Take a fresh look at your lifestyle.

రాష్ట్ర బడ్జెట్‌ ‌లో బిసి ల స్థానం ఎక్కడ

‘‘‌గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో  ఎంత తక్కువ నిధులు కేటాయిస్తుందో అర్థమవుతుంది. రాష్ట్ర బడ్జెట్‌ ‌లో కేటాయింపులు తక్కువగా ఉండటమే కాదు కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదనేది వాస్తవం.’’

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం తన పదవ వార్షిక బడ్జెట్‌ ‌ని ప్రవేశపెట్టబోతుంది. 2015 తర్వాత లక్ష కోట్ల రూపాయలు దాటిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ‌మూడు లక్షల కోట్ల రూపాయలకు చేరుకోబోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గా రాష్ట్రంలో బలహీన వర్గాల జనాభా 52 శాతం ఉంటే బడ్జెట్‌ ‌లో బలహీన వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి కేటాయిస్తుంది మాత్రం కేవలం మూడు శాతం కంటే తక్కువ నిధులు అనేది వాస్తవం. మేమెంతో మాకు అంత వాటా బీసీలు సగం బీసీలకు సగం అవకాశాల లో సగం ఆర్ధికంలో సగం అని బీసీలు నినదిస్తున్నా సమైక్యాంధ్రప్రదేశ్‌ ‌నుండి స్వరాష్ట్రం వరకు బడ్జెట్‌ ‌లో నిధుల కేటాయింపు లో బీసీలకి అన్యాయం జరుగుతూనే ఉంది. .రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌ ‌లో నిధులు కేటాయించకుండా వారి అభివృద్ధికి పథకాలు ప్రణాళికలు విధానాలు ఏ విధంగా రూపొందిస్తారో ప్రభుత్వాలే చెప్పాలి. బీసీలు వోట్లు వేసే వర్గాలు గా భావిస్తున్న పాలక ముఠాలు బీసీల సంక్షేమం అభివృద్ధి అజెండా ముందుకు రాకుండా బడ్జెట్లలో నిధులు కేటాయించకుండా తొక్కి పెడుతున్నాయనేది  వాస్తవం. బీసీలు సాధారణ అభివృద్ధిలో భాగంగానే అభివృద్ధి చెందాలి తప్ప వారి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు పథకాలు అక్కర్లేదని ప్రభుత్వం భావిస్తుంది.

బడ్జెట్‌ ‌లో నిధులేవి..
బీసీలు జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ కానీ బడ్జెట్‌ ‌లో నిధుల కేటాయింపు మాత్రం మూడు శాతం కంటే తక్కువ అంటే బడ్జెట్‌ ‌లో తక్కువ నిధుల కేటాయింపు ద్వారా బీసీల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనే ప్రభుత్వం మాటలను ఎలా విశ్వసించగలుగుతాం..? 2020-21 బడ్జెట్‌ 1.82 ‌లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే బీసీల సంక్షేమానికిప్రభుత్వం కేటాయించింది కేవలం 4356 కోట్ల రూపాయలు. 2021- 22 బడ్జెట్‌ 2.30 ‌లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే బీసీల సంక్షేమానికి కేటాయించింది 5522 కోట్ల రూపాయలు.. అలాగే 2022-23 బడ్జెట్‌ 2.56 ‌లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే బీసీల సంక్షేమానికి కేటాయించింది కేవలం 5697 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల సంక్షేమానికి బడ్జెట్‌ ‌లో  ఎంత తక్కువ నిధులు కేటాయిస్తుందో అర్థమవుతుంది. రాష్ట్ర బడ్జెట్‌ ‌లో కేటాయింపులు తక్కువగా ఉండటమే కాదు కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదనేది వాస్తవం. 2023- 24 బడ్జెట్‌ 3 ‌లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఈ బడ్జెట్‌ ‌లో కూడా బీసీల సంక్షేమానికి ఏ 6000 కోట్ల రూపాయలో కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకునే అవకాశం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో బీసీల జనాభా తక్కువగా ఉన్నా  రెండు రాష్ట్రాల బడ్జెట్‌ ‌సమానంగా ఉన్న బీసీల సంక్షేమం కోసం గత సంవత్సరం బడ్జెట్‌ ‌లో ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలను కేటాయించింది.. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో నిధులు కేటాయించటానికి చేతులు రావడం లేదు.

కార్పొరేషన్‌ ‌ల నిర్వీర్యం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత బీసీ కార్పొరేషన్‌ ‌కొత్తగా ఏర్పాటు అయిన ఎంబీసీ కార్పొరేషన్లు నిధులు లేక నిర్వీర్యం అయిపోయినాయి. ప్రస్తుతం ఈ కార్పొరేషన్లు నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. 2021 -22 బడ్జెట్‌ ‌లో బీసీ కార్పొరేషన్‌ ‌కి 500 కోట్ల రూపాయల కేటాయిస్తే 2022-23 బడ్జెట్‌ ‌లో మాత్రం బీసీ కార్పొరేషన్‌ ‌కి నిధులను 300 కోట్ల రూపాయలకు తగ్గించారు. అలాగే ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటైన 2017 -18 బడ్జెట్‌ ‌లో 1000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ కార్పొరేషన్‌ ‌కి వరుసగా మూడు బడ్జెట్లల లో 3000 కోట్ల రూపాయలను కేటాయించినా ఆ నిధులను ప్రభుత్వము ఖర్చు చేయలేదు. 2021- 22 బడ్జెట్‌ ‌లో 500 కోట్ల రూపాయలు 2022- 23 బడ్జెట్‌ ‌లోఎంబీసీ కార్పొరేషన్‌ ‌కి 300 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. బీసీ ఎంబీసీ కార్పొరేషన్లకు కేటాయిస్తున్న నిధులను బడ్జెట్లలలో క్రమంగా తగ్గించడమే కాదు కేటాయించిన బడ్జెట్‌ ‌నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదనేది ప్రభుత్వ గణాంకాలు తేట తెల్లం చేస్తున్నాయి. బీసీ ఎంబీసీ కార్పొరేషన్‌ ‌ల కి నిధుల కేటాయింపులో ప్రభుత్వం యొక్క ఉదాసీన  వైఖరి వల్ల కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోతున్నాయి.

