Take a fresh look at your lifestyle.

కొత్త వ్యవసాయ చట్టాలు… ఎవరి ప్రయోజనాల కోసం…?

“బురదలో దిగబడి నాట్లేసే మహిళలకు అర్థమయిన విషయాలు ప్రభుత్వ విధాన రూపకర్తలకు అర్థం కాలేదంటేనే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతుంది. వాళ్ళందరూ తెలంగాణలోని ఒక చిన్న మహిళా వ్యవసాయ పరస్పర సహాయక సంఘం(కోఆపరేటివ్) సంఘం సభ్యులు. చిన్న, సన్నకారు, పేద మహిళా రైతులు. ఎక్కువమంది రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల వాళ్లు. వ్యవసాయంలో ఎక్కడెక్కడ పెట్టుబడి పెరుగుతోందో, వాటి వల్ల తమ జీవితాలు ఎందుకు దెబ్బతింటున్నాయో స్పష్టంగా తెలిసినవాళ్ళే. వున్న చారెడు భూమిని సారవంతం చేసుకోవటం కోసం, రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతున్నవాళ్లే.”

k sajaya sankethamలక్షలాదిమంది రైతులు దేశ రాజధానిని ముట్టడించి గత పదహారు రోజులుగా అననుకూల వాతావరణాన్ని, ప్రభుత్వ నిర్బంధాన్ని భరిస్తూ కొత్తగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలని రద్దు చేయాల్సిందే అంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. ప్రపంచమంతా ఈ పోరాటాన్ని ఉత్కంఠగా వీక్షిస్తోంది. చట్టం చేయకముందు చేయాల్సిన సంప్రదింపులను ప్రభుత్వం ఇప్పుడు చేస్తోంది కానీ, మరోపక్క రైతులకు వ్యతిరేకంగా అనేక ముద్రలు వేస్తూ తమ పార్టీ శ్రేణులతో దుర్మార్గమైన ప్రచారానికి వొడికడుతోంది. ఈ పోరాటాన్ని సమర్ధించేవారూ, వ్యతిరేకించేవారూ, హేళన చేసేవారూ అందరి చూపూ భారతదేశ రైతాంగం పైనే వుంది. రైతులు తమ డిమాండ్లను సాధించుకోగలుగుతారా, ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటుందా…అందరిలోనూ ఇదే ప్రశ్న.

అసలు రైతులు ఎందుకు ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారో తెలియాలంటే ఆ చట్టాలలో ఏముందో తెలియాలిగా ముందు. సాంకేతికంగా అవి: రైతు ఉత్పత్తి, వాణిజ్య (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం, 2020, రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పందం, అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, 2020 (ఎపిఎంసి బైపాస్ యాక్ట్, ఇసిఎ సవరణ, కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్). ఈ మూడు చట్టాలు అసలు ఏం చెబుతున్నాయి? వీటి రూపకల్పన ఎలా జరిగింది? వీటి గురించి విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, రైతులతో, రైతు సంఘాలతో చర్చించకుండా, పార్లమెంటు ఉభయసభల్లోనూ చర్చకు తావు లేకుండా ప్రభుత్వం ఎందుకు కోవిద్ పాండమిక్ సమయాన్ని కూడా తోసిరాజని హడావుడిగా చట్టం ఎందుకు చేయాల్సి వచ్చింది? నిత్యావసర సరుకుల్లోంచీ కొన్ని పంటలను ఎందుకు మినహాయించారు? రైతులకు ఉపయోగకరమైనవే అయితే ఇంత హడావుడిగా చర్చకే ఆస్కారం లేకుండా ఎందుకు చట్టాలని మార్పు చేయాల్సి వచ్చింది? రైతులకు న్యాయపరమైన వెసులుబాట్లకు కూడా చోటివ్వని చట్టం ఎవరి ప్రయోజనాల కోసం? వీటి వెనుక వున్నది ఎవరు? రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశమయినప్పుడు ఇప్పుడు కేంద్రం ఈ చట్టాల మార్పు ద్వారా ఏ నియంత్రణను తీసుకురాబోతోంది? వీటితో పాటు ప్రతిపాదనలో వున్న 2020 విద్యుత్ బిల్లు ద్వారా రైతాంగం మీద పడబోతున్న భారం ఏమిటి? అందరికీ ఈ ప్రశ్నలన్నీ రావటం సహజం. వాటిని కింది స్థాయి వరకూ తీసుకెళ్లి చర్చించడం, పరిష్కారం వెతకడం అత్యంత అవసరం.

k sajaya sanketham

ఇంతకీ ఈ చట్టాల గురించీ ప్రభుత్వం ఏం చెబుతోందో, వాటిని విశ్లేషిస్తూ రైతులు, రైతు సంఘాలు ఏమంటున్నాయో ఒక్కసారి చూద్దాం.

ప్రభుత్వ వాదన : ఇప్పటివరకూ రైతులు తమకు నచ్చిన చోట అమ్మడానికి స్వేచ్ఛ లేదు. రైతులు బేరసారాల్లో సమానమైన సామర్థ్యాన్ని పొందుతారు. ఇప్పటివరకూ ఒకేచోట అమ్ముకునే పరిస్థితే వుంది కానీ ఎక్కువ ఎంపిక లేకపోయింది. ఈ కొత్త చట్టం వల్ల రైతు ఎవరికైనా లాభానికి అమ్ముకోవచ్చు. కేవలం మద్ధతు ధర కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు; వ్యాపారులు, కంపెనీల మీద పర్యవేక్షణను, నియంత్రణను ఎత్తివేయడం రైతులకు మంచి ధర పలికి ఉపయోగపడుతుంది. వ్యాపారులపై, వ్యవసాయ వ్యాపారంపై ఆంక్షలను తొలగించడం అంటే రైతులకు మంచి ధర వస్తుంది అని అర్ధం.

రైతుల, రైతు సంఘాల వాదన: ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఉంది. వాస్తవానికి, వ్యవసాయ ఉత్పత్తులలో 63% మార్కెట్ యార్డుల బయటే వ్యాపారం జరుగుతుంది కానీ నియంత్రణ, పర్యవేక్షణకు లోబడి ఉంటాయి. కానీ, ఇప్పటికే చాలా మంది రైతులు డీలర్లు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల చేతిలో చిక్కుకున్నారనే వాస్తవాన్ని ఈ చట్టాలు బయటకు రానీయటం లేదు. రైతులకు తమ పంటను నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. అందుకు తగిన పెట్టుబడి కూడా వుండదు. కేవలం దీనివలనే పండిన పంటను వెంటనే అమ్మవలసి వస్తుంది. దీనివలన మార్కెట్లో వారికి బేరసారాలు చేసే సామర్థ్యం అతి తక్కువగా వుంటుంది. అంతేకాక మార్కెట్లో కంపెనీలు, ఇతర వ్యవసాయ వ్యాపారాలతో పెద్దెత్తున పోటీ పడలేక అసమానతను ఎదుర్కొంటారు.

కొత్త వాణిజ్య ప్రాంతాలు సృష్టించినప్పుడు, మార్కెట్ యార్డుల వెలుపల వాణిజ్యం జరిగినప్పుడు ప్రభుత్వం నుండి నియంత్రణ, రక్షణ అవసరమని ఇప్పటివరకూ వున్న అనేక అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకూ మార్కెట్‌ యార్డుల్లో తీవ్ర అసమానతలను ఎదుర్కొంటున్న చిన్న, సన్నకారు, కౌలు, మహిళా రైతులకు సరళమైన మార్కెట్ పద్ధతులను నిర్ధారించడానికే. వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ (APMC) చట్టం మొదటి స్థానంలో ఉండటానికి ఇదే కారణం. ఈ చట్టాల వల్ల కొంతమంది పెద్ద వ్యాపారస్తుల ఆధిపత్యం ఏర్పడుతుంది. వాళ్ళేం భ్రమ కలిగిస్తున్నారంటే, చాలా మంది వ్యాపారస్తులు రైతుల దగ్గర కొనటానికి క్యూలలో ఉంటారని, వారి మధ్య ఏ మధ్యవర్తులు, దళారులూ లేకుండా ఎక్కువ ధరతో కొనుగోలు చేస్తారని, దీనివలన అత్యధిక లాభాలు రైతులకు వస్తాయని రంగుల ప్రపంచాన్ని త్రీడీలో చూపిస్తున్నారు.

వీటి గురించి ఎంత వరకూ అసలు మహిళా రైతులకు అవగాహన ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. బురదలో దిగబడి నాట్లేసే మహిళలకు అర్థమయిన విషయాలు ప్రభుత్వ విధాన రూపకర్తలకు అర్థం కాలేదంటేనే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతుంది. వాళ్ళందరూ తెలంగాణలోని ఒక చిన్న మహిళా వ్యవసాయ పరస్పర సహాయక సంఘం(కోఆపరేటివ్) సంఘం సభ్యులు. చిన్న, సన్నకారు, పేద మహిళా రైతులు. ఎక్కువమంది రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల వాళ్లు. వ్యవసాయంలో ఎక్కడెక్కడ పెట్టుబడి పెరుగుతోందో, వాటి వల్ల తమ జీవితాలు ఎందుకు దెబ్బతింటున్నాయో స్పష్టంగా తెలిసినవాళ్ళే. వున్న చారెడు భూమిని సారవంతం చేసుకోవటం కోసం, రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతున్నవాళ్లే.

