Take a fresh look at your lifestyle.

వరవరరావు విషయంలో మీ మానవీయ స్పందన ఎక్కడ కేసీయార్‌ ‌గారూ…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి,నమస్కారం.

Sajayaఒక పదిహేనేళ్ళు వెనక్కి వెళితే సెప్టెంబర్‌ 3, 2005‌న తెలంగాణ ప్రాంతీయ పార్టీ నాయకుడిగా, ఒక చారిత్రాత్మకమైన ఘటనకు మీరు అడుగు ముందుకు వేశారు. బహుశా మీకు గుర్తుండే వుంటుందనుకుంటాను. యుపిఎ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వున్న మీరు, చెంచల్‌ ‌గూడా జైలులో వున్న విప్లవ రాజకీయ ఖైదీ వరవరరావుని  కలవటానికి  చొరవ చేయటమనేది ఒక అపురూపమైన దృశ్యంగా మేమంతా భావించాం. ఆయన నమ్మిన రాజకీయ విశ్వాసాలు వేరు. మీ రాజకీయ ఆలోచనా ధోరణులు వేరు. భిన్నరాజకీయ దృక్పథాలు మీవి. ఆయన నమ్మే రాజకీయాలను మీరు అంగీకరించకపోవచ్చు. మీ ఇద్దరి రాజకీయ ధోరణులపై మాలాంటి హక్కుల కార్యకర్తలకు అంగీకారం ఉండకపోవచ్చు.  ఆయన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు ఊపిరిపోసిన మొదటి దశ 1968 ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. బహుశా ఆయనలాంటి వ్యక్తులు ఆనాటినుంచీ పనిచేసి ఉండకపోతే ఇప్పటి ఈ ప్రత్యేక రాష్ట్రానికి జవజీవాలు ఉండేవి కావేమో! వరవరావుని కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కూడా చేసి చూడలేం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో కానీ, దేశవ్యాపితంగా, ఖండాంతరాలలో హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలతో పాటు ఒక కవిగా గొంతెత్తి వారికి అండగా సంఘీభావంగా నిలబడిన వ్యక్తి అని మీకు తెలియనిది కాదు.  ఇప్పుడు మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి.  అయితే, ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం, ప్రజాఉద్యమాలలో నిరంతరం తన జీవితాన్ని గడిపిన ఆ వ్యక్తి ఈరోజు ఎక్కడ వున్నారు? విచారణ ఊసే లేకుండా కాలయాపన చేస్తున్న ఒక కేసులో మహారాష్ట్ర  తలోబా  జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం 2018 నవంబర్‌ 17‌న  ఆయన్ని, మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ గడ్డ మీద ఎలా అరెస్టు చేసిందీ, జైలుకి ఎలా తీసుకువెళ్లిందీ అంతా మీకు తెలియకుండా జరిగింది కాదు కదా! చిరునవ్వుతో జైలుకి వెళ్ళిన ఆయన ఆరోగ్యం ఈ రెండేళ్లలో ఎంత దిగజారిపోయిందీ, వృద్ధాప్య సమస్యలు, కరోనా పాండమిక్‌ ‌లో కిక్కిరిసిన ఆ జైలులో వైరస్‌ ‌బారిన పడటం, దేశ విదేశాల నుంచీ ప్రజలు వత్తిడి పెడితే గానీ కనీసం హాస్పిటల్లో చేర్పించకపోవటం..ఈ  వివరాలన్నీ ఎప్పటికప్పుడు మీకు అందుతున్నాయని కూడా మాకు తెలుసు. ఆ సందర్భంగా ఆయన భార్య హేమలత మీకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. అది కూడా మీరు చదివే వుంటారు. కానీ, పదిహేనేళ్ల క్రితం ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌గారి మార్గదర్శకత్వంలో మీరు మీ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఆయనను జైలులో కలవటం ద్వారా ఇతర రాజకీయ వర్గాలకు పంపిన సంకేతాలూ, చూపిన ఆ చొరవ, ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీ వున్న రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎందుకు చేయలేకపోతున్నారనేది మా ముందు వున్న ప్రశ్న. అప్పుడు మీరు కలిసినప్పుడు ఆయన ఏ రాజకీయ విశ్వాసాలతో వున్నారో ఇప్పటికీ ఆయన అదే ప్రజాస్వామ్య ఆకాంక్షలకు కట్టుబడే వున్నారు. అప్పుడూ ఇప్పుడూ ఆయన అదే వరవర రావు. ఆయన మీ రాజకీయ విశ్వాసాలకు భిన్నమైన ఆలోచనలతో వున్న వ్యక్తి అని తెలిసినప్పటికీ ఒక రాజకీయవేత్తగా మీరు చూపించిన ఆ చొరవ, హుందాతనం ఇప్పుడు కనీసం ఒక ప్రకటనకైనా ఎందుకని కనిపించటంలేదు? ఆయన విడుదల కోసం, లేదా కనీసం ఆయన వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా బెయిల్‌ ‌రావటానికో మీ నుంచీ ఎందుకు స్పందన వుండటం లేదనే బాధ, ప్రశ్న మాలాంటి ఎందరికో వుంది.
రెండేళ్లుగా అనేకమందిమి వ్యక్తులుగా, చిన్న సమూహాలుగా ఆయన విడుదల కోసం వివిధ రూపాల్లో నినదిస్తూనే వున్నాం. వరవరరావుకి సంబంధించి అన్ని వివరాలూ మీ దగ్గర ఉన్నప్పటికీ పరిస్థితి మరింత సరళంగా అర్థం కావటం కోసం ఒక చిన్న కవుల బృందం  ప్రకటించిన కవితను మీ కోసం, మీ చుట్టూ వున్నవారి కోసం, అన్నిటికీ మించి అశేష తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవటం కోసం ఆ నాలుగు వాక్యాలను ఇక్కడ ఇస్తున్నాను.

వరవరరావు ఒక అండర్‌ ‌ట్రయల్‌
ఆయన విచారణకు అర్హుడు
ఏ న్యాయ విచారణ జరగలేదు.

వరవరరావుకి ఆరోగ్యం క్షీణించింది

ఆయన వైద్యసహాయానికి అర్హుడు
ఎలాంటి సహాయం అందడం లేదు.

వరవరరావు ఎనభయేళ్ళ వయోవృద్ధుడు
ఆయనకి సహాయకుల అవసరం తప్పనిసరి
ఎవరినీ అనుమతించడం లేదు.

వరవరరావు ఒక అక్రమ కేసులో
జైలులో మగ్గుతున్న రాజకీయ ఖైదీ
ఆయన బెయిల్‌ ‌కు అర్హుడు
కానీ నిరాకరిస్తూనే ఉన్నారు.

జీవించే హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు
అండర్‌ ‌ట్రయల్‌ ‌కూడా ఈ దేశ పౌరుడే
వైద్య సేవలు నిరాకరించడం
పౌరుల ప్రాథమిక హక్కుకు భంగకరం

పైన పేర్కొన్నవన్నీ రాజ్యాంగం కల్పించిన హక్కులు. నేరారోపణలతో ఖైదులో వున్నంత మాత్రాన వారికి ఏ హక్కులూ వర్తించవు అనేలా ప్రభుత్వ వ్యవస్థలు ప్రవర్తించటం అంటేనే ప్రజల మనుగడ ప్రమాదంలో పడినట్లు కదా?  రెండేళ్ల నుంచీ వరవరరావుకి సంబంధించి జైలులో ఇదే జరుగుతోంది. ఒక వ్యక్తి ఏ కారణం చేత జైలు పాలయినా గానీ, ఆ వ్యక్తి  బెయిల్‌ ‌పొందటం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. బెయిల్‌ అం‌టేనే షరతులతో కూడినది. చట్టప్రకారం నిర్దేశించిన సమయంలో అతి సహజంగా జరగాల్సిన న్యాయ ప్రక్రియ. కానీ, ఇక్కడ అసలు విచారణే లేకుండా కావాలనే కాలయాపన చేస్తున్నారని నిస్పక్షపాతంగా గమనిస్తున్న ఎవరికైనా అర్థమవదా!?

