Take a fresh look at your lifestyle.

ఆగస్టు పదిహేనుకు ‘కొరోనా’నుండి స్చేచ్ఛ లభించేనా..?

దేశ ప్రజలందరి దృష్టి ఇప్పుడు ఆగస్టు పదిహేను పై ఉంది. ఈ పంద్రా ఆగస్టునాటి నుండి భారత్‌ ‌కొరోనాతో విముక్తి పొందుతామన్న ఆశ అందరిలో కలుగుతున్నది . ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొరోనా వైరస్‌కు ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి వ్యాక్సిన్‌ ‌బయటికి రాలేదు. దీనిపై దాదాపు అన్ని దేశాలు యుద్ద ప్రాతిపధికన పరిశోధనలు చేస్తున్నాయి. కాని, ఇప్పట్లో వాక్సిన్‌ ‌రావడం అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను మొదటగా మనదేశమే కనుగొనబోతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా  తెలంగాణనుండే వాక్సిన్‌ ‌బయటికి రానున్నట్లు చెబుతున్నది . ఏదిఏమైనా ఆగస్టు పదిహేనున వాక్సిన్‌ను విడుదలచేసేందుకు శాస్త్రవేత్తలు రాత్రిబవళ్ళు కష్టపడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే క్లినికల్‌ ‌ట్రయల్స్‌న్ ‌కూడా వేగవంతం చేసినట్లు ప్రకటనలు వొస్తున్నాయి. ఇదే నిజమైతే కొరోనా వ్యాక్సిన్‌ ‌తయారిలో మొట్టమొదట విజయం సాధించిన ఘనత భారత్‌కు దక్కుతుంది. భారతీయ కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ (ఐసిఎంఆర్‌), ‌భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారుచేస్తుంది.

బిబివి152 వ్యాక్సిన్‌ ‌పేరుతో తయారవుతున్న దీనిని ఎయిమ్స్‌తో సహా దేశంలోని పదమూడు హాస్పిటల్స్ ల్లో క్లినికల్‌ ‌ట్రయల్స్‌ను  వేగవంతం చేస్తున్నారు. అనంతరం మానవులపై ఈ టీకా పరీక్షలు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే  టీకా బయటికి వొచ్చే విషయంలో బేధాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ టీకా ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న వైద్యుల ప్రకారం మనుష్యులపై పరీక్షలు ప్రారంభించడానికి ఇంకా వారంపైన సమయం పడుతుందని చెబుతుంటే, మరికొందురు శాస్త్రవేత్తలు సెప్టెంబర్‌ ‌వరకు పడుతుందంటుండగా, ఇంకొందరైతే కనీసం తొమ్మిది నెలల సమయం సులభంగా పడుతుందని చెబుతున్నారు. ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ ‌చెబుతున్నట్లు ఆగస్టు పదిహేను వరకు కోవిడ్‌ 19 ‌వ్యాక్సిన్‌ ‌రావడం అంత తేలికైన పనికాదని ఢిల్లీలోని ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా చెబుతున్నారు. ఒకవేళ పరీక్షలన్నీ అయినప్పటికీ టీకా మార్కెట్‌లోకి రావడానికి మరికొంత సమయం తప్పక పడుతుందంటున్నారు. మార్కెట్‌ ‌చేసేముందు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ‌సైంటిస్ట్ ‌సౌమ్య స్వామినాథన్‌కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని వ్యాక్సిన్‌ ‌బయటికి రావడానికి  కనీసం ఆరునుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని చెప్పారు. రోగ నిరోధక శక్తిని పెంచే సామర్ద్యం ఒక్కటే కొరోనా వ్యాక్సిన్‌  ‌విశ్వసనీయతకు ప్రాతిపధిక కాదంటారామె. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ ఉం‌డాల్సి    ఉంటుందన్నారు.  దీనిద్వారా ఈ ఏడాదిలోపునైతే వ్యాక్సిన్‌ ‌రాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో  ఇంతకూ ఈ వ్యాక్సిన్‌ ఎప్పుడు బయటికి వొస్తుందనే విషయంలో పెద్ద గందరగోళమే ఏర్పడింది.  ఈ విషయంలో దేశంలో పెద్ద రాజకీయ విమర్శలు చోటుచేసుకున్నాయి.

సైంటిస్ట్‌లు, ఇతర నిపుణులు అనేకమంది  దీనిపై అనేక రకాల అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. కాగా ప్రస్తుతం  బారత దేశానికి చెందిన క్యాడిలా, సీరం ఇన్‌స్టిట్యూట్‌, ‌హెటిరో ఫార్మ కంపెనీలు కొరోనా వైరస్‌ ‌వ్యాక్సిన్‌ ‌తయారీలో బిజీగా ఉన్నాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో టీకాను తయారు చేస్తున్నారు. జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌ ‌కంపెనీ జూలై 15 నుంచి మనుషుల పై ట్రయల్స్ ‌నిర్వహించేందుకు ప్రణాళికను సిద్దం చేసినట్లు తెలుస్తున్నది.  ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్‌ ‌వైపు చూస్తున్నాయి. కొరోనా ను పారదోలి, మారణహననాన్ని తగ్గించడంలో భారత్‌ ‌మరోసారి ప్రపంచంలో ఘనకీర్తిని పొందే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే బ్రిటీష్‌ ‌సంస్థ ఆస్ట్రాజెనికా, యూఎస్‌ ‌సంస్థ మెడెర్నాలు భారత్‌ ‌కంపెనీలతో తమ వ్యాక్సిన్‌ ‌తయారీకి ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు కేంద్రం పేర్కొంది. వ్యాక్సిన్‌ ‌మొదటిసారిగా ఎవరికివ్వాలన్నదానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి.  కోవిద్‌ 19‌పై ముందు వరుసలో ఉండి పోరాటం సాగిస్తున్న వైద్యులకు తొలుత ఈ వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. వైరస్‌తో అత్యధికంగా బాధను అనుభవిస్తున్న ప్రాంత ప్రజలకు రెండవ ప్రాధన్యతగా ఆయన సూచించినట్లు తెలుస్తున్నది. ఇది ఇలా  ఉంటే దేశంలో కొరోనా పాజిటివ్‌కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఒక్క రోజున్నే దేశంలో 25వేల మందికి కొత్తగా వైరస్‌ ‌సోకినట్లు నిర్దారణఅయింది. దీంతో దేశంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరుకుంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. గడచిన నాలుగైదు రోజుల్లో ఒక్కో రోజులోనే వేల సంఖ్యలో పాజిటివ్‌ ‌కేసులను గుర్తించడం జరిగింది . దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. బయటికి వెళ్ళాలంటేనే వణుకుపుచ్చుకొస్తున్నది. వెళ్ళకపోతే తప్పేట్లులేదు. ఎవరిద్వారా ఎలా సంక్రమిస్తుందో తెలియని పరిస్థితి. అందుకు ప్రజలంతా ఆగస్టు 15 కోసం ఎదురు చూస్తున్నారు.  వ్యాక్సిన్‌ ‌బయటికి వొస్తే కొరోనా తో ధైర్యంగా పోరాడవచ్చన్న ఆలోచనలో ప్రజలున్నారు.

Leave a Reply