Take a fresh look at your lifestyle.

వోటు అడిగే హక్కు ఎవరికుంది?

“అభివృద్ధికి ఆరంభమే కాని, అంతముండదు. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ పోవడంలోనే పాలకుల నేర్పరితనముంది. అయితే ఎన్నికలొచ్చినప్పుడల్లా గుర్తుకు వొచ్చే అభివృద్ధి గురించి వల్లెవేసే ఈ పార్టీలు తమకు అవకాశం వొచ్చినప్పుడు ఏమేరకు ప్రయత్నించాయన్న విషయంలో ఒకసారి అత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. విచిత్రమేమంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేపార్టీకి చెందినవి కానప్పుడు సమోధ్య కొరవడడం లేదా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల దోబూచులాటలో రాష్ట్ర ప్రగతి కుంటుపడడంతోపాటు ప్రజలకు అందాల్సిన పథకాలు నిర్వీర్యమవుతున్నాయి.”

హైదరాబాద్‌ అభివృద్దికి తామే కారణం కాబట్టి, ఇక్కడి ప్రజలను వోటు అడిగే హక్కు తమకు తప్ప మరోపార్టీకి లేదని జీహెచ్‌ఎం‌సిలో పోటీపడుతున్న రాజకీయ పార్టీలన్నీ అంటున్నాయి. ఈ సారి కూడా తమకు అవకాశం కలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామం టున్నాయి ఆ పార్టీలు. వాస్తవంగా అభివృద్ధి అన్నది నిరంతర ప్రకియ. అభివృద్ధికి ఆరంభమే కాని, అంతముండదు. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ పోవడంలోనే పాలకుల నేర్పరితనముంది. అయితే ఎన్నికలొచ్చినప్పుడల్లా గుర్తుకు వొచ్చే అభివృద్ధి గురించి వల్లెవేసే ఈ పార్టీలు తమకు అవకాశం వొచ్చినప్పుడు ఏమేరకు ప్రయత్నించాయన్న విషయంలో ఒకసారి అత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. విచిత్రమేమంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేపార్టీకి చెందినవి కానప్పుడు సమోధ్య కొరవడడం లేదా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల దోబూచులాటలో రాష్ట్ర ప్రగతి కుంటుపడడంతోపాటు ప్రజలకు అందాల్సిన పథకాలు నిర్వీర్యమవుతున్నాయి. తాజాగా జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల సందర్భంగా ఇదేవిషయం స్పష్టమవుతోంది. వందేళ్ళగా కనీవినీ ఎరుగని వర్షాలు హైదరాబాద్‌ ‌నగరాన్ని ముంచెత్తివేశాయి. ఊహాతీతంగా అనేక బస్తీలు నీటమునిగి పోయాయి. బస్సులు, కార్లు నడువాల్సిన రోడ్లపై పడవ ప్రయాణం చేయాల్సి వొచ్చింది. కోట్ల రూపాయల ప్రజల ఆస్తులు ‘క’న్నీటి పాలైనాయి. పదిపదిహేను రోజులపాటు ఇండ్లు విడిచి మరో దగ్గర తల దాచుకున్నవారు కొందరైతే, మరోదిక్కులేక నీళ్ళలోనే రోజులు గడిపినవారు మరికొందరు. తినడానికి తిండి, ఉండేందుకు ఇల్లు లేకుండా గడపాల్సి వొచ్చింది.

