Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ఓటమి బాధ్యత ఎవరిది ?

“వాస్తవంగా హుజురాబాద్‌ ఎన్నికల పక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఆ పార్టీ వర్గాలు పెద్దగా ఆసక్తిని కనబర్చినట్లు కనిపించదు. అది ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కనీసం గత ఎన్నికల్లో వచ్చిన వోట్లను కూడా సాధించుకోలేదు సరికదా డిపాజిట్‌ ‌గల్లంతు కావడం చూస్తుంటే పార్టీకి కొత్త నాయకత్వం వొచ్చినప్పటికీ పాత బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తున్నది. మూడేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇక్కడ 61 వేల 121 వోట్లను సాధించుకుంది. ఈ ఎన్నికల్లో 3,014 వోట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. ఇంత తక్కువ సమయంలో ఆ పార్టీ ప్రాపకం ఈ నియోజకవర్గంలో తగ్గడానికి గత అభ్యర్థి పార్టీ మారడం ఒకటైతే, ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ పక్షాన అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించడం మరో పెద్ద తప్పిదంగా మారింది.”

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓటమికి సంపూర్ణ బాధ్యత తనదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఈ ఓటమికి ఆయన ఒక్కడే బాధ్యుడా, మరెవరి ప్రమేయం లేదా అన్నది ఇప్పుడు ఆ వర్గాల్లో చర్చనీయాంశమయింది. వాస్తవంగా హుజురాబాద్‌ ఎన్నికల పక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఆ పార్టీ వర్గాలు పెద్దగా ఆసక్తిని కనబర్చినట్లు కనిపించదు. అది ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కనీసం గత ఎన్నికల్లో వచ్చిన వోట్లను కూడా సాధించుకోలేదు సరికదా డిపాజిట్‌ ‌గల్లంతు కావడం చూస్తుంటే పార్టీకి కొత్త నాయకత్వం వొచ్చినప్పటికీ పాత బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తున్నది. మూడేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇక్కడ 61 వేల 121 వోట్లను సాధించుకుంది. ఈ ఎన్నికల్లో 3,014 వోట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. ఇంత తక్కువ సమయంలో ఆ పార్టీ ప్రాపకం ఈ నియోజకవర్గంలో తగ్గడానికి గత అభ్యర్థి పార్టీ మారడం ఒకటైతే, ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ పక్షాన అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించడం మరో పెద్ద తప్పిదంగా మారింది. రేవంత్‌రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు యువనేతలకు ఇక మంచి రోజులు వొస్తాయనుకున్నారు. కాని, యువ నాయకులు పార్టీని వీడిపోతున్నా పట్టించుకోలేదన్న అపవాదు పార్టీ అధ్యక్షుడిపై పడింది. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ ‌బలమైన యువ నాయకుడిగా ఉన్న కౌశిక్‌రెడ్డి, ఈ ఎన్నికల్లో కూడా పోటీ పడుతాడనుకున్నారు. కాని, అనూహ్యంగా ఆయన అధికార పార్టీ కారెక్కడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవరించింది. అందుకు కారణాలేమైనప్పటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ వోటు బ్యాంకు మాత్రం గల్లంతయినదనడానికి తాజా ఫలితాలే నిదర్శనం.

ఇదిలా ఉంటే పార్టీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకాన్ని మొదటి నుండి సీనియర్‌లు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను కాదని, వేరే పార్టీ నుండి వొచ్చిన రేవంత్‌రెడ్డికి పగ్గాలు అప్ప గించడాన్ని సీనియర్లు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయంలో పార్టీ సీనియర్లు అనేక సందర్భాల్లో బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూనేన్నారు. రేవంత్‌రెడ్డి పార్టీ సారథ్యం చేపట్టిన తర్వాత ఎదురైన మొదటి ఎన్నికలివి. మొదటి ఎన్నికల్లోనే ఆయన విఫలుడైనాడన్న అపవాదును మూట గట్టుకోవాల్సి వొచ్చింది. అందుకు తానే బాధ్యుడినని రేవంత్‌ ‌ప్రకటించుకున్నా, సీనియర్లు కూడా ఆయన్నే వేలెత్తి చూపిస్తున్నారు. ఈటల రాజీనామా చేసిన ఈ అయిదు నెలల కాలంలో హుజురాబాద్‌లో ఒక్క బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయకపోవడం, పార్టీ శ్రేణులను ప్రచారంలో ముమ్మర భాగస్వాములను చేయకపోవడం కారణంగా ఓటమిని చవిచూడాల్సి వొచ్చిందని ఆ పార్టీ పార్లమెంట్‌ ‌సభ్యుడు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి సీనియర్‌ ‌నాయకులు విమర్శిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న నష్టాన్ని పూడ్చే విషయంలో రేవంత్‌ ‌చర్యలు చేపట్టలేదని మరో మాజీ పార్లమెంట్‌ ‌సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ ‌లాంటి వారు కూడా రేవంత్‌నే టార్గెట్‌ ‌చేస్తున్న విధానం ఇంకా సీనియర్ల కోపం చల్లారలేదన్నది స్పష్టమవుతున్నది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించుకోవాల్సింది పోయి భాజపాతో చేతులు కలిపాడన్న అపవాదును కూడా ఆయనకు అంటగట్టారు.

ఏది ఏమైనా హుజురాబాద్‌ ‌ఫలితం కాంగ్రెస్‌లో ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపుతున్నది. తాజాగా బుధవారం ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో కూడా సీనియర్లు అదే వరుస కనబర్చారు. వాడివేడిగా జరిగిన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్ ‌కమిటి సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కాలేదు. కాగా హాజరైన మరో సీనియర్‌ ‌నేత జానారెడ్డి సమావేవం మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఈ ఎన్నికల్లో కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోకపోవడమేంటని పలువురు తీవ్ర విమర్శలను గుప్పించారు. హోరాహోరిగా జరిగిన అక్కడి ప్రచారంలో కాంగ్రెస్‌ ఎక్కడా కనిపించకపోవడాన్ని పలువురు ఎత్తిచూపారు. నామినేషన్ల గడువు ముగుస్తున్న దశలో పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడంతో కనీసం గ్రామాల్లో తిరిగే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్‌కు ఉన్న వోటు బ్యాంకును కూడా కాపాడుకోలేక పోయామన్న అసంతృప్తిని పలువురు వ్యక్తంచేసినట్లు తెలిసింది. సంగారెడ్డి ఎంఎల్‌ఏ ‌జగ్గారెడ్డి అయితే ఈ ఎన్నికల్లో బల్మూరిని బలి పశువు చేశారని వ్యాఖ్యానించడం చూస్తుంటే పార్టీ సారథ్యం రేవంత్‌కు ముందు ముందు మరింత కష్టతరంగా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
– మండువ రవీందర్‌రావు

Leave a Reply