Take a fresh look at your lifestyle.

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు మోక్షమెప్పుడు..?

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారికి కావల్సినంతగా అవకాశాలు రావడంలేదు. ఆకాశంలో సగం అని చెబుతున్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా పోటీ పడే అవకాశాలు వారికి లభించడంలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అక్కడ వారి ప్రతిభను చూపించుకునే వీలు లేకుండా పురుషుల పెత్తనం అడ్డుపడుతోంది. ఉదాహరణకు గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా వారు ఎన్నికైనప్పటికీ గ్రామ సభల్లో మాత్రం వారి భర్తలు హాజరు కావడం, నిర్ణయాలు వారు తీసుకోవడం నేటికీ జరుగుతున్న ప్రక్రియ. అలాగే శాసనసభల్లో, పార్లమెంటులోకూడా వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండడమే ఈ రోజు జంతర్‌ ‌మంతర్‌ ‌దగ్గర ధర్నాకు కారణంగా మారింది. తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ బిజెపి ప్రభుత్వం ఈ విషయంలో తాత్సర్యం చేయడాన్ని విపక్షాలు దుయ్యబడుతున్నాయి.

ప్రతీ సంవత్సరం  మహిళా దినోత్సవాల సందర్భంలో ఈ బిల్లుపై వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు,  స్వచ్ఛంద సంస్థలు డిమాండ్‌ ‌చేస్తూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా దిల్లీలో మహిళలు శుక్రవారం తమ నిరసన దీక్ష చేపట్టారు. దీనికి తెలంగాణ ప్రభుత్వ అధికార పార్టీకి చెందిన ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత సారధ్యం వహించడంతో దీనికిప్పుడు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.  కవిత నెలకొల్పిన జాగృతీ సంస్థ ద్వారా  చేపట్టిన ఈ దీక్షలో  సిపిఐ, ఎన్సీపీ, టిఎంసీ, సమాజ్‌వాది పార్టీ, డిఎంకె, ఆప్‌, ‌నేషనల్‌ ‌కాన్ఫరెన్స్,  ‌శివసేన, పీడీపీ, జేడీయు, ఆర్జేడీ, అకాలీదళ్‌, ‌జేఎంఎం లాంటి నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న దాదాపు పద్దెనిమిది విపక్షాలు  దిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై దీక్ష చేపట్టిన కవితకు మద్దతు పలికాయి. దీక్ష శిబిరంలో ఆయా పార్టీలకు చెందిన మహిళా నేతల తోసహా పలువురు సీనియర్‌ ‌నాయకులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ దీక్షా శిభిరాన్ని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించడం మరింత ప్రాధాన్నతను సంతరించుకుంది. బిజెపి ప్రభుత్వానికి నిజంగానే మహిళలపైన గౌరవం, ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందేవిదంగా ప్రధాని నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలని వారీ సందర్భంగా డిమాండ్‌ ‌చేశారు.

సరిగ్గా 27 ఏళ్ళ కింద మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును పార్లమెంటులో మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పటి నుండి నేటి వరకు ఈ బిల్లుపై చట్టసభల్లో, బయట చర్చలు జరుగుతూనే ఉన్నాయి.  వాస్తవంగా 1993లో గ్రామ పంచాయితీల్లో మహిళా రిజర్వేషన్లును కల్పిస్తూ  రాజ్యాంగ సవరణ చేసినప్పటినుండీ చట్టసభల్లోకూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించాలన్న ఆందోళన  కొనసాగుతూనే ఉంది. మహిళల్లో నిగూఢంగా దాగి ఉన్న వారి ప్రతిభా పాటవాలను దేశంకోసం , ప్రజా క్షేమంకోసం వినియోగించుకోవాలంటే వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనన్న నినాదం యావత్‌ ‌దేశం పాకింది. కాగా,  1996 సెప్టెంబర్‌ 12‌న హెచ్‌డి దేవెగౌడ ప్రధానిగా యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వం పార్లమెంట్‌తో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని మొదటిసారిగా బిల్లును ప్రవేశపెట్టింది. 1998, 1999, 2002లో కూడా ప్రయత్నాలు జరిగినా బిల్లు మాత్రం ఆమోదానికి నోచుకోలేదు.  ఆ తర్వాత 2003లో  ప్రధానిగా వాజ్‌పాయ్‌ ‌ప్రభుత్వం కొంతవరకు ప్రయత్నించినా  బిల్లుకు అమోదం లభించలేదు. ఒకటికి రెండు సార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినా అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

2004 స్వార్వత్రిక ఎన్నికల్లో యుపిఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో అధికారంలోకి రాగానే లోకసభ, శాసనసభల్లో మూడింట ఒకవంతు స్థానాలను మహిళలకు కేటాయించే విధంగా కృషి చేస్తామని చెప్పింది. దానికి బిజెపి కూడా మద్దతు పలికినప్పటికీ కొన్ని కండీషన్లు పెట్టింది. దీంతో ఈ బిల్లుకు  కాలదోషం పట్టకుండా ఉండేందుకు 2008లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఫలితంగా 2010 మార్చ్ 10‌న రాజ్యసభ ఈ బిల్లుపై ఆమోదం లభించింది. కాని, లోకసభ గడప దాటకుండా పోయింది. కారణం.. లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌నేతృత్వంలోని ఆర్‌జెడితో సహా మరికొన్ని ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు వెనుకబడిన కులాలలకు చెందిన మహిళలకు ఇందులో ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలని భీష్మించుకుని కూర్చున్నాయి. చివరగా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ నేటివరకు అమోదం లభించలేదు. గతంలో అధికార పార్టీకి సంఖ్యాబలం తక్కువ ఉండటంవల్ల బిల్లు అమోదానికి నోచుకోలేదు. కాని, ఇప్పుడు పార్లమెంటులో బిజెపికి తగిన బలంఉన్నా  అమోదం తెలపకపోవాడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
ఇదిలాఉంటే మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు విషయం ఇప్పుడే కవితకు గుర్తుకు రావడంపై బిజెపి నేతలు ఛలోక్తులు విసురుతున్నారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో  కవితకు ఈడి నోటీసులు రావడంతో ప్రజల దృష్టిని మళ్ళించేందుకే రిజర్వేషన్‌ ‌నినాదాన్ని ఎత్తుకుందని వారు విమర్శిస్తుండగా, కేంద్రాన్ని ప్రశ్నిస్తేచాలు వారిపైన ఈడి, సిబీఐలను ప్రయోగించి తమదారికి తెచ్చుకోవాలని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

Leave a Reply