ఇంతటి దారుణ పరిస్థితిలోనూ రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేయడంలో చూపించిన ఆసక్తి, అతలాకుతలమైన నగరజీవులను ఆదుకునే విషయంలో సమష్టి సహాయకచర్యలపైన దృష్టి పెట్టలేకపోయాయి. ఇందుకు గత పాలకులు నిర్లక్ష్య వైఖరే కారణమని అధికారపార్టీ ఆరోపిస్తుంటే, అధికారంలోకి వొచ్చిన ఆరేళ్ళలో మీరుచేసిందేమిటని ప్రతిపక్షాలు వాదన చేస్తున్నాయి. చివరకు వరద సహాయం విషయంలోనూ ఇదే గొడవ. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ప్రతీ ఇంటికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిందిలేదని చెబుతున్న అధికారపార్టీ, ఆ సహాయం కూడా ప్రజలకు అందకుండా ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని విమర్శిస్తుంటే, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో లబ్ధిపొందడమే లక్ష్యంగా అధికారపార్టీ రూపాయల పంపిణీ చేస్తోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అలాగే లబ్ధిదారులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని నేరుగా వారివారి బ్యాంకు ఖాతాల్లో వేయకుండా, అధికారపార్టీ కార్యకర్తలు, నాయకులతో పంపిణీ చేయించడంవల్ల చివరకు బాధితుడికి సగంకన్నా తక్కువ డబ్బులే అందుతున్నాయంటూ విపక్షాలు గోలపెడుతున్నాయి. ఇదిలాఉంటే నీటమునిగిన హైదరాబాద్‌ను ఆదుకునే విషయంలో కేంద్రం అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించకుండానే, నిధులను కేటాయించినట్లుగా ప్రచారం చేసుకోవడాన్ని అధికార టిఆర్‌ఎస్‌ ‌తప్పుపడుతోంది. దీనిపై వాదోపవాదాలు జరుగడం, ఛాలెంజీలు చేసుకోవడం, బహిరంగ చర్చకు పాతబస్తీలోని దేవాలయాన్ని ఎంచుకోవడంలాంటి చర్యలు నగర ప్రజల్లో భయాందోళన కలిగించేవిగా ఉన్నాయి.

గత ప్రభుత్వాల తీరును పరిశీలించినప్పుడు తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఆరేళ్ళలో ఎలాంటి మత ఘర్షణలు లేవన్నది నిర్వివాదాంశం. కాని, ఈ ఎన్నికల సందర్భంగా గత ఘర్షణలు పునారావృతి అవుతయేమోనన్న భయం నగరవాసుకు పట్టుకుంది. బిజెపి రాష్ట్ర నాయకత్వం నిధులు, అభివృద్ధి విషయంలో చర్చకు పాతబస్తీలోని దేవాలయాన్ని ఎంచుకోవడమే నగరప్రజల్లో ఈ ఉలిక్కిపటుకు కారణంగా మారింది. ఈ విషయంలో మీడియా సంస్థలు కూడా తమ వంతు ఆందోళన వెలిబుచ్చాయంటే గత అనుభవాలే ఇందుకు నిదర్శనం. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రాభివృద్దిపై చర్చలు జరుగుతాయి. కాని, స్థానిక ఎన్నికల్లో కేవలం స్థానిక సమస్యలపైనే చర్చలు జరుగాల్సి ఉండగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దిగజారుడు వ్యాఖ్యానాలు చేసుకునే సంస్కృతి ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మొదటిసారి అధికారం చేపట్టడానికి ముందు తన ఎన్నికల ఎజెండాలో చెప్పినవేవీ గత ఆరేళ్ళ పూర్తి చేయలేకపోయిన విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. కేవలం హైదరాబాద్‌ ‌నగరంలోనే నిరుపేదలకోసం రెండు లక్షల వరకు డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాటతప్పిందన్న విమర్శ ఉంది. ట్యాంక్‌బండ్‌ను కాలుష్యం లేకుండా, కొబ్బరినీళ్ళలా తాగేయోగ్యంగా చేస్తామని, అక్కడ ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిందంటూ సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా హైదరాబాద్‌ ‌రోడ్లన్నిటినీ తీర్చిదిద్దుతామని, ఎక్కడ ఒక గుంత కనిపించినట్లు ఎవరైనా చెబితే వారికి వెయ్యిరూపాయల నగదు బహుమతి టిఆర్‌ఎస్‌ ‌ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ, వాస్తవంగా ఇప్పుడు ఎక్కడ గుంతలేకుండా నగర రోడ్లు ఉన్నాయో చెప్పాలని ఆయన సవాల్‌ ‌విసురుతున్నారు. కాగా తాజాగా ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌లో పర్యటించిన మరో కేంద్ర మంత్రి జవదేకర్‌ ‌కూడా టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బిజెపి పాత్ర ఉందని, అభివృద్దిని కోరుకునే హక్కు తమకుందంటూ, రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తెలంగాణ యువతకు ఉపాధికల్పిస్తామన్న హామీని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తుంగలో తొక్కుతోందంటూ ఆయన ఆరోపించారు.

