Take a fresh look at your lifestyle.

ఎవలి పాట వాళ్ళదే! ముందస్తుకు ముగ్గులే!

‘‘‌విమోచనమైనా ! విలీనమైనా! తెలంగాణ పల్లెలల్ల ఎగిరిన ఎర్రజెండ సమాధి మీద రేపటి ఓట్ల పండుగ పూలు పూయించే గీ దినం జోరుగ పండుగ జేశిండ్లు.ఎవలి ఫాయిదాల లెక్కన గాళ్ళు  మునుగోడు నుంచి ముందస్తు దాంక ముగ్గు బోశిండ్లు. మతం మత్తుమందు సల్లుడైంది. గులాల్‌ ‌బూసుడైంది.చరిత్ర లున్న నిజాలు దాశిపెట్టి, అడ్డగోలు కతలువడ్డోల్లు చరిత్రల కాన్రాకుంట బోయిండ్లనే సత్తెం యెరికైతె సాలు!’’

విలీనం, విమోచన సమైక్యతల పండుగ ఒడిశింది. ఏ మందల గొర్లు ఆ మంద బాట బట్టినయి. దేశబక్తి శివాలూగింది. కండువ పోతరాజులు కనేలు కనేలు మని రంకెలేశిండ్లు. దేశబక్తి పొంగి తెలంగాణ రాజ్జెమంతా యేరులై పారింది. పటేలు పెద్ద పట్వారీలు నిజామోని మెడలు వంచి తెలంగాణ కు పానం బోశిండ్లని బజన పాటలు మాగ పాడిండ్లు. గులాబీ సంకెక్కిన కామ్రేడ్లు అటిటుకాకుంట పైలంగ పండుగ జేసుకున్నరు. పోశెట్టి దొర ఈ పాలి కొత్త బాగోతమాడిండు. జాతీయ సమైక్యమని కొత్త ముచ్చటిడిశిండు.మూడురంగుల జెండెగురేసుడేమోగని రాజ్జెమంత గులాల్‌ ‌జల్లుకోని ముందస్తు పండుగకు ముగ్గు బోశిండ్లు.

విమోచనమేంది!? విలీనమేంది!పోశెట్టి దొర ఆడిచ్చిన కొత్త  బాగోతం జాతీయ సమైక్యత యేంది!?యెవలికేం సమజయిందో గని పండుగైతె జోరుగ నడిశి,ఒడిశింది.ఓడింది మాత్రం అప్పటి త్యాగాల సోయిన్నోళ్ళు. ఎవలి ఫాయిదా యేమున్నదో గని చరిత్ర కమ్మలల్ల నిజాలు తుడిశి,యెవలికి వాళ్ళు వోళ్ళ ఫాయిదాల లెక్కన అబద్దాలు రాశిండ్లు. సప్పట్లు గొట్టిండ్లు. తెలంగాణ పల్లెలల్ల నెత్తుటి వరదలు బారిచ్చి విముక్తైన పది లచ్చల యెకురాల బూములన్నో మళ్ళ దోపిడి  దొరల పాలాయె!మళ్ళ జిక్కిన బూముల తోని మురిశిపోయిన దొరల సంబురం యాది జేసుకునే పండుగ, దొరలకు ఫాయిదా అయిన పండుగ వూరూరున జెండయి ఎగిరింది.బుడ్డగోశి రైతన్న ల సాయుధ పోరు యాదిని మళ్ళోపాలి బొందబెట్టిన  గీ దినం మాగనే సంబురం జరిగింది.

యవుసం పనులు లేని కాలంల ఎన్కట వూళ్ళెపొంటి కతలు జెప్పెటోళ్ళు.శీకటి పడంగ పోచవ్వ  మర్రి కిందనో,పంచాతీ కాడ్నో వూరంత జేరేది.పెద్దమనుషులు జెరంత ఆలిశెంగచ్చి కుర్సీల మీద కూసునెటోళ్ళు. బాలసంతులోల్లు జెప్పే కతలు తక్కువైనంక బీమారపోళ్ళేశే బాగోతులు జోరైనయి.సూడలెగని మస్తుండేది. మంత్రగాడు బాలనాగమ్మను ఎత్తుకపోవుడు,మంత్రగా
ని పూజలు,బాలవర్తిరాజు సముద్రాలు దాటుడు,యుద్దమంటె యుద్దంపో! కండ్లగ్గట్టేది.. రాజు అవుతలోని గుంజి  కత్తితోని నరుకుతె మెడకాయ నుంచి తెగి తల్కాయ దూరంగా ఎగిరి పడేది, అది జూశేటాలకు గజ్జుమని పోరగాండ్ల లాగులు తడిశేటియి. శీటిలు కూయ్యిమనేది. కంటికి రెప్పగొట్టకుంట జూశే వూరంత పెయిజోలి మరిశేది. ఎసొంటి కతయినా తెల్లారగట్ల  మంగలార్తుల కాడికి జేరిందంటె, కొసకచ్చిందని మెల్లంగ లేశెటోళ్ళం.అప్పటికి జోబులల్లేసుకచ్చిన బీడీలొడిశేటియి.సూశిన బాగోతం  గిట్లుండె,గట్లుండెనని ముచ్చట్లు వెట్టుకుంట ఇంటికి శేరేది. ఇసొంటి కతలు మావూర్లె శితం జూశినం.

నిన్నటి దినం పగటీలే గిసొంటి బాగోతాలాడిండ్లు.
పోలీసుదండు దుంకకుంటె, పల్లెలపొంటి.పోలో దాడి జేయకుంటె తెలంగాణా యేడుండేది! నిజామోని మెడలిర్శి,తెలంగాణాకు పానం బోశినం, అని విమోచనం బాట బట్టిన సంగపోళ్ళకు గీ దినానికి యేమన్న సాయితున్నదా! నిజామోని బొందబెట్టనీకే పోలీసుల దోలినమని జెప్పెటోళ్ళకు జరంతనన్న సోయున్న దానుల్లా!? మండుతున్న తెలంగాణల బుడ్డగోశి రైతన్నలు తుపాకులెత్తి దొరల్ని,దేశుముకుల్ని,రజాకార్లను వురికిచ్చి లచ్చల పల్లెల్ల ఎర్రజెండ ఎగురేశిన దినాలు యాది మరిశిండ్లా! బతుకుంటె బలుసాకని దొరలు పట్నాలురికె!నిజామోడు దండం బెట్టి రాజ్జెం చేతుల బెట్టి బాంచనన్నడు.తెలంగాణ విమోచనయింది! జెండా ఎగురేయుండ్రి!.పండుగ జేయుండ్రి! అని కతలు వడే ఏలికలు ఏం జెప్పబట్టిండ్లు!?  నిజాలు బొందబెట్టి మతంమత్తు సల్ల బట్టిండ్లు. నిజామోన్ని దించి తెలంగాణకు సాతంత్రం దెచ్చిన మన బట్టిండ్లు గని ఆ తెలంగాణను ఆగంజేశిండనే నిజామోన్ని జేల్కా న్ల యెందుకేయెలే!? మెడకు తాడెందుకేయలే! వుల్టా గద్దెమీద కూకుండ బెట్టి మళ్ళ పట్టం గడ్తిరి.నిజాం దొర కిరీటం కింద వడ కుంట పైలంగ  జూసుకున్న పటేలు,పెద్ద పట్వారి దొరలు యేం జేశినట్టుల్లా!పల్లె జనం నెత్తురు కండ్ల జూశి,పల్లె జనం మద్దెన మతాల మందు బెట్టి గొర్రె దాటోల్లను జేసుడు కాకపోతె!

ఇందువుల తెలంగాణ ను తురుకోళ్ళ నిజాం చేతుల్నుంచి ఇడిపిచ్చినమని కతలు రేపుమాపచ్చేటి  ఓట్ల పండుగ కోసమాడేటి కొత్త బాగోతమనేది అందరికి సమజయితాంది. దేశంమీద తురుకోళ్ళెవలు!? ఇందువు లెవ్వలు!?తెలంగాణల యేపల్లె మొకాన జూశి అలాయి బలాయితోని ఒక్కవ్వ కడుపుల బుట్టినోళ్ళతీర్గ కలిశుండెటోళ్ళు కాదా!పీరీల పండుగత్తె గా సంబురం జూశేందుకు రొండు కండ్లు సాల్తయా!బక్క రైతుదండు బందూకు బట్టి ఇరువై యేండ్లు మర్లవడ్డది యెవలిమీద! నిజాం,కాశీం రజ్వీ మోశేతి నీళ్ళుతాగే దొరలమీద,పటేల్‌,‌పట్వార్ల మీద,దేశ్‌ ‌ముక్‌ ‌ల మీద కాదానుల్లా! గీలందరెవలుల్లా!ఇందువులు కాదా! తెలంగాణ పల్లెలల్ల జనం నెత్తురు తాగిన ఇసునూర్‌ ‌దేశుముక్‌ ‌రాంచంద్రారెడ్డెవలు! కొంరారం పతాప రెడ్డెవలు!? గీళ్ళెవలి సంక జేరి పల్లెలల్ల నెత్తు
రు బారిచ్చిండ్లు! షేక్‌ ‌బందగీ యెవలు?ముక్దుం యెవలు? షోయబుల్లా యెవలు? గీళ్ళు దొరీర్కం మీద మర్లవడ్డ శెరిత్ర యాది మరిశిండ్లా! రజాకార్ల దోపిడి మీద రాశిండని రొండుచేతులు నరికిందెవలియి?మర్లబడ్డ తుపాకులల్ల తురుకోల్లున్నరు! ఇందువులున్నరు! పదిలచ్చల పల్లెలమీద ఎర్ర జెండెగురేశి, దొరీర్కం నుంచి బయటపడేశిండ్లు.దొరలకు ఎకురాలల్ల బూమి యెట్లచ్చె ననుకుంట గాళ్ళ.బూములల్ల జెండాల నాట్లేశి కళ్ళురుమి జూశె!దోపిడికి యెదురు తిర్గిన ఎండుడొక్కల తెలంగాణ మూల మూలనా సెమట సుక్కల సాగు ఇరువాలు దున్నింది.ఇసిరిసిరి గొట్టేటి గాలికి కొరసు పాడుకుంట,యెర్ర జొన్న కంకులు తలలుపుకుంటా పల్లెపల్లెన గజ్జెగట్టినయి.

పోలీస్‌ ‌దండు తెలంగాణల నిజామోని అంతు సూశేం దుకని జెప్పి మర్లబడ్డ వేలాది మంది తెలంగాణా వీరుల గుండెల మీద తూటాలు దించి, తెలంగాణ మట్టి పొత్తిలల్ల నెత్తుటేర్లు పారిచ్చె!లచ్చల పల్లెలల్ల జనం పంచుకున్న  బూములు మళ్ళ దొరల చేతుల బెట్టె!. వీరుల నెత్తుటి తోని తడిశిన తెలంగాణా ల దోతులూండగ పట్నాలురికిన దొరలు మళ్ళ బేఫికర్‌ ‌గ వాళ్ళ బూములు వాళ్ళ కైనయి.సాయుధ పోరు జేశిన వీరుల పీనుగలు కుప్పల మీద సైన్యం మూడురంగుల జెండా యెత్తి పట్టిన దినం.
విమోచనమైనా ! విలీనమైనా! తెలంగాణ పల్లెలల్ల ఎగిరిన ఎర్రజెండ సమాధి మీద రేపటి ఓట్ల పండుగ పూలు పూయించే గీ దినం జోరుగ పండుగ జేశిండ్లు.ఎవలి ఫాయిదాల లెక్కన గాళ్ళు  మునుగోడు నుంచి ముందస్తు దాంక ముగ్గు బోశిండ్లు. మతం మత్తుమందు సల్లుడైంది. గులాల్‌ ‌బూసుడైంది.చరిత్ర  లున్న నిజాలు దాశిపెట్టి, అడ్డగోలు కతలువడ్డోల్లు చరిత్రల కాన్రాకుంట బోయిండ్లనే సత్తెం యెరికైతె సాలు!
– ఎలమంద

Leave a Reply