Take a fresh look at your lifestyle.

లాల్ బహదూర్ శాస్త్రీ స్మృతులను చెరిపేసిందెవరు ..?

‌‘‘‌ప్రతి దేశం చరిత్ర కూడలి వద్ద నిలబడి, ఏ మార్గంలో వెళ్ళాలో నిర్ణయించుకోవాలి. మనకు ఎటువంటి ఇబ్బంది లేదా సంకోచం అవసరం లేదు. కుడి ఎడమ వైపు చూడటం లేదు. మా మార్గం సూటిగా, స్పష్టంగా ఉంది.అందరికీ స్వేచ్ఛనిచ్చే శ్రేయస్సుతో కూడిన సోషలిస్టు ప్రజాస్వామ్యాన్ని నిర్మించి, ప్రపంచ శాంతిని పెంపొందిస్తూ అన్ని దేశాలతో స్నేహాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం ’’

మనలో ఎంతమందికి లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి గుర్తున్నారు? ఆయన స్వతంత్ర భారత రెండవ ప్రధానమంత్రి మాత్రమే కాదు, తన మాటలతోనూ, చేతలతోను దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించిన దేశభక్తుడాయన. సదుద్దేశాలతో కూడిన ఉత్సాహం, సౌమ్యత, వినయం, ప్రసంగాలలో చూపే నిరుపమానమైన నియంత్రణ, చర్యలలో నిర్ణయాత్మకత లాల్‌ ‌బహదూర్లోని అసాధారణమైన లక్షణాలు. ఇవిమాత్రమే కాదు సంక్లిష్టమైన సమస్య పరిష్కార నైపుణ్యం, స్నేహపూర్వక పరిష్కారాలను కనుగొనడం ఆయనను జవహర్లాల్‌ ‌నెహ్రూకు ఆదర్శవంతమైన వారసునిగా చేసింది. జూన్‌ 2, 1964 ‌న, నెహ్రూ మరణించిన ఆరు రోజుల తరువాత, భారత రాజకీయాల్లో అగ్రస్థానానికి ఎదిగిన ఈ అసాధారణ వ్యక్తిని కాంగ్రెస్‌ ‌పార్టీ తన పార్లమెంటరీ నాయకుడిగానూ, భారతదేశ ప్రధానిగాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. స్వతహాగానే యుద్దాలకు వ్యతిరేకియైన ఆయన భారత, పాకిస్తాన్‌ ‌దేశాలు స్నేహపూర్వకంగా జీవించగల మార్గాన్ని కనుగొనడమే తన ప్రాధమిక కర్తవ్యంగా భావించారు.

ఈ దేశాల మధ్య సన్నిహిత సహకారం కేవలం ఈ రెండు దేశాల ప్రయోజనానికే కాకుండా ఆసియాలో శాంతి స్థాపనకు నాంది పలకగలదని తన మొదటి ప్రసంగంలోనే ఆశాభావం వ్యక్తం చేశాడు. 1904 అక్టోబర్‌ 2‌న మొగల్‌ ‌సరాయిలో జన్మించిన లాల్‌ ‌బహదూర్‌ ‌చిన్న నాటి నుంచే కుల వ్యవస్థను వ్యతిరేకించాడు. తన కులాన్ని చూపించే ‘‘శ్రీవాస్తవ’’ పేరును వదిలేసి ముజాఫర్‌ ‌పూర్‌ ‌లో హరిజనోద్దరణకు పాటుపడ్డాడు. స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన స్వాతంత్రానంతరం ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వంలో రైల్వే శాఖమంత్రిగాను, హోంమంత్రిగానూ పనిచేశాడు. నెహ్రూ మరణాంతరం భారత ప్రధానిగా పదవి భాధ్యతలు స్వీకరించాడు.
సైనిక చర్య ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించే ప్రాముఖ్యతను ఆయన ప్రజలకు వివరించే క్రమంలోనే పాకిస్తాన్‌ ‌నుండి సాయుధ చొరబాటుదారులు ఆగష్టు 5, 1965 న జమ్మూ కాశ్మీర్‌ ‌రాష్ట్రంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. ఈ సంఘటనల పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన ప్రధాని బలంతోనే బలప్రయోగానికి సమాధానం చెబుతామని పాకిస్తాన్కు స్పష్టం చేశాడు. యు.ఎన్‌. ‌సెక్యూరిటీ కౌన్సిల్‌ ‌తీర్మానం ప్రకారం 1965 సెప్టెంబర్‌ 23 ‌న ఇరుదేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది. కాల్పుల ప్రారంభం నుండి కాల్పుల విరమణ వరకు జీవించడమే కాదు, ఆచరణీయమైన శాంతిని సాధించడం, లోతైన సంఘర్షణను ఎలా అంతం చేయాలన్నప్పుడు.., ‘‘మా దృష్టిలో శాంతియుత సహజీవనం మాత్రమే సమాధానం’’ అని స్పష్తం చేశాడు. నాటి యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌ ‌ప్రధానమంత్రి ఏ.ఎన్‌.‌కొసిజిన్‌ ఆహ్వానం మేరకు భారతప్రధాని లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూభ్‌ ‌ఖాన్‌ ‌తాష్కెంట్‌ ‌శాంతి సమావేశానికి హాజరయ్యారు. ఆరు రోజుల చర్చల అనంతరం జనవరి 10,1966న తాష్కెంట్‌ ‌శాంతి ఒప్పందం మీద ఇరుపక్షాలు సంతకం చేశాయి. కొన్ని గంటల వ్యవధిలోనే శాస్త్రీజీ మరణించాడన్న వార్త యావత్‌ ‌ప్రపంచాన్ని దిగ్భాంతికి గురి చేసింది.

ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్నగా మారిన ఆయన మరణం ప్రపంచాన్ని అయోమయంలో పడేసింది. ఆయన మరణం వెనుక గల నిగూఢ రహస్యాలేమిటి? ఆయన మరణంతో లబ్ధి పొందేవారెవరన్నది దశాబ్దాలుగా సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అయితే రష్యా గూఢచార సంస్థ కెజీబి మొదటి డైరెక్టరేట్‌ ‌జనరల్‌ ‌వాసిలి నికిటిన్‌ ‌మిత్రోఖిన్‌, ‌కెంబ్రిడ్జ్ ‌విశ్వవిద్యాలయ చరిత్ర ప్రొఫెసర్‌ ‌క్రిష్టఫర్‌ ఆం‌డ్రూతో కలిసి ప్రచురించిన ‘‘ ది మిత్రోఖిన్‌ ఆర్కీవ్‌ ‘‘ ‌రెండు వ్యాల్యూములు శాస్త్రిజీ మరణానికి సంబంధించి మరింత దుమారాన్ని లేపాయి. అందులో శాస్త్రీ మరణం కుట్రపూరిత సంఘటనగానే అభివర్ణించడం కొత్త అనుమానాలను రేకెత్తించింది. మిత్రోఖిన్‌ ఆర్కీవ్స్ ‌ప్రపంచాన్ని వణికించిన సాక్షాధారాలు. వీటి ఆధారంగానే బ్రిటన్‌, ఇటలీ వంటి దేశాలలో ఎన్నో న్యాయ సంబంధిత వ్యవహారాలకు కారణమైంది. ఒకవేళ భార్తదేశం ఈ ఆర్కివ్స్ ‌ను పట్టించుకుని ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి, కాని ప్రభుత్వం వీటి బుట్టదాఖలు చేసింది.