అయితే బిజెపి ఆరోపణలు టిఆర్‌ఎస్‌ ‌కూడా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం సహకారం లేకపోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా దాడిచేస్తున్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను అంకెల రూపంలో ప్రజల ముందు పెట్టి ఆ పార్టీ నాయకులను ఇరుకులో పెట్టే ప్రయత్నం చేస్తోంది. అలాగే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను ఏకరువు పెడుతోంది. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విషయంలోనైతేనేమీ, ప్రముఖ సంస్థలను నెలకొల్పే విషయంలో నైతేనేమీ కేంద్రం ముఖం చాటేస్తున్న విధానాన్ని ఎత్తి చూపుతోంది. రాష్ట్రంలో నెలకొల్పుతానని హామీ ఇచ్చిన ఐటిఐఆర్‌ ‌ప్రాజెక్టును కేంద్రం ఎందుకు విరమించుకుందన్న ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతోంది. దీనివల్ల ప్రత్యక్షంగా పదిహేను లక్షల మందికి, పరోక్షంగా యాభై లక్షలమందికి ఉపాధిలభించే అవకాశం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపకుండా ఈ ప్రాజెక్టును రద్దుచేస్తున్నట్లు కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతోంది. దీనివల్ల రాష్ట్రరాజధానికి ప్రపంచ దేశాల్లోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ‌కంపెనీలతోపాటు, అనేక అనుబంధ పరిశ్రమలు ఏర్పడే అవకాశం లేకుండా పోయిందన్న ఆరోపణ కేంద్రంపై ఉంది. దాదాపు 13లక్షల కోట్ల పెట్టుబడితో నెలకొల్పాల్సిన ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఏర్పాటుతో రాష్ట్రానికి కోట్లాది రూపాయల ఆదాయం సంక్రమించేది, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు కావాల్సిన 40 వేల ఎకరాల భూమిని సమకూర్చేందుకు అంగీకరించినప్పటికీ కేంద్రం తృణీకరించడాన్ని టిఆర్‌ఎస్‌ ఎత్తిచూపుతోంది. ఇక హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో కూడా అందించాల్సిన సహకారాన్ని కేంద్రం అందించడంలేదన్న అపవాదు ఉంది. ఎప్పుడో నిజాంకాలంలో ఏర్పాటు చేసిన నాలాల అభివృద్ధి విషయంలో కేంద్రం వెనక్కు తగ్గడాన్ని గుర్తుచేస్తోంది. సుమారు పదమూడు వేల కోట్లు వ్యయం కాగల ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాను సమకూర్చుకున్నా కేంద్రం మొండి చెయ్యి కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందన్న వాదన ఉంది. ఇచ్చిన హామీలమేరకు, నిధులను, ప్రాజెక్టులను రాష్ట్రానికి రాబట్టే విషయంలో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న బిజెపి నేతలుగాని, రాష్ట్ర నేతలుగాని ఏమాత్రం స్పందించకపోవడాన్ని టిఆర్‌ఎస్‌ ‌తీవ్రంగా తప్పు పడుతోంది.

కాగా, హైదరాబాద్‌ అభివృద్ధికి తామే కారణమంటోంది తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ ‌కలిగించిన ఘనత తమ పార్టీ అధినాయకుడు చంద్రబాబునాయుడిదేనని, అందుకు వోట్లు అడిగే హక్కు తమదేనంటోంది ఆపార్టీ. అయితే టిడిపి ఆంధ్ర పార్టీ అని గుర్తుచేస్తూ అభివృద్ది అన్నది ఇంటి పార్టీకే సాధ్యమవుతుందని చెప్పుతూవస్తున్న టిఆర్‌ఎస్‌, ‌నిష్కారణంగా ఏడు మండలాలను గుట్టు చప్పుడు కాకుండా తమ ప్రాంతంలో కల్పుకున్న అంశాన్ని, విద్యుత్‌ ‌ప్రాజెక్టులను వశంచేసుకున్న అంశాన్ని టిఆర్‌ఎస్‌ ‌గుర్తుచేస్తోంది. కాగా, రాష్ట్రంలో ఇంతవరకు జరిగిన సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో ప్రాజెక్టుతోపాటు ఇతర అభివృద్ధిపనులన్నీ తమకాలంలోనే జరిగాయని, అందుకు తమకు మాత్రమే నగర ప్రజలను వోటు అడిగే హక్కు ఉందంటుదని కాంగ్రెస్‌ అం‌టోంది, ఈ తరుణంలో ఏ పార్టీకి విజయం చేకూర్చాలన్న విషయాన్ని నగర ప్రజలు విశ్లేషించుకుంటున్నారు.

Manduva ravindar rao
మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Leave a Reply