Protesting-farmers-at-the-Delhi-Haryana-borderఅరుణ వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా రైతు. ఆమె భర్త వ్యవసాయ పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవటంతో కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవటంతో వున్న ఆ రెండెకరాల కొద్ది వ్యవసాయాన్ని చూసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ప్రభుత్వం చెప్పటంతో ఈ సంవత్సరం సన్న వడ్లు పంట వేసింది కానీ అధిక వర్షాలతో పంట పాడైంది. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి రాకపోవటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వుంది. ప్రభుత్వం నుంచీ ఏం ఆశిస్తున్నావని అడిగితే, ‘ఇంత కష్టమస్తే ప్రభుత్వం బాధ్యత తీస్కోవాల్నా వద్దా’ అని తిరిగి ప్రశ్నించింది. ‘మండలంలో వుండే మార్కెట్ యార్డుకే ఎళ్లే పరిస్థితి వుండదు, ఇంక దేశంలో యాడికైనా ఎళ్లి అమ్ముకోవచ్చు’ అని చెప్పటం అనేది పెద్ద మోసమని చెప్పింది. ఎందుకు అంటే, ‘ఇత్తనాలకని, ఎరువులకని అవి అమ్మే దుకాణం దగ్గర్నే అప్పు తెస్తం.

లేదంటే వూర్లో వున్న కోమటాయనే డబ్బులు మిత్తికి ఇచ్చి పంట తీసుకుంటడు. అన్నీ బాగుండి, పంట ఎక్కువ పండినా అవి దాచుకోవటానికి మా ఇళ్లేమీ గడీలు కావు పెద్దగా ఉండటానికి. ఇంక, యాడికి బోయి అమ్ముకుంటం? దూరంబోయి అమ్ముకోటానికి ఆ బాస రావాలె గందా? ఆ మనుషులు తెల్వది, యాడికని పోతం? యాడవుంటం? పిల్లోల్లను, ముసిలోల్లను వదిలేసి రోజులకు రోజులు పోగలమా? ఇప్పుడు ఐకేపీ మహిళా సంఘాల్లోనే ధాన్యం సేకరిస్తున్నరు. మంచిగానే వుంది కానీ, ఇంకా బాగా చేయనీకి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలె. వాళ్లు తెలిసినోల్లు వుంటరు కాబట్టి, పొరపాటు చేసినా అడిగే అవకాశం వుంటుంది. బయటెక్కడకో పోతే వచ్చే ఎక్కువ ధర వున్న ఊర్లోనే ఇవ్వొచ్చు గందా! అది కంపినీల వాళ్లతో కుదరది. మొన్న మక్కజన్న కోసం వచ్చిన్రు. పెట్టుబడి, కష్టం అంత మేము పెట్టుకుంటే కిలోకు ఆరు రుపాయలిస్తమన్నరు. మేం పన్నెండు అడిగినం. కుదరదన్నరు. ఈ కొత్త చట్టాలతో జరిగేది ఇదే. మాకేమీ మాట్లాడటానికి వుండది!

రాజవ్వ ఒక దళిత చిన్న, సన్నకారు రైతు. వున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తోంది. వ్యవసాయ పెట్టుబడికి ప్రతిసారీ అప్పు చేయాల్సి వస్తుంది. నీటికి ఆధారం బోర్లే. ఇప్పటివరకూ కొద్దిపాటి సర్వీస్ ఛార్జీలు తప్పించి ప్రభుత్వం వైపు నుంచీ కరెంటు వరకూ ఉచితంగానే అందుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు వ్యవసాయ చట్టాలతో పాటు రాబోతున్న విద్యుత్ చట్టం గురించి తెలుసా అని అడిగితే ఇప్పుడిప్పుడే వాటి గురించి వింటు న్నామని, బోర్లకు మీటర్లు బిగిస్తారని తెలిసిందని, ఇప్పటికే వ్యవసాయానికి పెట్టుబడి బాగా పెరిగిపోయిందని, కరెంటు ఛార్జీలు కూడా పెరిగితే తమలాంటి చిన్న రైతులు తట్టుకోవటం కష్టం అని చెప్పింది.

