Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్యమా నీ జాడ ఎక్కడ..!?

‘‘‌గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో విపక్షాల గుండె గాయపడింది, చతికిలపడ్డ విపక్షాలను కెలికి లేపింది,దానితో విపక్షాలను ఏకం చేసింది. ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ అబద్దం, అహంకారం,నిరంకుశత్వం దుర్మార్గాలకు అంతం ఎంతో దూరంలో లేదు.కర్ణాటక నుండే ప్రారంభం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఎమర్జెన్సీ తలపించే విధంగా ఒకనాడు కాంగ్రెస్‌ ఏక పార్టీగా చలామణి అయితే అదే బాటలో బీజేపీ నడుస్తోంది.ఇందిరను మించిన నియంత నరేంద్ర మోదీ కి వ్యతిరేకంగా నిలువెత్తు నిరసన పతాకమవుతుంది.’’

భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటూ ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. బీజేపీ నాయకులు కూడా వందే భారత్‌, ‌భారత మాతాకీ జై అంటూ గొప్పగా చెబుతూ ఉంటారు . దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రం ఒంటబట్టించుకుని కేంద్రంలో అధికారంలో ఉండగానే అన్ని శక్తులను ఉపయోగించి వివిధ రాష్ట్రాలలో నయాన్నో, భయాన్నో బిజెపిని బలోపేతం చేయాలని, అన్ని రాష్ట్రాలలో పార్టీ నిర్మాణాన్ని విస్తరింప చేయాలని అనుకుంటున్నది. దాని నాయకత్వం లక్ష్య సాధన క్రమంలో బిజెపి సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, నైతికత  పూర్తిగా కోల్పోయింది.అధికారం కొరకు ఎటువంటి పద్ధతులనైనా అవలంబించి ఎవరినైనా బీజేపీలో చేర్చుకోవడానికి వాషింగ్‌ ‌పౌడర్‌ ‌నిర్మా అంటూ  అహరహం సిద్దపడుతున్నది. ఒక సిద్ధాంతం, దానిపై ఆధారపడి ఒక కార్యక్రమం, దానిని అమలు చేయడానికి ఒక రాజకీయ పార్టీ ఉంటుంది. అదే సిద్ధాంతం బీజేపీకి కల్సి వచ్చింది. బిజెపికి దేశంలో  ఏ రాష్ట్రంలో కూడా గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణం లేదు.ఉత్తర భారత దేశంలోనూ కొన్ని రాష్ట్రాల లోనే బిజెపికి స్థానిక గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం ఉంది.
నిజానికి దాని ఆధారంగానే బిజెపి అభివృద్ధి చెంది, అధికారం పొంది, దాని కార్యక్రమాన్ని అమలు చేసుకుంటే ఎల్లకాలం అధికారంలో ఉండమని నమ్మి, అడ్డదారుల్లో  పోతే  తప్ప బిజెపి తన సిద్దాంతం మనుగడ సాధించదని, నైతికత  ఆధారంగా దేశవ్యాప్త పార్టీగా అభివృద్ధి చెందే అవకాశం లేదని దాని నాయకత్వానికి అర్థం అయ్యింది కాబోలు.ముక్త కాంగ్రెస్‌ ‌పేరుతో  2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత దేశ ప్రజాస్వామ్యం మరింత హాస్యాస్పదంగా మారింది. దేశ గతిని మార్చడానికి 140కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని గ్రహించి, బీజేపీయేతర ప్రభుత్వాలపై విషం చిమ్ముతుంది. న్యాయదేవతను సైతం గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖునీ  చేస్తుందనే విమర్శ మూటగట్టుకుంది. 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యం   గోడకు కొట్టిన సున్నంలా  వెలసి పోయింది. ప్రశ్నిస్తే సంకెళ్ళు. నిర్బంధ శిలువలు, వజ్రోత్సవ వేళ అవినీతికి అధికారానికి అక్రమ బంధం కార్పొరేట్‌ ‌శక్తులు జైళ్లలో బందీలు కావాల్సిన ఆర్థిక ద్రోహులు పల్లకిలో షికార్లు కొట్టుతూ వోటుకు నోటుతో తాయిలాలు  ఇచ్చి  ఫిరాయింపులను ప్రోత్సహించి,జారుముడి ఇప్పినంత సులువు ప్రజాస్వామ్యం పచ్చ నోటై వెలిగే వేళ స్వాతంత్య్రం పేద ప్రజలకు కాకుండా అంబానీ అదానీల పెరట్లో లాభాల పూలై పూస్తోంది. ప్రజా ప్రతినిధులు సంతలో సరుకై దొరగారి దొడ్లచావిడిలో దొర్లుతూ దేశాన్ని ఏలుతున్నారు.
మొలకి తాయెత్తు.. నుదుట విభూది ఉన్మాదంతో మదమెక్కిన కషాయ పాలకులు విషం చిమ్ముతూ చిందులేస్తుంటే మువ్వన్నెల జెండా ఎగురుతూ కార్చిన కన్నీరు దరిద్రుని నోట్లో అమృత్‌ ‌కా ఆజాద్‌ అయింది. వందేమాతరం ప్రజల నినాదమైంది, ఇంక్విలాబ్‌ ‌దేశమంతా గర్జించింది. అల్లూరి, భగత్‌ ‌సింగ్‌ ‌లా  అమరత్వం జాతీయ జెండాలై ఎగిరాయి. ప్రజల త్యాగాల స్వాతంత్య్రం స్వర్ణోత్సవ వేళ ఉన్నోడి ఇంట్లో దీపమై వెలుగుతుంటే…కోట్ల మంది ప్రజలు చీకటి వాకిట్లో మగ్గిపోతున్నారు. అధికారం ఉన్న బీజేపీయేతర రాష్ట్రాల్లో ఎదిరించి పోరాడిన విపక్షాలను బెదిరించి చాలా మందిని బిజెపిలో చేర్చుకున్నారు కూడా. అయితే ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడక తప్పలేదు. తెలంగాణ లో కూడా బిజెపి కలలు కల్లలే అవుతాయి. సామాన్య ప్రజల పట్ల కనీస గౌరవం లేని, అహంకారపూరిత రాజ్యం. మనుషులను కేవలం వోటు వేసే ఒక జంతువుగానే చూస్తూ, మందు పోసి, పైసలిచ్చి కొనుక్కోవచ్చుననే దుర్మార్గపు మనస్తత్వం.ఇక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూల్చడమే ఒక అనైతిక, అప్రజాస్వామిక చర్య అయితే, విపక్ష నేతలను  బహిరంగంగా బెదిరిస్తున్నారు.  ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడే హక్కును కూడా కాలరాస్తున్న నిరంకుశత్వం తానతందానా  పాలన ఎప్పుడైనా ఊహించామా? తొమ్మిదేండ్లుగా కొనసాగుదంటే అతిశయోక్తికాదేమో.. లోక్‌ ‌సభలో అదాని అక్రమాలపై మోదీ  సర్కార్‌ ‌ను నిలదీసిన రాహుల్‌ ‌గాంధికి వస్తున్నా మద్దతు ఓర్వలేక, బీజేపీకి పుట్టగతులుండవని తన సొంత బలంతో గెలిచే సత్తా లేదని స్వయంగా గోబెల్స్ ‌ప్రచారం చేసి ఇలా ప్రభుత్వాలను, పార్టీలను కూల్చడం కూడా ప్రజాస్వామ్యమే అని ప్రజలకు చెప్పలని చూస్తున్నారు. భారత్‌ ‌జోడో యాత్రతో వచ్చిన ఆదరణతో ఖంగుతిన్న  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనైతికంగా రాహుల్‌ ‌గాంధీ పై అనర్హత వేసింది.
