Take a fresh look at your lifestyle.

నాగార్జున సాగర్‌ ‌బాద్షా ఎవరు

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న  కాంగ్రెస్‌ ‌గెలిస్తే అది కేవలం పార్టీ క్యాడర్‌ ‌మరియు జానారెడ్డి పై వ్యక్తిగత  అభిమానమే కారణమవుతుంది.. తెరాస కు విజయం వరిస్తే అది ఆ పార్టీ  పొలిటికల్‌ ‌మేనేజిమెంట్‌ ‌మరియు కేసీఆర్‌ ‌పై ప్రజల విశ్వాసమే కారణమవుతుంది… బిజెపి చేజిక్కిచ్చుకుంటే ప్రజలు కొత్త నాయకత్వాన్ని సాగర్‌ ‌కి ఆహ్వానించడమే అవుతుంది.

నాగార్జునుడు నడయాడిన నేల,  ప్రముఖ బౌద్ద పర్యాటక స్థలంగా తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వరప్రదాయిని, సాగునీటి ప్రాజెక్ట్ ‌గా అందరి మనసుల్లో మెదులుతూ, నిత్యం నిశ్శబ్దంగా ఉండే నాగార్జునసాగర్‌ ‌నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో  రాజకీయాలతో  వేడెక్కిపోతుంది. రాజకీయంగా కాంగ్రెస్‌ ‌కు కంచు  కోటగా ఉన్న ఈ  నియోజక వర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస నుంచి పోటీచేసిన  నోముల నర్సింహయ్య  కాంగ్రెస్‌ అభ్యర్థి , రాజకీయ కురువృద్ధుడు, నాగార్జున సాగర్‌ ‌లో ఎన్నోసార్లు విజయడంకా మోగించిన జానారెడ్డి పై సుమారు 7771 ఓట్లతో  విజయం సాధించాడు. గత సంవత్సరంలో నోముల హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతూ నువ్వా-నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌నుంచి కే జానా రెడ్డి పోటీలో ఉండగా, చివరివరకు రహస్యంగా ఉంచి రెండు రోజుల క్రితం కేసీఆర్‌ ‌నోముల కుమారుడైన నోముల భగత్‌ ‌కు బి ఫారం ఇచ్చి ఎన్నికకు సై అన్నాడు. మరోవైపు బి.జే.పి  అధిష్టానం సామాజిక సమీకరణాల ఆధారంగా డాక్టర్‌  ‌పనుగోతు రవికుమార్‌ను బరిలోకి దింపి ఉత్కంఠకు తెరదించింది.

ఈ ఎన్నికలలో గెలుపు తమదంటే తమది అంటున్నారు ప్రధాన పార్టీల నేతలు. అయితే వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకుంటే 1978 నుంచి 2018 దాకా నాలుగు దశాబ్దాలపాటు నాగార్జునసాగర్‌ ‌నియోజకవర్గ రాజకీయ యవనికపై ఏకఛత్రాధిపత్యం వహించిన చరిత్ర కుందూరు జానారెడ్డిది.  1994 మినహా ఏడు సార్లు నాగార్జున సాగర్‌ ‌నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న జానారెడ్డిని ఓడించడం పెద్దగా రాజకీయ అనుభవం లేని  తెరాస, బిజెపి అభ్యర్థులు ఎంతవరకు నిలువరిస్తారనేది ప్రశ్న.

కాని, పార్టీ ల పరంగా విశ్లేషిస్తే వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఇక్కడ విజయం సాధించి 2023 సమరానికి మానసికంగా సిద్ధం కావాలని కాంగ్రెస్‌ ‌భావిస్తుండగా, దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్య విజయంతో తెరమీదకు వచ్చిన బిజెపి అదే ఊపును గ్రేటర్‌ ఎన్నికలలో కొనసాగించగా హైదరాబాద్‌ ‌మరియు వరంగల్‌ ఎం.ఎల్‌.‌సి ఎన్నికలలో పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఇప్పుడు సాగర్‌ ఎన్నికలలో మళ్ళి పంజా విసిరి తెరాస కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించాలని పావులు కదుపుతుంది. ఇక అధికార తెరాస దుబ్బాక ఓటమి తరువాత, గ్రేటర్‌ ‌లో కాస్త పుంజుకొని ఎం.ఎల్‌.‌సి  స్థానాలను కైవసం చేసుకొని, పదవి విరమణ వయస్సు పెంపు, పి.ఆర్‌.‌సి పెంపు వంటి అంశాలతో పాటు సానుభూతి ఓట్లతో నోముల భగత్‌ ‌ను గెలిపించుకొని పూర్తిస్థాయిలో వచ్చే అసెంబ్లీకి వెళ్లాలని అమ్ములపొదిలోని అస్త్రాలన్నింటిని ఉపయోగిస్తుందని చెప్పవచ్చు. దీనికి తోడు బిసి వర్గాల ఓట్లను తమవైపు తిప్పుకోడానికి చివరివరకు రహస్యంగా ఉంచి మరోసారి నోముల కుటుంబానికి టికెట్‌ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిపిఐ సిపిఎం ఈ ఎన్నికలో పోటీ చేయకపోవడం నోముల ప్రస్థానం సిపిఎం నుంచే ఆరంభం కావడంతో ఆ రెండు పార్టీల ఓట్లు నోముల తనయునికే పడుతాయని కేసీఆర్‌ ఆలోచన గా చెప్పవచ్చు. అయితే గతంలో ఈ సమీకరణాలతో సంబంధం లేకుండా జానా గెలిచిన విషయం మర్చిపోరాదు. ఇక బిజెపి కి పెద్దగా క్యాడర్‌ ‌లేకపోవడంతో కేవలం కేంద్రంలో ఉన్న బిజెపి అంశాన్ని మరియు నూతన మార్పు వైపు ఓటర్లను ప్రభావితం చేయడం ద్వారానే తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