ప్రచ్చన్న యుద్ధ కాలంలో స్వతంత్ర దేశాలైన ప్రపంచదేశాలు స్వేచ్చ రహితంగా మారిపోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. దానికి కారణం అగ్ర రాజ్యలైన అమెరికా, యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌ ‌ల మధ్య గల ఆధిపత్యపోరే. అన్ని దేశాలు సి ఐ ఏ లేదా కెజిబి కనుసన్నలలో మెలగాల్సిన దారుణ వ్యవస్థ నెలకొంది. ఇదేసమయంలో లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి భారత ప్రధానిగా పదవి భాద్యతలు చేపట్టాడు. నిజానికి శాస్త్రీజీ ఆ పదవికి పోటీ పడే వారి జాబితాలో లేనేలేడు. మొరార్జీ దేశాయి అప్పటికే పార్టీలో సీనియర్‌ ‌సభ్యుడూ, పదవికి అన్ని విధాల అర్హుడు కూడ. ఆయనతో పాటు నెహ్రూ కుమార్తే ఇందిరాగాంధీ సైతం వరుసక్రమంలో ఉన్నారు. ఈ పరిస్థితులలో అప్పటి ఏఐసిసి అధ్యక్షుడు కుమారస్వామి కామరాజ్‌ ‌కింగ్‌ ‌మేకర్‌ ‌లా మారి శాస్త్రీజీని ప్రధానిని చేయడంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు. నిజానికి ఈ కాలమంతా గూఢాచారుల యుగంగా పేరుపొందింది. చాలా దేశాలలో అగ్ర రాజ్యాల గూఢాచారులు విచ్చలవిడిగా తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులను చేశాయి. ఒక దేశాన్ని బానిసగా చేయడానికి ఆర్థికపరమైన సహాయాలు చేసే విధానాన్ని సి ఐఏ పాటించగా, ఆయా దేశాల ప్రజల మనస్తత్వాలను నియంత్రిస్తే ఆ దేశ ప్రజలంతా తమ చెప్పుచేతుల్లో ఉండే పద్దతిని కేజిబి అనుసరించింది. అయితే శాస్త్రిజీ బతికున్నంత కాలం భారతదేశంలో తమ కుట్రలు విఫలమవుతాయని ఈ సంస్థలకు బాగా తెలుసు. 1966 శాస్త్రీజీ ప్రధాని కాగానే వివిధ దేశాలలో ఉన్న తన గూఢాచారులందరినీ పాకిస్తాన్‌ ‌వెనక్కి పిలిపించింది. ఇక భవిష్యత్తు భారతమంతా ప్రధానిగా లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రీ అధికారంలో ఫరడవిల్లబోతోందని ఆ దేశం అప్పుడే గమనించింది.

తరాలు గడిచిపోయాయి, కాని శాస్త్రి మరణానికి కారణమైన కుట్ర సిద్ధాంతాలు ఆగిపోలేదు. ఇదే దుర్ఘటన ఇతర దేశాలలో జరిగి ఉంటే సమర్థవంతమైన అధికారులతో కూడిన బృందం విచారించి, సంబంధిత పత్రాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచేవారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో అటువంటి ప్రయత్నాలు జరగకపోవడం శోచనీయం. శాస్త్రిజీ మరణం వెనుక అనేక అనుమానాలు నివృత్తి అవుతూనే నిశ్శబ్దాన్ని సంతరించుకోవడం విషాధం. శాస్త్రిజీ మరణించిన రోజు ఆయన వ్యక్తిగత సహాయకుడు రాంనాథ్‌ ‌కాకుండా మాస్కోలోని భారతీయ రాయబారైన టిఎన్‌ ‌కౌల్‌ ‌వ్యక్తిగత వంటమనిషి జాన్‌ ‌మహమ్మద్‌ ‌రావడం అతిపెద్ద చిక్కు ప్రశ్న. జనవరి 11 ఉదయం 1.25 ప్రాంతంలో శాస్త్రీజీ నిద్రలేచి తీవ్రమైన దగ్గుతో భాదపడి, డాక్టర్‌ ‌చుగ్‌ ‌ను పిలిచినప్పటికినీ, అప్పటికే ఆయన మరణించాడు. శాస్త్రి బట్టలు ఉతికే రష్యన్‌ ‌బట్లర్‌ ‌కూడా శాస్త్రి మీద విషప్రయోగం జరిగి ఉండవచ్చని రష్యన్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్టు చెప్పాడు. శాస్త్రీజీ భౌతిక కాయాన్ని ఢిల్లీకి తెచ్చినప్పడు ఆయన శరీరం మీద ఉన్న నీలిరంగు కోతలను చూసి ఆయన తల్లి ‘‘నా కొడుక్కు విషమిచ్చి చంపారని’’ రోదించడం అందరికీ తెలిసిందే.

శాస్త్రీజీ దేహానికి పోస్ట్ ‌మార్టెం నిర్వహించడానికి ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కూడ అనేక అనుమానాలకు దారి తీసింది. ఈ విషయమై అప్పటి తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్‌ ‌నందాను శాస్త్రి కుటుంబ సభ్యులు వినతిపత్రం ఇచ్చారు కూడా. శాస్త్రి భార్య లలితా శాస్త్రి తన భర్త విష ప్రభావంతోనే మరణించారని ఆరోపించారు. క్రాంత్‌ ఎం. ఎల్‌. ‌వర్మ రాసిన ‘లలితకే ఆసూ’ అనే హిందీ కవితా పుస్తకం 1978 లో ప్రచురించబడింది. ఈ పుస్తకంలో శాస్త్రి మరణం గురించిన విషాద కథను ఆయన భార్య లలితా వివరించారు. శాస్త్రిజీకి సంబందించిన వస్తువులు కొన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పటికీ అందచేయబడలేదు. తన తండ్రి ఎప్పుడు ఒక ఎర్రని డైరీని వెంట ఉంచుకుంటాడని, రోజు వారి అంశాలను అందులో రాస్తూ ఉండేవారని, ఆ డైరీ తమకు ఇంతవరకు ఇవ్వలేదని శాస్త్రి కుమారుడు అనిల్‌ ‌శాస్త్రి వాపోయాడు. అంతేకాదు ఆయన ఎప్పుడూ ఉపయోగించే ఫ్లాస్క్ ‌సైతం మాయమయ్యింది.

ఆయన మరణం గురించి భారత ప్రభుత్వం ఎటువంటి సమాచారం విడుదల చేయలేదు ఆ సమయంలో మీడియా మౌనంగా ఉండిపోయింది. కుట్ర ఉనికిని భారతదేశంలో ‘ఔట్‌ ‌లుక్‌’ ‌పత్రిక మాత్రమే కవర్‌ ‌చేసింది. శాస్త్రి మరణానికి సంబంధించిన ఒక పత్రాన్ని సమాచార హక్కు చట్టం క్రింద పొందడానికి ‘సిఐయ్యేస్‌ ఐస్‌ ఆన్‌ ‌సౌత్‌ ఆసియా’ పుస్తక రచయిత అనుజ్‌ ‌ధార్‌ ఒక ప్రశ్నను అడిగారు. కాని ప్రధాన మంత్రి కార్యాలయం సమాధానం ఇవ్వడానికి నిరాకరిస్తూ, విదేశీ సంబంధాలకు ఇది హాని కలిగించవచ్చని పేర్కొంది. కుల్దీప్‌ ‌నాయర్‌ ‌చేసిన మరో ఆర్టీఐ అభ్యర్ధన కూడా తిరస్కరించబడింది. ఎందుకంటే పిఎంఓ ఈ పిటిషన్స్ ‌మీద బహిర్గత పరచకుండా ఉండే అధికారాలు పొందింది. వాస్తవానికి ఆయన శాస్త్రీజీ ప్రెస్‌ ‌సెక్రటరి. శాస్త్రి మరణ సమయంలో కుల్దీప్‌ ‌నాయర్‌ అక్కడే ఉన్నాడు. శాస్త్రి దేహానికి భారత్‌ ‌పోస్టుమార్టం నిర్వహించిందా, లేదా అనే ప్రశ్నలకు హోం మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. కాని యుఎస్‌ఎస్‌ఆర్లో పోస్ట్మార్టం నిర్వహించలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపింది. ఇదేసమయంలో ఢిల్లీ పోలీసులు శాస్త్రి మరణానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి రికార్డులు లేవని చెప్పారు.

1966, ఫిబ్రవరీ 16న జరిగిన పార్లమెంటు సమావేశాలలో నాటి విదేశి వ్యవహారాల మంత్రి స్వరణ్‌ ‌సింగ్‌ ఒక మెడికల్‌ ‌రిపోర్ట్ ‌తో కూడిన ప్రకటనను విడుదల చేశాడు. అయితే దాని సంబందిత కాపి ప్రచురించబడినప్పుడు ఆ మెడికల్‌ ‌రిపోర్ట్ ‌మాయమయ్యింది. కేఎన్‌ ‌సింగ్‌, ‌హెచ్‌ ‌వి కామత్‌, ‌కృష్ణకాంత్‌, ఏబి వాజ్‌ ‌పేయి వంటి నాయకులు న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేసినప్పటికినీ, ప్రభుత్వం కినుక వహించింది. లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి మరణాన్ని విచారించేందుకు జనతా ప్రభుత్వం 1977 లో ఏర్పాటు చేసిన రాజ్‌ ‌నరేన్‌ ‌కమిటీ రికార్డులను బహిరంగపరచాలని కేంద్ర సమాచార కమిషన్‌ ‌ప్రధానమంత్రి కార్యాలయం మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఈ ఉదంతంలో ఇద్దరు కీలకమైన సాక్షులు – శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు ఆర్‌ ఎన్‌ ‌చుగ్‌, ‌వ్యక్తిగత సహాయకుడు రామ్‌ ‌నాథ్‌ – ‌కమిటీ ముందు తమ వాంజ్ఞూలాన్ని ఇవ్వడానికి వస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. పార్లమెంటు సమావేశానికి హాజరు కావడానికి ఆర్‌ ఎన్‌ ‌చుగ్‌ ‌రోడ్డు మార్గంలో ఢిల్లీకి వెళుతుండగా ట్రక్కు ఢీకొట్టడంతో ఆయన, ఆయన భార్య ఇద్దరూ మరణించారు. ఈ ప్రమాదంలో ఆయన కుమార్తె మాత్రమే బయటపడింది. ‘‘తాను చాలా కాలంగా ఈ భారాన్ని మోస్తున్నానని, ఈ రోజు కమిటీ ముందు అంతా వెల్లడిస్తానని’’ రాంనాథ్‌ ‌శాస్త్రిజీ భార్యతో చెప్పి పార్లమెంట్‌ ‌వైపు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన రెండు కాళ్ళు నలిగిపోయి శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడడమే కాకుండా తన జ్ఞాపకశక్తిని సైతం కోల్పోయాడు.

