తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం అయితే కేసీఆర్ కు మాత్రం ఒక టాస్క్. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల హామీలను గత తొమ్మిది ఏళ్లుగా ఆవిష్కరిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో ముందస్తుగానే ఉపద్రవం పసిగట్టి కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్ టీఎస్ఐపాస్ అమల్లోకి తెచ్చారు. దానితో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారింది. అనతికాలంలోనే 1లక్ష 32వేల ఉద్యోగాలు భర్తీ చేసింది.దేశంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వం చేయని సాహసం చేసి కుంభ జాబ్ మేలా ప్రకటించింది.95శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవతీసుకుంది. అందులో భాగంగా 91,142 వేల ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయడం అంటే ఆషామాషీ కాదు.ఖలేజా ఉన్న నాయకుడు దేశ్ కీ నేత కేసీఆర్ తో మాత్రమే సాధ్యం అయ్యిందనేది జగద్విదితం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తూ టీఎస్పీఎస్సి మార్క్ తనదైన శైలిలో చూపెట్టింది. అక్కడ నుండే విపక్షాల గగ్గోలు, ఏడ్పు మొదలైంది. ఇక అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష దాడికి దిగింది.టీఎస్పీఎస్సి ఏర్పర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానం ఆ సంస్థకే పరిమితం అనేది తెల్సి కూడా మాజీ ఐపీఎస్ అధికారి రాజకీయాలకు ఒడిగట్టినారు. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకులంలోని ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని ప్రకటించారు.ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కాగానే రాజకీయ దురదతో ప్రభుత్వంపై నిందమోపడం ఎంతవరకు సమంజసం? కమిషన్ విధులు, విధానాలు తెలియని విపక్ష పార్టీల అధ్యక్షులు బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్, 2014కు ముందు కాంగ్రెస్ కోటి ఉద్యోగాల మాట ఏమైంది..? రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను తప్పుదారి పట్టించి లబ్ది పొందాలనే ఎత్తుగడ తెలంగాణలో చెల్లనేరదనేది జగద్విదితం.
తెలంగాణ తల్లి ఒక ప్రతీక అయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతీక కాకుండా పోవడం ఎందువల్ల జరుగుతుందో తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ యువత గుండెల్లో ఆక్రమించుకున్న చోటును విపక్షాలు విధ్వంసం చేసే ప్రయత్నం ముమ్మరం చేసింది. సాధారణ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్ది ,దక్షిణాదిన పాగావేయాలని పచ్చటి తెలంగాణలో నిప్పులు పోసుకుంటుంది. ఐటీ, ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో గడచిన తొమ్మిది ఏండ్లలో 3.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.మొత్తంగా 22.36 లక్షల ఉద్యోగాలు కల్పించిందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ ఇటీవల కాలంలో వెల్లడించింది. ఐటీ ఉద్యోగాల నియామకంలో 156 శాతం వృద్ధి సాధించింది. తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది.నిజంగానే ఎదగాలంటే ప్రజాసమస్యల మీద పోరాడే ప్రతిపక్షంగా వ్యవహరిస్తే, ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఆలా కాకుండా అబద్దపు మాటలతో నిత్యం వార్తల్లో ఉండడం,ప్రభుత్వాన్ని ధాటిగా విమర్శించడం పరిపాటి అయింది. అయితే తెలంగాణ ప్రజలు దురుసు, దూకుడు మాటలను ప్రజలు అన్ని సందర్భాలలోనూ నమ్మరు.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇష్టపడరు. పరుషంగా మాట్లాడే నేతల మీద గౌరవం కూడా ఉండదు.
-డాక్టర్ సంగని మల్లేశ్వర్,
జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్ – 9866255355