Take a fresh look at your lifestyle.

తిలా పాపం …!

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మళ్ళీ చేపట్టేందుకు నిరాకరిస్తున్నా, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలూ, ఆరోపణలు చేయడానికి వెనకాడటం లేదు. రోజూ ఏదో అంశంపై ఆయన అస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆయన మోడీ విధానాల వల్ల ఐదు సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయంటూ ఆరోపించారు. ఆయన విమర్శలు నిరాధారం కాదు, వాటిల్లో హేతు బద్దత లేకపోలేదు. మోడీ పెద్ద నోట్లను రద్దు చేయడం వ ల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోయిందనీ, దానినుంచి బయట పడకుండానే వృత్తి, సేవ పన్ను (జిఎస్ టి)ని ప్రవేశపెట్టి వాణిజ్య రంగాన్ని అతలాకుతలం చేశారని అన్నారు. ఈ రెండు చర్యల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి కుదేలు అయిందన్న ఆయన మాటలను పూర్తిగా కొట్టివేయలేం. ఆయన ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, నైపుణ్య భారత్, వంటి కార్యక్రమాల వ ల్ల దేశంలో మేలు జరిగింది అంతంత మాత్రమే. దేశంలో నిరుద్యోగిత 47 ఏళ్ళ కనిష్టానికి పడిపోయింది. చిన్న పరిశ్రమ లకు చేయూతనందించేందుకు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఈ)లకు అందుతున్న సాయం అంతంత మాత్రమే. ఇప్పుడు కొరోనా కారణంగా గడిచిన ఆరు నెలలుగా ఉత్పత్తి స్తంభించింది. పరిశ్రమలు మూత పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సౌకర్యాలు కరువ య్యాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ప్రకటించే రాయితీలు, ప్యాకేజీలు పేదవారికి కాకుండా, పెద్ద వారికి మాత్రమే సాయాన్ని అందిస్తున్నాయి. మోడీ సదుద్దేశ్యంతోనే మంచి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఉండవచ్చు.

జిఎస్ టి మంచిదే అది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి నలుగుతున్న అంశం. అయితే, పన్నుల శ్లాబుల నిర్ధారణలో ప్రభుత్వం హేతుబద్దంగా వ్యవహరించకపోవడం వల్ల జిఎస్ టిలో ఎగవేతలు బాగా పెరిగాయి. మరో వంక విద్యుత్ ప్రాజెక్టుల కోసం, ఇతర పరిశ్రమల కోసం బడా పారిశ్రామిక వర్గాలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం లేదు. గతంలో పన్నులు ఎగవేసిన వారి పట్ల మోడీ ప్రభుత్వ ఉదార వైఖరిని ప్రదర్శిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. మొండి బకాయిలు యూపీఏ హయాంలో మూడు లక్షల కోట్లు ఉండగా,ఇప్పుడు అదనంగా లక్షా ఏభైవేల కోట్లు వచ్చి చేరాయి. పారిశ్రామిక రంగంపై కొరోనా ప్రభావం సామాన్యమైనది కాదు. కొరోనా వల్ల మన దేశంలోనే ఎక్కువ మంది మరణించారన్న రాహుల్ వ్యాఖ్యల్లో అర్ధ సత్యం ఉంది. నిజానికి అమెరికా , బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా కొరోనా మరణాలు ఎక్కువ శాతం ఉన్నాయి. మన దేశంలో కొరోనా రికవరీ ఎక్కువగా ఉంది. మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో అప్పటికప్పుడు తాత్కాలిక చిట్కాలతో కాలం గడుపుతోందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా విమర్శించారు.అయితే, చిదంబరం గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలకు కల్పించిన వెసులుబాట్లు, ఇచ్చిన రాయితీల కారణంగానే దేశం ఆర్థికంగా కుంగింగదన్నది నిపుణుల అభిప్రాయం. మన దేశంలో పారిశ్రామిక సంస్థలు ఎదగకపోవడానికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం (క్రోనీ కేపటలిజం) కారణం.

ఆర్థిక సంస్కరణలు, సరళీకృత ఆర్థిక విధానాల వల్ల దేశంలో పన్ను ఎగవేత దారుల సంఖ్య పెరిగింది. ఇందుకు ఏ ఒక్క ప్రభుత్వానిదో బాధ్యత కాదు. తిలాపాపం మాదిరిగా అందరిదీ ఇందుకు బాధ్యత ఉంది. మోడీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ కూటమి పదేళ్ళ పాలనలో ఈ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం శాఖోపశాఖలుగా విస్తరించిందనీ, తాను దీనిని పూర్తిగా నిర్మూలిస్తానని వాగ్దానం చేశారు. కానీ, ఆరేళ్ళు గడుస్తున్నా అది ఆయన వల్ల కాలేదు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్ల పెద్ద పారిశ్రామిక కుటుంబాలకే ఎక్కువ ప్రయోజనం కలిగింది. చిన్న పారిశ్రామిక వేత్తలు, మధ్యతరగతి వర్గాలకు చెందిన పారిశ్రామిక యూనిట్లకు ప్రచారం తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదు. వృద్ధి రేటులో కుంగు బాటుకు మోడీ ప్రభుత్వానిది మాత్రమే బాధ్యత అని రాహుల్ చేసిన విమర్శలో పూర్తి నిజం లేదు. యూపీఏ పదేళ్ళ పాలనలో సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు అందరూ తలోవైపునకూ లాగడం వల్ల ఆర్థిక రథం ఎటు పయనించాలో తెలియని స్థితిలో ఊబిలో కూరుకుని పోయింది. స్పెక్ట్రమ్, బొగ్గు, తదితర కుంభకోణాలు దేశ ఆర్థిక రంగం మూలుగులను పీల్చి వేశాయి. ఇప్పుడు అంతగా లేకపోయినా, గతంలో పన్నుల ఎగవేతకు అలవాటు పడిన వారు యధేచ్ఛగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు.

పరిశ్రమలకు రాయితీలు, భూములు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నా, వాటి యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఈ కారణంగానే పరిశ్రమల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న నినాదం బయలు దేరింది. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న వారు ఆయా అవసరాలకు ఉపయోగించడం లేదు. ఈ సమస్య అన్ని రాష్ట్రాలలో ఉన్న మాట నిజమే అయినా, అధికార పార్టీ ఎంపీలు, అధికార పార్టీతో సన్నిహితంగా ఉండే ఇతర పార్టీల ఎంపీల పైరవీల కారణంగా మౌలిక సదుపాయాల దుర్వినియోగమవుతున్నా కేంద్రం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఇది యూపీఏ హయాంలోనూ నెల కొంది. రాహుల్ లేవనెత్తిన అంశాల్లో వాస్తవికత ఉన్నా, ఆ రుగ్మతలన్నీ మోడీ హయాంలోనే వచ్చాయనడం సరికాదు. అన్నింటికీ పెద్ద నోట్ల రద్దు, జిఎస్ టి వంటి చర్యలే కారణమనడం కూడా పూర్తిగా న్యాయం కాదు. అన్నింటినీ మించి కొరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్న వాస్తవాన్ని విస్మరించరాదు.

Leave a Reply