శాస్త్రి మరణం వెనుక గల కుట్రలను ధృవపరుస్తూ గ్రెగోరి డగ్లస్‌ ‌వెలువరించిన ‘ కన్వర్షేషన్‌ ‌విత్‌ ‌క్రౌ’’ పుస్తకం అనేక విస్మయకర ఉదంతాలను బహిర్గత పరిచింది. సీఐఏలో ఉన్నత ర్యాంకులో పనిచేసిన రాబర్ట్ ‌క్రౌలీ సుదీర్ఘంగా ఇచ్చిన ఇంటర్వ్యూను డగ్లస్‌ ‌పుస్తకరూపంలో తీసుకువచ్చాడు. భారత అణుకార్యక్రమ పితామహుడు హోమి.జే.బాబాను తామే విమాన ప్రమాదంలో హతమార్చినట్టు క్రౌలీ ఇచ్చిన వాంజ్ఞ్మూలం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. శాస్త్రీజి మరణించిన కేవలం పదమూడు రోజులకే భారతదేశంలోనే అగ్రగణ్యుడైన శాస్తవేత్త మరణించడం కాకతాళీయం కానేకాదు. ఈ కేసులో అనేక కాకతాళీయ అంశాలు అసలు విషయాన్ని స్పష్టం చేస్తున్నప్పటికినీ పట్టించుకునే నాథుడు లేకపోవడం విషాధం. శాస్త్రీజీ మరణోధాంతనికి సంభంధించిన ఇద్దరూ సాక్షులను ట్రక్కు ఢీకొట్టడం ఎలా కాకతాళీయమౌతుంది? ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన రిపోర్టులను మాయం చేసిన అదృశ్య శక్తులెవరు?.

భారతదేశంలో న్యూక్లియర్‌ ‌పోగ్రాం, గ్రీన్‌ ‌రెవెల్యూషన్‌, ‌వైట్‌ ‌రెవెల్యూషన్‌ ‌తదితర అంశాన్ని శాస్త్రీజీనే ప్రారంభించాడని ఎందరికి తెలుసు? అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారులలో ఒకటిగా భారతదేశాన్ని తీర్చిదిద్దింది శాస్త్రీజీనే అని ఈ రోజు పాఠ్యాంశాలలో కనబడుతోందా?. వాస్తావానికి శాస్త్రీజీ భార్తదేశ మొదటి ఆస్థిక సంస్కర్త. దురదృష్టవశాత్తు ఈ విషయం ఎవరికీ తెలియదు. అక్టోబర్‌ 2 అం‌టే కేవలం గాంధిజీ జన్మదినం మాత్రమే కాదు, అదేరోజు శాస్త్రీజీ జన్మదినమని తెలియకపోవడం అత్యంత శోచనీయం. మనం శాస్త్రీజీ తాష్కెంట్‌ ‌లో మరణించాడని విన్నాం. కాని మనం మనదేశ జ్ఞాపకల నుంచి ఆయనను ఒక పద్దతి ప్రకారం కుట్రపూరితంగా చెరిపేశాం. మనం శాస్త్రీజీ ఋణం తీర్చుకోగలమా? శాస్త్రి మరణం గురించిన నిజం మన విదేశీ సంబంధాలకు హాని కలిగిస్తుందని భారత ప్రభుత్వం భయపడుతోంది. శత్రువులను భారీ నుండి దేశాన్ని రక్షించి, స్వేచ్ఛను పరిరక్షించిన నాయకులను పట్టించుకోకుండా ఏ వేడుక చేసిన అర్థరహితమే.

Leave a Reply