ఫెడరేషన్‌ ‌లపై చిన్న చూపు
రజక నాయి బ్రాహ్మణ మేదర కుమ్మరి బట్రాజు వాల్మీకి వడ్డెర సగర పూసల విశ్వబ్రాహ్మణ మత్స్య గౌడ లాంటి 12 కులాలకు ఆ కులాల అభివృద్ధి కోసం ఫెడరేషన్లు ఏర్పాటు చేసినారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరొక ఆరు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. 2021 -22 బడ్జెట్‌ ‌లో ఫెడరేషన్లకి ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించలేదు.. కానీ 2022 -23 బడ్జెట్‌ ‌లో మాత్రం కార్పొరేషన్‌ ‌లకి సింగిల్‌ ‌డిజిట్‌ ‌లో నిధులు కేటాయించటం  ఆయా వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.
కార్పొరేషన్‌ ‌ల  పరిస్థితి ఇలా ఉంటే బీసీ వృత్తిదారులకు స్వయం ఉపాధిపై జీవించే వారికి ఇచ్చే వ్యక్తిగత సబ్సిడీ రుణాలను 2017 నుండి ప్రభుత్వం నిలిపివేయటం వలన బీసీలకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. గతంలో బీసీ కార్పొరేషన్‌ ‌ద్వారా బీసీలకు వ్యక్తిగత రుణాలు అందించేవారు కానీ బీసీ కార్పొరేషన్‌ ‌కి బడ్జెట్‌ ‌నిధులు తగ్గించటం కేటాయిస్తున్న నిధులు నిర్వహణ వ్యయానికి కూడా సరిపోకపోవడం వలన బీసీలకు ఇచ్చే వ్యక్తిగత సబ్సిడీ రుణాలు నిలిపివేయబడినాయి.

ఫీజు రీయింబర్స్మెంట్‌ ‌జాడేది
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ‌లో బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించడం వలన ఉన్నత విద్య అభ్యసిస్తున్న బీసీ విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిగా ఫీజులు రియంబర్స్మెంట్‌ ‌చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్‌ ‌చెల్లింపు లో ఆంక్షలు పెట్టడం వల్ల అనేకమంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులను కొనసాగించలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ‌చదివే బీసీ విద్యార్థులకు మాత్రమే ర్యాంకుల ఆధారంగా ఫీజులు చెల్లిస్తున్నారు. ఎంసెట్‌ ‌లో పదివేల కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం కేవలం 35 వేల రూపాయల ఫీజు మాత్రమే చెల్లించి ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల తన వివక్షతను ప్రదర్శిస్తుంది. ఒక్కతెలంగాణ రాష్ట్రం మాత్రమే బీసీ విద్యార్థులకు ఫీజు చెల్లించడంలో ఆంక్షలు పెడుతుందనేది వాస్తవం.   పూలే విదేశీ విద్యా జ్యోతి పథకం ద్వారా బీసీ విద్యార్థులను విదేశాలలో విద్యను అభ్యసించడానికి ప్రతి సంవత్సరం కేవలం 300 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయటం వలన సగటున కులానికి ఇద్దరు విద్యార్థులకు కూడా అవకాశం దొరకటం లేదు కాబట్టి  పథకం  ఉద్దేశాలు నెరవేరక పోగా ఈ పథకం ద్వారా బీసీలకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల సంక్షేమం పట్ల నిబద్ధత చిత్తశుద్ధి ఉంటే చేపలు గొర్రెల పంపిణీ సెలూన్లకు దోబీ ఘాట్లకి ఉచిత విద్యుత్తు గురుకులాల ఏర్పాటు ఆత్మగౌరభవనాల నిర్మాణమే కాదు బీహార్‌ ‌రాష్ట్రం చేపట్టినట్లు బీసీ కుల గణనతో  పాటు బీసీలకు సబ్‌ ‌ప్లాన్‌ ‌ప్రకటించి రాబోయే బడ్జెట్‌ ‌లో ఇప్పటివరకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా బీసీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. మెజార్టీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి బడ్జెట్‌ ‌లో నిధులు కేటాయించకుండా ఇంకా ఎంతకాలం ఆయా వర్గాలను ప్రభుత్వాలు మభ్యపెడతాయి… ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని లెనిన్‌ ఆలోచన  తర తరాలుగా  భారత రాజకీయాల లో నిజమవుతూనే ఉంది.
 – డాక్టర్‌ ‌తిరునాహరి శేషు, సామాజిక విశ్లేషకులు
కాకతీయ విశ్వవిద్యాలయం, 9885465877.

Leave a Reply