2002 సంవత్సరం గుజరాత్లో మతోన్మాదంతో అనేకమందిని చంపానని ఒప్పుకున్న వ్యక్తికే  అనారోగ్య కారణాల రీత్యా బెయిల్‌ ‌మంజూరు చేసిన న్యాయస్థానాలు, అసలు ఆధారాలే  లేని ఆరోపణలతో ఖైదు పాలయి, అనారోగ్యంతో వున్న ఎనభై ఏళ్ల వృద్దుడి బెయిల్‌ ‌పెటిషన్‌ ‌ని విచారించటానికి కూడా సరైన సమయం పెట్టకపోవటం అంటే అర్థం ఏమిటి? ఆ కోర్టు కాదు ఈ కోర్టు అంటూ కుటుంబ సభ్యుల్ని మానసికంగా వేధించడం ఏ రకమైన సంస్కృతి? సంవత్సరాలు గడిచినా కేసు విచారణకు రాదు. ఆరోపణలు చేసిన సంస్థకు ఇంకా సమయం ఎంత కావాలో తెలియదు. విచారణ ఎప్పుడు మొదలవుతుందో, అసలు మొదలవుతుందో లేదో కూడా తెలియదు. విచారణ లేకుండా సంవత్సరాల తరబడి చేసే జాప్యం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యే అనటానికి మీకైనా, మాకైనా, ఎవరికయినా మొహమాటం ఎందుకు?

ఇది కేవలం వరవరరావుకో, ఆయనతో పాటుగా అరెస్టు అయిన వారికో మాత్రమే సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రాథమిక హక్కులనేవి సార్వజనీనం.  ప్రజల సామాజిక స్థితిగతులతో, హోదాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ వర్తించే అంశాలని తెలంగాణ రాష్ట్ర పాలకుడిగా ప్రభుత్వంలో వున్న మీకు తెలియని విషయం కాదు. రాజకీయ భిన్నాభిప్రాయాలను గౌరవించడం ఒక ప్రజాస్వామిక లక్షణం.కానీ, కేంద్ర ప్రభుత్వం, తమకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారిమీద అధికారాన్ని ఉపయోగించుకుని ఏ చట్టబద్ధమైన అంశానికీ విలువివ్వకుండా కక్ష సాధింపుగానే ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారనేది చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలిగిన విషయం. మీకు అర్థం కాని విషయమని నేను అనుకోను.

కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలని కుట్ర పన్నారని దేశంలో అనేకమందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ‘రాజు తలు చుకుంటే దెబ్బలకు కొదవా’ అన్న చందంగా తయారైంది పరిస్థితి. రాజకీయ భిన్నాభిప్రాయాలున్నవారిని వివిధ ఆరోపణలతో జైలు పాలు చేయటం అనేది చరిత్రలో మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అయితే, అలా ఖైదు చేసిన వారిమీద కక్షపూరితంగా ప్రాధమిక హక్కుల అమలును కూడా విస్మరిస్తే, వారు అనారోగ్యంతో చనిపోయే పరిస్థితి కల్పించడం అంటే కావాలని చేస్తున్న, చేయబోతున్న కస్టోడియల్‌ ‌హత్యగానే భావించాలి. బహుశా, జరుగుతున్న దాన్ని రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించినా నిర్బంధాన్ని ఏదో ఒకరూపంలో ఎదుర్కోవాల్సి వస్తుందనేది మాలాంటి సామాజిక కార్యకర్తలకు అర్థమయిన ప్రశ్నే.

కానీ, ఒక తెలంగాణ ఆకాంక్షకు వ్యక్తిగా, కవిగా, ఉపన్యాసకుడిగా, వ్యవస్థగా, బలమైన పునాదిగా నిలబడిన నిలువెత్తు ఉత్తేజానికి, ఏ స్పందనా లేకుండా ప్రభుత్వంగా మీరు మీ నిశ్శబ్దంతో అందివ్వబోతున్న కానుక ఇది. మీ ఈ నిశ్శబ్దం ఇలానే కొనసాగితే ఎప్పటికైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సమాజంలో మాయని మచ్చగా నిలబడబోయే అంశం తొందరలోనే జరగొచ్చు. కానీ, ఇప్పటికైనా మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వనేతగా  తలచుకుంటే, దానిని తప్పించే అవకాశం వుంది. దేనినైనా, చరిత్ర అన్నిటినీ నమోదు చేస్తుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply