Take a fresh look at your lifestyle.

ఆత్మహత్యలకు విరుగుడెక్కడ?

“‌స్వార్ధం పరాకాష్ఠకు చేరింది.వంచనతో దర్జాగా బ్రతికే వారు కొందరైతే, వ్యక్తిత్వంతో బ్రతికలేక జీవశ్ఛవాల్లా జీవితాంతం మనో వేదనతో బ్రతుకీడ్చే వారు మరికొందరు నేటి సమాజంలో అడుగడుగునా తారసపడతారు. తినడానికి తిండిలేక కొంతమంది విగతజీవులౌతుంటే, సకల సౌభాగ్యాలతో జీవిస్తూ, విలాసాల్లో తేలియాడుతూ, ఏదో అసంతృప్తితో ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు నేటి సమాజంలో మనకు అగుపిస్తున్నారు. యువశక్తి వ్యసనాలతో నిర్వీర్యమవుతున్నది. కలిమి కలత చెందుతున్నది. లేమి దిగులు చెందుతూ జీవనయానం సాగిస్తున్నది. ఒకవైపు మోదం-ఇంకోవైపు ఖేదం…ఇదే సామాజిక వైపరీత్యం.”

సమాజంలో పలు వైరుధ్యాలు తాండవిస్తున్నాయి. అహంకారమే తప్ప ఆలోచనా శక్తి లేని నూతన తరం రూపుదిద్దుకుం టున్నది.తరాల మధ్య అంతరం పెరిగింది.అంతరంగ మథనం లోపించింది. ‘‘తాను మునిగిందే గంగ,తాను వలచిందే రంభ…’’ చందంగా మూర? భావజాలం, ఆధిక్యతా ధోరణి మానవ మస్తిష్కం లో తిష్ఠవేసింది. స్వార్ధం పరాకాష్ఠకు చేరింది.వంచనతో దర్జాగా బ్రతికే వారు కొందరైతే, వ్యక్తిత్వంతో బ్రతికలేక జీవశ్ఛవాల్లా జీవితాంతం మనో వేదనతో బ్రతుకీడ్చే వారు మరికొందరు. నేటి సమాజంలో అడుగడుగునా తారసపడతారు. తినడానికి తిండిలేక కొంతమంది విగతజీవులౌతుంటే, సకల సౌభాగ్యాలతో జీవిస్తూ, విలాసాల్లో తేలియాడుతూ, ఏదో అసంతృప్తితో ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు. నేటి సమాజంలో మనకు అగుపిస్తున్నారు. యువశక్తి వ్యసనాలతో నిర్వీర్యమవుతున్నది. కలిమి కలత చెందుతున్నది. లేమి దిగులు చెందుతూ జీవనయానం సాగిస్తున్నది. ఒకవైపు మోదం-ఇంకోవైపు ఖేదం… ఇదే సామాజిక వైపరీత్యం. అంబరాన్ని తాకే సంబరంతో ఆడంబరాలతో దిగంబరం గా మారుతున్న నూతన విన్యాసం ఒక వైపు…జానెడు పొట్ట నింపుకోలేక, కట్టుకోవడానికి సరైన గుడ్డలేక, ఉండడానికి సరైన గూడులేక అలమటించే అభాగ్యుల దీనగాథలు మరో వైపు మానవ జీవితం లోని అంతరాలను వెక్కిరిస్తున్నాయి.

విందువినోదాల ఉల్లాసాలు వికాసానికా? విలువల విధ్వంసానికా? ఇది ప్రగతికి బాటలు వేస్తున్నదా? బీటలు పెడుతున్నదా? ఒకవైపు మధ్య తరగతి జీవుల బ్రతుకుల్లో హాలాహలం… మరో వైపు బరువెక్కిన కరెన్సీని విలాసాలకు వెచ్చిస్తూ కాలయాపన చేస్తున్న యువతరం కోలాహలం.ఇది కలానికందని కల్లోలం.సగటు జీవుల బ్రతుకుల్లోని వేదనలు కాలగర్భంలో దాగున్న కనబడని సుడిగుండాల వంటివి. కష్టాల సుడిగుండాలు బలపడి మృత్యు విహంగాలై జీవిత నావను తీరం దాటే తరుణంలో ప్రళయ ప్రభంజనమై ముంచేస్తున్నాయి. జీవనయానానికి ముగింపు నిస్తున్న సన్నివేశాలు హృద్యం…మరికొంతమందికి చోద్యం.కొందరి కంట కన్నీరు!కొందరి ఇంట సిరుల పన్నీరు!సేద్యంలో విలాపం.. స్వేదానికి దగ్గని ఫలితం.

