Take a fresh look at your lifestyle.

సచివాలయ నల్లపోచమ్మ విగ్రహం ఎక్కడ?

కూల్చివేతలో ఆలయ ధ్వంసంతో అనుమానాలు
పూర్తయిన కూల్చివేత కార్యక్రమం

తెలంగాణ పాత సెక్రటేరియట్‌ ‌కూల్చివేత తర్వాత అక్కడ ధ్వంసమైన ఆలయంలోని పురాతన నల్ల పోచమ్మ విగ్రహం ఎక్కడ ఉందన్న అనుమానాలు బయలుదేరాయి. విగ్రహానికి నిత్యపూజలు జరగాల్సి ఉన్నందున దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజంగానే ఆలయ పూజారితో సహా ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రోజూ విగ్రహానికి నిత్యపూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? లేదా అని ఆరా తీస్త్తున్నారు. అలా చేయకపోతే అరిష్టమని పండితులు అంటున్నారు. కొత్త సెక్రటేరియట్‌ ‌నిర్మాణంలో భాగంగా పాత సచివాలయాన్ని నేలమట్టం చేశారు. అదే సమయంలో నల్లపోచమ్మ గుడిని కూల్చేశారు. సచివాలయ భవనాలు కూల్చేస్తుండగా శిథిలాలు పడడంవల్ల పోచమ్మ గుడి దెబ్బతిందని..అందుకే కూల్చాల్సి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గుడిని కూల్చేముందు సరైన పూజాది కార్యక్రమాలు నిర్వహించి విగ్రహాన్ని కదిలించాలి. కూల్చివేత సమయంలో ఆలయంలో ప్రతిరోజూ పూజలు నిర్వహించే పూజారులకు తెలియకుండా గజ్వేల్‌కు చెందిన పూజారులతో పూజలు చేయించి విగ్రహాన్ని కదిలించి మరోచోటికి తరలించారు.

ఆ విగ్రహాన్ని కదిలించే ముందు సరైన పూజాది కార్యక్రమాలు నిర్వహించారో.. లేదో.. ఆ విగ్రహం ఎక్కడుందో తెలియదని నల్లపోచమ్మ ఆలయ పూజారులు అంటున్నారు. దీనికి సంబంధించి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్‌లు వేసినా..తర్వాత గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో యుద్ధప్రాతిపదికన పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు చేపట్టి సోమవారం పూర్తిచేశారు. సచివాలయంలో ఉన్న మొత్తం 11 బ్లాక్‌ల కూల్చివేతల్లో భాగంగా సోమవారం చివరగా ఎల్‌ ‌బ్లాక్‌ను కూల్చివేశారు. ఇక, శిథిలాల తొలగింపు పక్రియ కొనసాగుతోంది. శిథిలాల నుండి ఇనుము, కంకర, అల్యూమినియం, ఇతర సామాగ్రిని వేరే చేస్తున్నారు.  వ్యర్థాల తొలగింపుకు మరో నెల రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన కొత్త డిజైన్లకు ఇప్పటికే కేబినెట్‌ ‌కూడా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాణం కోసం 400 కోట్లు పాలనా అనుమతులను కూడా ఇచ్చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!