a fresh look at your lifestyle.

దుబ్బాక బరిలో నిలిచేది ఎవరో ?

సోలిపేట మృతితో మొదలైన చర్చ
టికెట్‌ ‌సతీమణికా ? కుమారునికా ?

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఏర్పడ్డ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారోనని రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది.  సోలిపేట అనారోగ్య కారణాలతో ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఏర్పడ్డ ఖాళీని ఎన్నికల కమిషన్‌ 6 ‌నెలల్లోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ స్థానానికి అసలు ఉప ఎన్నిక జరగకుండా సోలిపేట కుటుంబానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా ? ఒకవేళ తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాల్సి వస్తే సీఎం కేసీఆర్‌ ‌టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తారు ? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దివంగత సోలిపేట రామలింగారెడ్డి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితునిగా ముద్ర పడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ఆయన కేసీఆర్‌ ‌వెన్నంటే ఉన్నారు. అందుకే దుబ్బాకలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సోలిపేట మినహా మిగతా ఎవరి పేరునూ కేసీఆర్‌ ‌పరిశీలించలేదు. కాగా, సోలిపేట ఎమ్మెల్యేగా ఉండగానే మృతి చెందిన కారణంగా ఆయన కుటుంబం నుంచి ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరిస్తాయా లేక మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీలు కూడా తమ అభ్యర్థిని నిలబెడతాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఒకవేళ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినా, అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి వచ్చినా సోలిపేట స్థానంలో ఆయన సతీమణి సుజాత వైపు సీఎం కేసీఆర్‌ ‌మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే పదవిలో ఉండగా చనిపోతే ఆయన సతీమణిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం రాజకీయాలలో అనాదిగా వస్తున్నది. అయితే, ఇటీవల అందుకు విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను సైతం నిలిపిన సందర్భాలు లేకపోలేదు. ఓటమి తప్పదని తెలిసినప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి లేదా తమ పార్టీని ఎన్నికల రూపంలో ఆ నియోజకవర్గంలో బలోపేతం చేసుకోవడానికి పార్టీలు దీనిని అవకాశంగా మలచుకుంటాయి. అయితే, సోలిపేట మృతి చెంది ఇంకా మూడు రోజులే కావడంతో ప్రతిపక్ష పార్టీలలో దీనిపై ఇంకా చర్చ ప్రారంభం కాలేదు. మరోవైపు, సోలిపేట సతీమణి ఒకవేళ దుబ్బాక నుంచి పోటీకి అయిష్టత ప్రదర్శించిన నేపథ్యంలో ఆయన కుమారుడిని ఎన్నికల బరిలో దింపే అవకాశం లేకపోలేదని టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చర్చ జరుగుతున్నది. సోలిపేట మృతితో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని ఆయన కుటుంబ సభ్యుల నుంచే ఎవరో ఒకరితో సీఎం కేసీఆర్‌ ‌భర్తీ చేయవచ్చని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఒకవేళ అలా కాని పక్షంలో కాంగ్రెస్‌ ‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరినప్పటి నుంచీ ఆమె ఏదో ఒక ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో సైతం సునీతకు సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారు. మరోవైపు, దివంగత ముత్యం రెడ్డి కుమారుడు సైతం అవకాశం వస్తే దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ముత్యంరెడ్డి సైతం చివరి దశలో టీఆర్‌ఎస్‌ ‌చేరి పార్టీకి సేవలు అందించారు. ఈ దృష్ట్యా తన తండ్రి పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా తనకు దుబ్బాక నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తనయుడు శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరాలని భావిస్తున్నట్లు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!