కొందరి స్వేదం మరికొందరికి కరెన్సీగా మారి, కొంతమంది ధనిక యువత చేతిలో ఖరీదైన మద్యం సీసాలా పరివర్తన చెంది వెక్కిరిస్తే ఇది సమాజ వికాసమా? విలాపమా? ఒక చెంత ‘మందు’తో తనువు చాలిస్తున్న కర్షకుడు! మరోచెంత మందుతో గాండ్రిస్తున్న భోగలాలసుడు! విందు విలాసాలే జీవిత పరమార్ధంగా కొందరు బ్రతికేస్తున్నారు. ఆర్ధికంగా చితికి పోయి అతిదీనంగా మరికొందరు బ్రతుకీడ్చుతున్నారు. విలాసాల వినువీధుల్లో ఊరేగి,ఆశించింది అందక తనువు చాలిస్తున్నారు ఇంకొందరు! బతకాలని ఉన్నా బతకనీయని బడబాగ్ని జ్వాలలు చుట్టుముడుతుంటే, గరళాన్ని మింగుతున్న సగటు జీవుల వెతలు వర్ణనాతీతం. దేశానికి ‘ముద్ద’ పెడుతూ, ముద్ద లేక గతిస్తున్న కర్షకజన చరిత్ర ఆద్యంతం అత్యంత బాధాకరం.

విలాసాల్లో మునిగి ప్రేమ అంచుల దాకా పయనించి పతనమౌతున్న యువతరానికి ఉరిత్రాళ్ళే శరణ్య మౌతుంటే, కష్టాలను భరించలేని కర్షకునికీ ఆ ఉరిత్రాళ్ళే ఆలంబన అవుతున్నాయి.మధ్యతరగతి జీవుల ఆర్ధిక బాధలకు ఆత్మహత్యలే ఆఖరి అవకాశం గా మారుతున్నాయి. అందరి గమ్యం ఒకటై వెక్కిరిస్తుంటే చోద్యం చూడడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా విలపిస్తున్నాం. ఒకరిది అర్ధవంతమైన ఆవేదన,మరొకరిది అర్ధం లేని మనో వేదన. ఇరువురూ విషాద గేయానికి పల్లవులే.నిద్దురలేని రాత్రులలో ప్రపంచం వెక్కిరిస్తుంటే పలకలేని గేయానికి చరణాలే.స్వరం తప్పిన గీతికలే.బ్రతుకు వేదంలో శృతిలేని నాదాలే.ఇద్దరిదీ ఒకటే గమ్యం..అదే మరణం.విలాసాల మోజుకు బానిసలై కడకు ‘‘మనీ’’ లేక మినీ జీవితం గడపలేమని బలౌతున్న బడాయి జీవుల బతుకు చిత్రం ఒకరిదైతే, అహరహం స్వేదం చిందించి, దక్కని ఫలితం తో తనువు చాలిస్తున్న దైన్య చరిత మరొకరిది.ఇదే ఇరువురి జీవితాలలో కానరాని సారూప్యం…అడుగడుగునా వైరుధ్యం.ఆశించినది దక్కక ఒకరు. హృదయం బరువెక్కి, బతకలేక తనువు చాలిస్తున్నది మరొకరు.అర్ధవంతమైన జీవితాలకు ముగింపు మరణమా? అర్ధంలేని వ్యర్ధ వాదుల మనుగడకు మార్గమా?

విలాసాల విహంగంలా తేలియాడుతూ, కోరికల గుర్రాన్నెక్కి ఊహల్లో భ్రమిస్తూ పరిభ్రమిస్తున్న యువత తన లక్ష్యం మరచి, మత్తులో చిత్తవడం హాస్యాస్పదం. జల్సాలకు మరిగి, కోరింది దొరకలేదనే ఆవేశంతో ఆత్మహత్య లకు పాల్పడుతున్న వారు, ఒక్క క్షణం ఇతరుల జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలను తొంగిచూస్తే వారి సమస్యల ముందు తమ సమస్యలు అర్ధంలేని చిందరవందర గీతలుగా అగుపించక మానవు.

సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ, మానసిక ప్రశాంతత లోపించిన వారిని ఆత్మహత్యల నుండి కాపాడడానికి మానసిక నిపుణుల సాయం అవసరం. ప్రేమల పేరుతో,పరువు పేరుతో ప్రాణాలు తీసుకుంటున్న వారికి మానసిక వైద్యం అవసరం. బతకడానికున్న అన్ని దారులు మూసుకుపోయి, ఆర్ధిక బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని మానసిక నిపుణులు కాపాడలేరు. ఆర్ధిక బాధలను తీర్చే ఆపన్న హస్తాలే వారి ఆత్మహత్యల నివారణకు పరిష్కార మార్గాలు.
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463.

Leave a Reply