నర్సవ్వ మరొక దళిత రైతు. ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద మొత్తం భూమి పోయింది. ఒకప్పుడు రైతుగా వున్నామె ఇప్పుడు ఉపాధి హామీ కూలీగా మారిపోయింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చే బియ్యమే కుటుంబ ఆహారబధ్రతకు కొంత ఆధారం. మీకోసమే అని వచ్చే ప్రాజెక్టులు, కంపెనీలు చివరికి రైతుకు భూమి మీద హక్కుని గుంజేసుకుంటాయని ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిన వ్యక్తి. భూమి పోయిందన్న దిగులు, ఊరుకాని వూరిలో బతకాల్సి రావటం, సరైన ఆహార, సామాజిక భద్రత లేకపోవటం అన్నీ కలిపి ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. గుండెలో సమస్య రావటంతో స్టంట్ వేయించుకున్న మూడునెలల్లోనే చనిపోయింది.

మహిళా రైతుల హక్కుల వేదికగా అనేక సంవత్సరాల నుంచీ క్షేత్ర స్థాయిలోనూ, వ్యవసాయ అధ్యయనం లోనూ వున్న ఆశాలత, ఉషా సీతాలక్ష్మి ‘ఈ మూడు కొత్త చట్టాలు రైతులకు, ముఖ్యంగా మహిళా రైతుల మీద వీటి ప్రభావక్మ్ ప్రమాదకరంగా ఉండబోతాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యత నుండి ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తగ్గటానికే ఈ ప్రయత్నమంతా అని, భారత ప్రభుత్వం దేశ సమాఖ్య రాజకీయాలను గౌరవించకుండా, రాజ్యాంగంలో పొందుపరచబడిన సంక్షేమ నిబంధనలను పట్టించుకోకుండా ఈ చర్యకు పూనుకోవటమంటే చిన్న, సన్నకారు, కౌలు, మహిళా, ఆదివాసీ రైతులను, పేదలను, వినియోగదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ‘మీ చావు మీరు చావండి’ అన్నట్టుగా వ్యవహరించటమేనని, ఈ చర్యలవల్ల దేశ రైతాంగంలోని ప్రధాన భాగమైన పై సమూహాల రైతులకు సంబంధించిన కోట్లాది రూపాయలతో కార్పొరేట్‌లకు, వ్యవసాయ వ్యాపారాలకు క్రమబద్ధీకరించని, అపరిమితమైన స్వేచ్ఛను కలిగించడమే అవుతుందని చెప్పారు.

వ్యవసాయంలో రైతులను మినహాయించి విధానాలు ఎలా చేస్తారు. ప్రధానమైన వ్యక్తులు రైతులే. భారతదేశ ఆహారభాద్రతను తమ అపరిమితమైన శ్రమతో, లభించని కనీస మద్దతు ధరతో దేశానికి సబ్సిడీ ఇస్తున్నది చిన్నా, సన్నకారు రైతులు. అలాంటి రైతులను గానీ, వారికి ప్రాతినిధ్యం వహించే రైతు సంఘాలను కానీ ఈ చట్టం చేసే క్రమంలో ఎక్కడా సంప్రదించలేదు, చర్చించలేదు. ఇక, విద్యుత్ చట్టం (సవరణ) బిల్, 2020 దగ్గరికి వస్తే ఇది పూర్తిగా ప్రైవేట్ విద్యుత్ సంస్థల లాభాలను పెంచడానికి మాత్రమే ఉద్దేశించినట్లు స్పష్టంగానే వుంది. రాజవ్వ చెప్పినట్లు కరెంటు విషయంలో ఇప్పటికే రైతులకు అనేక భయాందోళనలు వున్నాయి. వ్యవసాయం కోసం విద్యుత్తు సమయానికి అందటం అనేది రైతులకు ముఖ్యమైన అంశం.

ముఖ్యంగా వర్షాధార, మెట్ట ప్రాంతాలలో బోరుబావులపైన ఆధారపడే వ్యవసాయం నడుస్తుంది. మరోదారి లేదు. ఇదే వ్యవసాయ ఉత్పత్తిలోనూ, రైతుల జీవనోపాధిని నిలబెట్టడంలోనూ ప్రధానమైనది. ఆ నీటికోసమే తెలంగాణ రైతాంగం బోర్లు వేసీ వేసీ ఆత్మహత్యల పాలయ్యారు. విద్యుత్తుకు సహజ ప్రత్యామ్నాయాలను అన్వేషించకుండా, ప్రైవేటు సంస్థల ప్రయోజనాల కోసం వ్యవసాయ కనెక్షన్ల మీద రాయితీని తొలగించాలనుకోవడం, రైతు వ్యతిరేక చట్టాలను రైతు లాభం కోసం అంటూ మాట్లాడటం అంటే కోట్లాదిమంది రైతుల మీద కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న క్రూర పరిహాసం. సహించాల్సిన అవసరం లేదు.

Leave a Reply