- టీకా అందుబాటులోకి రావడంపై డబ్ల్యుహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అభినందనలు
- కలిసి పనిచేయడానికి సిద్ధమని వెల్లడి
- మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్‌గేట్స్ హర్షం
భారత్‌లో కొరోనా టీకా అందుబాటులోకి రావడంపై ప్రపంచ ప్రముఖులు అభినందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. కొరోనా వైరస్ కట్టడికై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలు బాగున్నాయన్నారు. వైరస్ ఉనికిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్ ముందుందన్నారు. దీనికి సంబంధించి టెడ్రోస్ మంగళవారం ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ల అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న ఇండియాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టెడ్రోస్ తెలిపారు.
అదే విధంగా భారత్ కలిసికట్టుగా ముందుకు సాగితే అత్యంత ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్లను తయారు చేయవొచ్చని టెడ్రోస్ తెలిపారు. తద్వారా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉన్న బలహీన వర్గాలకు వ్యాక్సినేషన్ చేసేలా చర్యలు చేపట్టవొచ్చని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. కొరోనాపై పోరాటంలో మోడీ గొప్పగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. ఆక్స్ఫర్డ్ టీకా కోవీషీల్డ్‌తో పాటు భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దేశంలో కోవిడ్ టీకా పంపిణీ త్వరలో జరగనున్నట్లు ప్రధాని మోదీ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత వ్యాక్సిన్ తయారీ సామర్థ్యంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. భారత్ పనితీరును వారు కొనియాడారు.
భారత ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటోందని, మహమ్మారిని అంతం చేసేందుకు ఆ దేశం కట్టుబడి ఉన్నట్లు టెడ్రోస్ తన ట్వీట్లో తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేస్తున్న భారత్..వ్యాక్సినేషన్ పక్రియతో దేశ ప్రజలకు మేలు చేస్తున్నట్లు తెలిపారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే, సురక్షితమైన సమర్థవంతమైన వ్యాక్సిన్లను అవసరమైన వారికి ఇవ్వవొచ్చని టెడ్రోస్ తెలిపారు. ప్రధాని మోదీకి తన ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిగ్ గేట్స్ కూడా భారత ప్రభుత్వ వ్యాక్సినేషన్ పక్రియను మెచ్చుకున్నారు. శాస్త్రీయ ఆవిష్కరణల్లో భారత నాయకత్వం అద్భుతంగా ఉందన్నారు. భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గేట్స్ కూడా తన ట్వీట్‌ను ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు.