Take a fresh look at your lifestyle.

కొరోనా నియంత్రణపై ఇంకా ఎప్పుడు మేల్కొంటారు ?

  • ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
  • నైట్‌ ‌కర్ఫ్యూతో కేసులు తగ్గాయన్న ఏజీ
  • ఎక్కడ తగ్గాయో చూపించాలన్న హైకోర్టు
  • 26లోగా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా నియంత్రణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు సెకండ్‌ ‌వేవ్‌ ‌ముంచుకొస్తున్నా ఇంకెప్పుడు మేల్కొంటారని ప్రశ్నించింది. రాష్ట్రవ్యాప్తంగా కొరోనా పరీక్షలు, చికిత్సలు, నియంత్రణపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, డీహెచ్‌ శ్రీ‌నివాస్‌ ‌హాజరయ్యారు.  ఈనెల 1 నుంచి 21 వరకు దాదాపు 20 లక్షల కోవిడ్‌ ‌పరీక్షలు నిర్వహించామనీ, 16.17 లక్షల ర్యాపిడ్‌ ‌పరీక్షలు, దాదాపు 4 లక్షల ఆర్‌టిపిసిఆర్‌ ‌పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షలు 8 లక్షలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది. కెరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌పొంచి ఉందని ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమైందని ప్రశ్నించింది.

ముప్పు తీరా ముంచుకొచ్చాక మేల్కొంటారా ? అని అసహనం వ్యక్తం చేసింది. దీనికి ఏజి సమాధానమిస్తూ నైట్‌ ‌కర్ఫ్యూ విధించాక రాష్ట్రంలో కొరోనా కేసులు తగ్గాయని సమాధానం ఇచ్చారు. దీంతో నైట్‌ ‌కర్ఫ్యూ విధించిన తరువాత కేసులు ఎక్కడ తగ్గాయో చూపించాలని ప్రశ్నించింది. థియేటర్లు, షాపింగ్‌ ‌మాల్స్, ‌హోటళ్లు, బార్లలో జన సమర్మర్థాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారనీ, పెళ్లిళ్లు, అంత్యక్రియలు, సభలు, ఎన్నికల ర్యాలీలపై ఎందుకు ఆంక్షలు విధించలేదని ప్రశ్నించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఆంక్షలు ఉన్నప్పుడు ఎన్నికలు అతీతమా ? రెండు నెలల వ్యవధిలో నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులు ఏమిటో వెల్లడించాలని పేర్కొంది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న జిల్లాలలో ఆర్టీపీసిఆర్‌ ‌పరీక్షల సంఖ్య పెంచాలనీ, ఈ పరీక్షల ఫలితాలు 24  గంటలలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆక్సీజన్‌, ఔషధాల కొరతపై నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాష్ట్రానికి  రెమ్‌డెసివిర్‌ ఇం‌జక్షన్తు తక్కువ సంఖ్యలో ఎందుకు పంపిణీ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి కోవిడ్‌ ‌టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో దానికి సంబంఢించి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసిందో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.

Leave a Reply