ఒకే ఒక్క చర్య  75 ఏండ్ల చరిత్రను తిరగరాసింది. దెబ్బ తీయడం బీజేపీ వంతు …దెబ్బ కాచుకోవడం విపక్షాల వంతు అయ్యింది.ఎన్నడో 2019 ఏప్రిల్‌ 13 ‌న మోదీ లను ఉద్దేశించి కర్నాటక కోలార్‌ ‌లో రాహుల్‌ ‌చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్నేష్‌ ‌మోదీ  సూరత్‌ ‌కోర్టులో పరువు నష్టం దావా వేస్తే యుద్ధ ప్రాతిపదికన సూరత్‌ ‌కోర్టు విచారణ స్వీకరించింది. జడ్జి దవే 2021 లో రాహుల్‌ ‌గాంధిని పిలిచి వివరణ కోరింది.అనంతరం జరిగిన పరిణామాలతో హైకోర్టు స్టే..ఏడాది పాటు పెండింగ్‌ ‌లో పెట్టింది.2023 లో రాహుల్‌ ‌కేసు విచారిస్తున్న జడ్జి దవే కు స్థాన చలనంతో కేసు తిరిగి తోడాలని బీజేపీ ఎమ్మేల్యే  పూర్నేష్‌ ‌మోదీ  సూరత్‌ ‌కోర్టు కేసు విచారణ నిలుపుదలను ఎత్తేయాలని ఫిబ్రవరి 16, 2023 న హైకోర్టును ఆశ్రయించడం.ఫిబ్రవరి 27, 2023న విచారణ, 23మార్చ్, 2023 ‌న తీర్పు చక,చక జరిగిపోయింది.ఇదే అదనుగా  మార్చ్ 24, 2024‌న విపక్ష నేత రాహుల్‌ ‌పై అనర్హత వేటు వేసి, కేంద్ర ప్రభుత్వ దుశ్చార్యకు పాల్పడింది. అంతటితో ఆగకుండా రాహుల్‌ ‌నివసిస్తున్న రెసిడెన్సీని కూడా యుద్ధ ప్రాతిపదికన ఖాలీ  చేయాలనీ నోటీసులు పంపింది.భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా విపక్షాలు నిరసన తెలిపాయి.
ప్రజలకు రాజ్యాంగం కల్పించిన వాక్‌ ‌స్వాతంత్య్రం మాదిరిగానే సమాచార హక్కు చట్టం ద్వారా వార్డు మెంబర్‌ ‌నుండి ప్రధానమంత్రి వరకు ప్రజలకు వివరాలు కోరే అవకాశం చట్టం కల్పించింది. అయితే ప్రధాని  మోదీ  చదివిన డిగ్రీ సర్టిఫికెట్స్ ‌బహిర్గతం చేయాలనీ  సమాచార హక్కు చట్టంను కోరితే ఇవ్వకుండా కోర్టు మెట్లెక్కితే  అదే గుజరాత్‌ ‌హైకోర్టు తాజాగా కేజ్రీవాల్‌ అడిగినందుకు 25 వేలు ఫైన్‌ ‌వేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. రాజ్యాంగ సంస్థలనే కాకుండా స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థపై బీజేపీ ప్రభావం పడిందనే విమర్శ ఉంది. సమాచారం ఇవ్వకుండా మోదీ  సర్కార్‌ ‌తూట్లు పొడిచింది.గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో విపక్షాల గుండె గాయపడింది, చతికిలపడ్డ విపక్షాలను కెలికి లేపింది,దానితో విపక్షాలను ఏకం చేసింది. ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ అబద్దం, అహంకారం,నిరంకుశత్వం దుర్మార్గాలకు అంతం ఎంతో దూరంలో లేదు.కర్ణాటక నుండే ప్రారంభం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఎమర్జెన్సీ తలపించే విధంగా ఒకనాడు కాంగ్రెస్‌ ఏక పార్టీ గా చలామణి అయితే అదే బాటలో బీజేపీ నడుస్తోంది.ఇందిరను మించిన నియంత నరేంద్ర మోదీ కి వ్యతిరేకంగా నిలువెత్తు నిరసన పతాకమవుతుంది.
image.png
డా।। సంగాని మల్లేశ్వర్‌
‌జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌, 9866255355.

Leave a Reply