ఈ ఎన్నికను ఇంకో కోణంలో చూసినట్లయితే ఇది మూడు సామాజిక వర్గాల పోరు అని చెప్పవచ్చు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ రెడ్డి సామాజిక వర్గ లాబీయింగ్‌కు పెద్దపీట వేయగా, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ మాత్రం నియోజక వర్గంలో అత్యధికంగా ఓటర్లు ఉన్న బీసీ సామాజికవర్గానికి, అందులోనూ యాదవ సామాజికవర్గానికి టికెట్‌ ఇచ్చి బడుగుల పక్షపాతినంటూ చెప్పకనే చెప్పింది. ఇదే సమయంలో బీజేపీ అనుహ్యంగా ఎస్‌ ‌టీ అభ్యర్థికి టికెట్‌ ‌కేటాయించి గిరిజనులను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ మేరకు బీజేపీ గిరిజనుల్లోకి ఎంత బలంగా వెళుతుందనేది ప్రశ్నార్థకమే. ఇదిలావుంటే, నాగార్జునసాగర్‌ ‌నియోజక వర్గంలో మొత్తం 2,19,745 ఓట్లు ఉండగా, అందులో అత్యధికంగా బీసీ ఓటర్లు 1,05,495 మంది, ఎస్టీలు 40,398 మంది, ఎస్సీలు 37,671 మంది, ఓసీలు 31,485 మంది ఉన్నారు.

కానీ చరిత్రను పరిశీలిస్తే , నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకూ కేవలం రెండుసార్లు మాత్రమే ఓటర్లు బీసీలకు పట్టం కట్టారు. మిగతా అన్నీసార్లు రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపించారు. అయితే 1996 ఎన్నికల్లో రామ్మూర్తియాదవ్‌, 2018 ఎన్నికల్లో నోముల నర్సింహాయాదవ్‌ ‌మాత్రమే ఓసీయేతర ఎమ్మెల్యేలుగా గెలిచారు. నాగార్జున సాగర్‌లో కమ్యూనిస్టుల మద్దతు కోసం కాంగ్రెస్‌ ‌ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. నాగార్జున సాగర్‌ ‌నియోజకవర్గం లో ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టదల్చుకోని కాంగ్రెస్‌  ‌కమ్యూనిస్టుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అభ్యర్థిగా ఎప్పుడో ఖరారైన జానారెడ్డి గ్రామాలన్నీ చుట్టేస్తున్నారు. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న నియోజకవర్గం కావడంతో ఆయనకు గ్రామ గ్రామాన పరిచయాలు ఉన్నాయి. అయితే ఏ చిన్న అవకాశం కూడా వదిలి పెట్టకూడదనుకుంటున్న కాంగ్రెస్‌ ‌రాష్ట్ర నాయకత్వం కమ్యూనిస్టుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు బలం ఉంది. విధేయంగా ఉండే క్యాడర్‌ ఉన్నారు. నాగార్జునసాగర్‌లోనూ వారికి బలం ఉంది. ఉపఎన్నికల్లో సీపీఎంతో పాటు సీపీఐ కూడా పోటీ చేయడం లేదు. దీంతో ఆ పార్టీ క్యాడర్‌ ‌మద్దతు తమకు లభించేలా చేసుకోవడానికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, వర్కింగ్‌ ‌చీఫ్‌ ‌భట్టి విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో ఏపార్టీకి ఇతర పార్టీల మద్దతు లభించడం లేదు. జనసేన కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. టీడీపీ కూడా సొంతంగా పోటీ చేస్తోంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తే, ఆ పార్టీకే కాస్త అదనపు బలం లభించినట్లవుతుంది. అందుకే కమ్యూనిస్టు పార్టీల నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది. ఇలా నాగార్జున సాగర్‌ ‌సెమి ఫైనల్‌ ‌మ్యాచ్‌ ‌లా అయ్యిందని చెప్పవచ్చు. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న  కాంగ్రెస్‌ ‌గెలిస్తే అది కేవలం పార్టీ క్యాడర్‌ ‌మరియు జానారెడ్డి పై వ్యక్తిగత  అభిమానమే కారణమవుతుంది.. తెరాస కు విజయం వరిస్తే అది ఆ పార్టీ  పొలిటికల్‌ ‌మేనేజిమెంట్‌ ‌మరియు కేసీఆర్‌ ‌పై ప్రజల విశ్వాసమే కారణమవుతుంది… బిజెపి చేజిక్కిచ్చుకుంటే ప్రజలు కొత్త నాయకత్వాన్ని సాగర్‌ ‌కి ఆహ్వానించడమే అవుతుంది.

md khaza
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply