Take a fresh look at your lifestyle.

ధరణితో భూములకు భద్రత ఏర్పడినట్టేనా

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లో అవకతవకలనూ,అవినీతినీ అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రారంభించింది.ఈ పోర్టల్ దేశానికే తల మానికమని ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభివర్ణించారు. రెవిన్యూ శాఖలో అవినీతి గురించి ఇటీవల పుంఖానుపుంఖాలుగా కేసులు నమోదయ్యాయి. కోటి రూపాయిలు పైగా లంచం తీసుకుంటూ ఒక తహసిల్దార్ పట్టుబడిన ఉదంతం తెలంగాణలో ఇటీవల ఎంత సంచలనాన్ని రేపిందో, జైలులో అతడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా అంతకన్నా ఎక్కువ సంచలనాన్ని సృష్టించింది. తన భర్త ఆత్మహత్య చేసుకోలేదనీ, అతడి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆ తహసిల్దార్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆవేదనను ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. ఏమైనా భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ఎంఆర్ ఓలనూ, తహసిల్దార్ లనూ లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో ఇటీవల అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొత్తగా ప్రారంభించిన ధరణి పోర్టల్ లో భూముల రిజిస్ట్రేషన్ ఎవరికీ ఒక పైసా ఇవ్వక్కరలేకుండా పదిహేను నిమిషాల్లో పని పూర్తి చేసుకోవచ్చని కేసీఆర్ అంటున్నారు. అది అమలులోకి వొస్తే అంతకన్నా భూయజమానులకు కావల్సిందేమీ లేదు. భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ఒక్క తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో బలమున్నవాడిదే రాజ్యం అన్న ధోరణిలో జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. భూ సంస్కరణలు ఎన్నికల నినాదంగా మిగిలిపోయింది. వాటిని అమలు జరిపిన పీవీ నరసింహారావు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అయితే, భూ సంస్కరణలతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన పీవీ ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశానిర్దేశం చేశారు.

ఆర్థిక సంస్కరణల పితామహునిగా ఇప్పటికీ ప్రశంసలను అందుకుంటున్నారు. ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తూ భూముల క్రమబద్దీకరణ, సంస్కరణల గురించి దేశం మొత్తం మీద సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నది పీవీయేనని ప్రశంసించారు. అది అక్షర సత్యం. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగంలో ఇంతవరకూ భూమి వ్యవసాయానికి ఉపయోగ పడేదిగా మాత్రమే పరిగణించడం జరిగిందనీ, ఇప్పుడు దీనిని ఒక ఆస్తిగా పరిగణిస్తున్నారనీ, ఆస్తులను కాపాడుకోవడానికి ఇతర విధాల చట్టాలున్నట్టే, భూమిని కాపాడుకోవడానికి ధరణి పోర్టల్ తీసుకుని వొచ్చామని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కూడా రిజిస్ట్రేషన్ చేయించే మహానుభావులు తయారన్న ఆయన మాటల్లో అసత్యం లేదు. అలాగే,ఒకే భూమిని ముగ్గురు నలుగురికి విక్రయించే ఘనులు కూడా ఉన్నారు.ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ధరణి పోర్టల్ ఉపయోగ పడుతుందన్నది ఆయన వివరణ.అయితే, భూసంస్కరణల వల్ల కోల్పోయిన భూములను తిరిగి దక్కించుకునేందుకు బడా భూస్వాములు ఒత్తిడి తేవడంతో ధరణిని ప్రారంభించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇది దేశానికి ట్రెండ్ సెట్టర్ గా కేసీఆర్ అభివర్ణిస్తున్నప్పటికీ, దీని ప్రయోజనాలు సాకారమైనప్పుడే అంత పెద్ద మాటలు మాట్లాడాలి. మన వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.అలాగే,వాటిని అడ్డుకునే కుయుక్తులూ జరిగాయి.ఇప్పటికీ జరుగుతున్నాయి.

అవినీతిని పూర్తిగా నిర్మూలించడం పాలకులకు సాధ్యం కావడం లేదు.అది పాలకులకు పెను సవాల్ గా తయారైంది. కేసీఆర్ ఈ విషయంలో ఎంతవరకూ విజయం సాధిస్తారనేది వేచి చూడాల్సిందే. పెద్ద భూస్వాములు తమ భూముల జోలికి వొచ్చిన ప్రభుత్వాలను పడగొట్టిన సందర్భాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అలనాడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ప్రభుత్వాన్నీ, 1972లో పీవీ నేతృత్వంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టింది బడా భూస్వాములేనన్నది జగమెరిగిన సత్యం. భూమిపై హక్కు కోసం కమ్యూనిస్టు పార్టీలు దశాబ్దాలుగా జరుపుతున్న అన్ని చోట్లా ఫలించలేదు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఆ పోరాటాల ఫలితాలనిచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా నవంబర్ 2వ తేదీ నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వెంటనే పూర్తి అయ్యేందుకు ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది. రెవెన్యూ శాఖలో దీన్నొక నవశకంగా అభివర్ణిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికీ, పారదర్శంగా ఉండేందుకు దీనిని తీసుకుని వొచ్చినట్టు చెబుతున్నారు. . ఇక మీదట తెలంగాణలో వ్యవసాయ భూములన్నీ ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌‌తోపాటు మ్యుటేషన్ కూడా జరిగే విధంగా ధరణి వెబ్ సైట్లో మార్పులు చేశారు. ఎమ్మార్వో ఆఫీసులో 15 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 570 ఎమ్మార్వో కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. అందుబాటులోకి వొచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భూములను భద్రపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ ఆశించిన మేరకు లక్ష్యాలను సాధిస్తే అంతకన్నా కావల్సిందేమీ లేదు. ముఖ్యంగా,సన్నకారు, చిన్న రైతుల భూములను కాపాడేందుకు ఇది ఉపయోగ పడితే ముమ్మాటికీ ఇది గొప్ప విజయమే.

Leave a Reply