Take a fresh look at your lifestyle.

ఎనిమిదేళ్ల తెలంగాణ ఎవరికి సంతోషాలు మిగిల్చింది ?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచింది. ఊరికే రాలేదు ఈ రాష్ట్రం.  అనేక వర్గాల వారు రైతులు మొదలు రాజకీయ నేతల వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసి  సాధించుకున్న తెలంగాణ ఇది. కేంద్రం లోని యుపిఏ ప్రభుత్వం  ఉద్యమాలను అణిచి వేయాలని కమిటీలు వేసి  కాలయాపన చేసినా సాధ్యం కాక పోవడంతో దిగి వచ్చి ఆఖరికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పలేదు. అనేక నాటకీయ పరిణామాల మద్య ఉభయ పార్లమెంట్‌ ‌సభల్లో ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర పునర్‌ ‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జూన్‌ 2 ‌వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

ఏ ఉద్యమానికైనా నాయకుడే అసలు కథా నాయకుడు. తెలంగాణ ఉద్యమానికి కథానాయకుడు కెసిఆరే. ఉద్యమ సమయంలో ఆయనను అభిమానించిన వారు  చాలా మంది ఈ రోజు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా తెలంగాణ ప్రజానీకం అంతా ఏక తాటిపై నిలవడంతో కెసిఆర్‌ ఉద్యమానికి నాయకత్వం వహించే అరుదైన అవకాశం దక్కి ముఖ్యమంత్రి కాగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం విషయంలో తెలంగాణ ప్రజలు మరిచి పోలేని మహామహులు అనేకులు ఉన్నారు. ఇందులో ఆనాటి యుపిఏ  చైర్‌ ‌పర్సన్‌ ‌సోనియా గాంధి, బిజెపి నేత సుష్మా స్వరాజ్‌, ‌లోక్‌ ‌సభ స్పీకర్‌ ‌మీరా కుమారి, ఆనాటి ప్రధాన మంత్రి మన్‌ ‌మోహన్‌ ‌సింగ్‌, ‌హోం మంత్రి షిండే, కేంద్ర మంత్రి  ఎస్‌ ‌జైపాల్‌ ‌రెడ్డి  తదితరులను తెలంగాణ ప్రజలు మరిచి పోలేరు. ఉభయ సభల్లో ఆనాటి కాంగ్రేస్‌ ‌పార్టి ఎంపీలు నిర్విరామంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబింప చేస్తు నిరసన సెగలు రాజేయడంతో కేంద్రం దిగి రాక తప్ప  లేదు. జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ, ఇందిరా గాంధీల హయాంలో నెర వేరని తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధి హయాంలో నెరవేరిందని తెలంగాణ ప్రజలు సంతోషించారు.

ఏ ప్రయోజనాలు ఆశించకుండా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకో లేవు. సోనియా గాంధి సారధ్యంలోని కాంగ్రేస్‌ ‌పార్టీతో విపక్షాలన్ని  విభేదించినా ఉభయ సభల్లో వీరంగం జరిగినా సోనియా గాంధి ఆఖరు క్షణం వరకు  వెనుకడుగు వేయకుండా  ఇచ్చిన మాటపై నిలబడ్డారు. లోక్‌ ‌సభలో ఫిబ్రవరి 18 న రాజ్యసభలో ఫిబ్రవరి 21 న తెలంగాణ బిల్లు (ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర పునర్‌ ‌వ్యవస్థీకరణ బిల్లు) ఆమోదం పొందింది. చేసిన త్యాగాలు, జరిగిన బలిదాణాలు ఏవి  వృధా కాలేదని తెలంగాణ ప్రజలు శాంతించారు.

2014  ఏప్రిల్‌  ‌లో ఎన్నికల అనంతరం జూన్‌ 2 ‌న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కాంగ్రేస్‌ ‌పార్టీకి ఎన్నికల్లో మెజార్టి స్థానాలు దక్కక పోవడంతో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ 63 స్థానాలతో  గెలిచి కెసిఆర్‌ ‌తొలి సిఎం అయ్యాడు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు కాగ్రేస్‌ ‌పార్టీ పట్ల  ఆదరణ చూప లేక పోయారు. 2018 ఎన్నికల్లో కూడ టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి రెండో సారి ప్రజలు ఆమోద ముద్ర వేశారు. ఉద్యమంలో కెసిఆర్‌ ‌వెంట ఎట్లా నిలిచారో అదే రీతిలో తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ ‌వెంట ఎన్నికల్లో నిలిచారు.  కెసిఆర్‌ ఏదో చేస్తారని పిచ్చి అభిమానం పెంచుకుని వారందరి కలలు పటాపంచలు అయ్యాయి. తెలంగాణ పాలనలో రోజులు, నెలలు,సంవత్సరాలు  గడిచిన కొద్ది అన్ని వర్గాలలో అసంతృప్తులు మిన్నంటి పోయాయి. తెలంగాణ ఎనిమిదేళ్ల  కాలంలో ఏ ఒక్కరూ సంతోషంగా కనిపించడం లేదు. సిఎం కెసిఆర్‌ ‌పాండిత్యం ఆయన పరిపాలనాదక్షత ఏవి తెలంగా ప్రజలను సంతృప్తి పరిచిన దాఖలాలు లేవు. కాని కెసిఆర్‌ ఆయన పరివారం మాత్రం తన పాలనలో రాష్ట్రంలో  సర్వతోముఖంగా అభివృద్ధి జరిగిందని ఇక బంగారు తెలంగాణ వైపు అడుగులు పడుతున్నాయని గొప్పగా చెప్పుకునేందుకు ఓ ప్రచారాస్త్రంగా మారింది.

చాలా ఘనంగా చెప్పుకుంటున్న కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టుపైనే కోకొల్లల  విమర్శలు వచ్చాయి. రుణ మాఫి, రైతు భందు పథకాలు,ఆసరా పెన్షన్లు, షాది ముబారక్‌ ‌వంటి పథకాలు ప్రవేశ పెట్టినా ప్రధాన మైన నిరుద్యోగ సమస్యను బాగా నిర్లక్ష్యం చేసారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించినా నిరుద్యోగులు సంవత్సరాలు ఎదురు చూసినా ఫలితం లేక కొందరు బలవణ్మరణాలకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో అనేకం నెర వేర్చ లేక పోయారు.  ఆలాంటి నెరవేర్చని హామీలలో నిరుద్యోగ భృతి ప్రధాన మైనది.  ఊరూరా కట్టించి ఇస్తామన్న  డబుల్‌ ‌భెడ్‌ ‌రూములు మచ్చుకు కొన్నిగా మాత్రమే మిగిలి పోయాయి. జర్నలిస్టులకు పెన్షన్‌, ఇం‌డ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీని పట్టించుకున్న వారు లేరు.ప్రభువుల ఉపన్యాసాలు వినడం తప్ప తమ గోడును ఎవరికి విన్నవించాలనే దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.  సిఎం కెసిఆర్‌ ‌కు ప్రజల విజ్ఞప్తులు ఆలకించేందుకు క్షణం తీరిక లేదు.  ప్రగతి భవన్‌ ‌గేట్లు ప్రజల కోసం తెరుచు కున్న రోజులు లేవు.

నేనే రాజు నేనే మంత్రి అనేది కెసిఆర్‌ ‌సిద్దాంతం. ఎవరి మాట వినే పరిస్థితి లేదు. మిగులు రాష్ట్రంగా వేరు పడిన తెలంగాణ రాష్ట్రం  రోజు అప్పుల రాష్ట్రంగా మిగిలిందని రోజు మీడియాలో కథనాలు చూస్తున్నాం. ఒకటో తారీఖున  ఉద్యోగులకు  సర్కార్‌ ‌జీతాలు ఇచ్చే పరిస్థితి లేక అప్పులు పుట్టని దుస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం సహజ వనరులతో కూడ భౌగోళికంగా దేశంలో, ప్రపంచంలో ప్రాధాన్యత గలిగిన విశ్వ నగరం అవడం వల్ల సర్కార్‌ ‌తలా తోక లేక ఎంతగా దుబారా చేసినా తెలంగాణ ఇంకా తట్టుకుంటోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీలు, ఆదివాసులు, అన్ని కులాల వారు, కుల వృత్తుల వారు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేళ్లలో ఏం సాధించిందో తమకు దక్కిన ఫలాలు ఏంటో తమకు తీరిన ఇబ్బందులు ఏమిటో అర్దం కాని విషయాలుగా మిగిలి పోయాయి. తెలంగాణ ఉద్యమ కారులను అసలు పట్టించుకున్న వారు లేరు. సంవత్సరాల తరబడి ఉద్యమంలో తమ కుటుంబాలను వదిలి పనిచేసిన వారు వేలాది మంది ఈ రోజు అలమ టిస్తున్నారు. కనీసం వారిని పలకరించే దిక్కు లేదు.  పదవులన్ని పరాయి పార్టీలలో ఉండి ఆనాడు ఉద్యమానికి వ్యతిరేకంగా నిలిచి దాడులు దౌర్జన్యాలు చేసిన  వారికి దక్కగా ఏ పదవులు దక్కక అవకాశాలు లేక ఆగమైన పార్టీల కార్యకర్తలు నేతలు సంతోషంగా ఎట్లా ఉంటామని ప్రశ్నిస్తున్నారు.

ఉద్యమంలో కల్సి పని చేసిన వారెవరు ఇప్పుడు సిఎం కెసిఆర్‌ ‌వెంట పదవుల్లో కాని లేదా  ఆయన అనుచర గణంలో కాని లేరు.  ఒకప్పుడు మేధావులు, విద్యావేత్తల సలహాలు తీసుకున్న కెసిఆర్‌ ‌వారెవరి ముఖం కూడ చూడటం లేదు. ఆయన చుట్టూ  అంతా ‘‘పవర్‌’’ ‌మనుషులు  చేరారు. తెలంగాణ ఉద్యమ మహోపాధ్యాయ డాక్టర్‌ ‌కొత్తపల్లి జయశంకర్‌ ‌సర్‌ అన్నట్లు ఆంధ్రా, తెలంగాణ అనిలేదు అంతా  గదే సరుకు. పాలకుల రాజకీయ గారడీలతో టక్కు టమార విద్యలతో  తెలంగాణ అస్థిత్వమే ఈ రోజు పెద్ద ప్రశ్నార్దకంగా మారింది.
– మహేందర్‌ ‌కూన, జర్నలిస్ట్

Leave a Reply